G7 Summit on Afghanistan Crisis: అప్గాన్ సంక్షోభంపై జీ7 నేతల చర్చ: యూకే ప్రధాని జాన్సన్ వెల్లడి
అప్గానిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభంపై చర్చించేందుకు జీ7 కూటమి సిద్ధమైంది. జీ7 కూటమి నేతలంతా అప్గాన్ సంక్షోభ పరిస్థితులపై చర్చించనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
అప్గానిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభంపై చర్చించేందుకు జీ7 కూటమి సిద్ధమైంది. మంగళవారం నాడు జీ7 కూటమి నేతలంతా అప్గాన్ సంక్షోభ పరిస్థితులపై చర్చించనున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. అప్గాన్‌లో నెలకొన్న పరిస్థితులను నిరోధించేందుకు మార్గాలను అన్వేషించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరనున్నట్లు తెలిపారు. అప్గాన్‌లో నెలకొన్న మానవ సంక్షోభాన్ని నివారించడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్గాన్ ప్రజలకు చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
I will convene G7 leaders on Tuesday for urgent talks on the situation in Afghanistan. It is vital that the international community works together to ensure safe evacuations, prevent a humanitarian crisis and support the Afghan people to secure the gains of the last 20 years.
— Boris Johnson (@BorisJohnson) August 22, 2021
గత కొద్ది రోజులుగా అప్గనిస్తాన్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గాన్ దేశాన్ని స్వాధీనం చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశ ప్రజలంతా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. సాయం కోసం ప్రపంచ దేశాల వైపునకు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించేందుకు భారత్, అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాయి. అత్యవసర విమానాలను నడుపుతూ పౌరులను సురక్షితంగా తరలిస్తున్నాయి.
అఫ్గాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 392 మంది..
అఫ్గానిస్తాన్ నుంచి 392 మంది సురక్షితంగా ఇండియా చేరుకున్నారు. ఆదివారం నాడు మొత్తం 3 విమానాల ద్వారా వీరంతా భారతదేశానికి వచ్చారు. వీరిలో 168 మంది కాబూల్ నుంచి, 87 మంది దుషాంబే నుంచి, 135 మంది దోహా మీదుగా ఇండియా చేరుకున్నారు. ఇండియా చేరుకున్న వారిలో భారతీయులతోపాటు అఫ్గానీ సిక్కులు, హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. భారత వైమానికి దళానికి చెందిన సీ-17 హెవీ లిఫ్ట్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానంలో మొత్తం 168 మంది కాబూల్ నుంచి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ విమానంలో 107 మంది భారతీయులతోపాటు, అఫ్గాన్ సిక్కులు, హిందువులు, ముస్లింలు ఉన్నారు.
Read More: Kabul Evacuation: అఫ్గాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 392 మంది.. వైరల్ అవుతోన్న చిన్నారి వీడియో