(Source: ECI/ABP News/ABP Majha)
Robot Orchestra Conductor: ఆర్కెస్ట్రా కండక్టర్ అవతారమెత్తిన రోబో, దక్షిణ కొరియాలో టెక్నాలజీ అద్భుతం
Robot Orchestra Conductor: ఆండ్రాయిడ్ రోబో దక్షిణ కొరియాలో అద్భుతం చేసింది. ఆర్కెస్ట్రా ప్రదర్శనకు కండక్టర్ గా వ్యవహరించింది.
Robot Orchestra Conductor: రోజు రోజుకూ సాంకేతికత అభివృద్ధి చెందుతూ వింతలు చూపిస్తోంది. టెక్నాలజీలో జరుగుతున్న అద్భుతాలు చూసి ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఒకప్పుడు యంత్రాలు కేవలం కొన్ని తరహా పనులు మాత్రమే చేయగలుగుతాయని, కళలు, కళాత్మక రంగంలో, సృజనాత్మకంగా ఆలోచించలేవని చాలా మంది భావించే వారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి అత్యాధునిక సాంకేతికతతో యంత్రాలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నాయి. కృత్రిమ మేధ చేస్తున్న అద్భుతాలు ఇప్పటికే చూస్తూనే ఉన్నాం. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతల ఆధారంగా హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పుడు కొన్ని రంగాల్లో మనుషులకు మించి ప్రతిభ కనబరుస్తున్నాయి.
తాజాగా దక్షిణ కొరియాలో కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ రూపొందించిన ఓ హ్యూమనాయిడ్ రోబో ఆర్కెస్ట్రాకు కండక్టర్ గా వ్యవహరించింది. దక్షిణ కొరియా జాతీయ ఆర్కెస్ట్రా ప్రదర్శనకు నాయకత్వం వహించింది. ఇలా ఓ రోబో ఆర్కెస్ట్రా బృందాన్ని నడిపించి అద్బుతమైన ప్రదర్శన ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. కొరియాలోని నేషనల్ థియేటర్ లో.. దేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసులు కలిగిన ఆర్కెస్ట్రా బృందానికి ఈ రోబో నాయకత్వం వహించింది. వేదికపైకి వచ్చిన రోబో మొదట ప్రేక్షకులకు నమస్కరించింది. అనంతరం ప్రదర్శనకు అనుగుణంగా చేతులు ఊపడం ప్రారంభించింది. రోబో చేతుల కదలికలు చాలా వివరంగా ఉన్నాయని.. రోబోతో పాటు ఆర్కెస్ట్రా ప్రదర్శనకు నాయకత్వం వహించిన చోయ్ సూ-యోల్ తెలిపారు. తాను ఊహించిన దాని కంటే కూడా చాలా మెరుగ్గా ప్రదర్శన ఇచ్చిందని, వివరణాత్మక కదలికలను చూపించందని ప్రశంసించారు.
రోబో కండక్టర్ గా వ్యవహరించడంపై ఆర్కెస్ట్రా ప్రేక్షకులు స్పందించారు. రోబో కదలికలు ఆర్కెస్ట్రా బృందాన్ని ముందుండి నడిపించిన తీరును ప్రశంసిస్తూనే.. ఇంకెంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పారు. ఇంకొన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉందన్నారు.
Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?
మనిషికి నాలుగు రోబో చేతులు ఆవిష్కరించిన జపాన్ కంపెనీ
మనిషికి రెండు చేతులు కాదు, ఏకంగా ఆరు చేతులు ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో నాలుగు రోబో చేతులు తయారు చేశారు. వాటిని వెనక వీపుకు తగిలించుకుంటే చాలు. రెండు చేతులే ఉండాల్సిన మనుషులకు ఏలియన్లకు ఉన్నట్లుగా ఆరు చేతులు వచ్చేస్తాయి. స్పైడర్ మ్యాన్ సినిమాలో విలన్ కు ఉన్నట్లుగా వీపు నుంచి ఈ చేతులు మన చేతుల్లాగే పనులు చేస్తుంటాయి. ఈ విచిత్రమైన ఆలోచనకు రూపం ఇచ్చి ప్రాణం పోసింది ఇనామి బృందం. ఈ ఇనామి బృందం ఇలాంటి వింత రోబోలను ఇప్పటికే కొన్ని తీసుకువచ్చింది. టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ఈ మసాహికో ఇనామి శాస్త్రవేత్తల బృందం.. జిజాయ్ అనే ఆలోచనతో కొత్త తరహా ఆలోచనలతో రోబోలకు రూపం ఇస్తోంది. జిజాయ్ అంటే జపాన్ భాషలో స్వయం ప్రతిపత్తి అని, ఒకరికి ఇష్టం వచ్చినట్లుగా స్వేచ్ఛగా జీవించడం అనే అర్థాలను సూచిస్తుంది. సంప్రదాయ జపనీస్ తోలు బొమ్మలాట నుంచి, నవలా రచయిత్రి యసునారి కవాబాటా రాసిన ఓ చిన్న హార్రర్ కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ రోబో చేతులను రూపొందించినట్లు శాస్త్రవేత్త ఇనామి వెల్లడించారు. ఓ సంగీతకారుడికి తన వాయిద్యం ఎలా శరీరంలో ఓ భాగంగా మారిపోతుందో.. ఈ రోబో చేతులు కూడా శరీరంలో ఓ భాగంగా మారిపోతాయని ఆకాంక్షిస్తున్నారు ఇనామి. ఈ రోబో చేతులు మనుషులకు ఏమాత్రం ప్రత్యర్థి కాదని, కానీ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial