Vaikunta Ekadasi News: తిరుమల సహా వివిధ దేవాలయాల్లో తెరుచుకున్న వైకుంఠ ద్వారం- పోటెత్తిన భక్త జనం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామున 1:30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానిక పక్కనే ఉన్న వైకుంఠ ద్వారం తెరిచారు.
Vaikunta Ekadasi News: తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకవజాము నుంచి తెరుచుకున్న వైకుంఠ ద్వారం గుండా స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా తిరుమలలో ఏడు కొండలు పూర్తిగా జనంతో నిండిపోయాయి. విఐపీలు, సామాన్యులు అంతా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పరవశించిపోతున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వారం తెరుచుకుంది. శనివారం వేకువజామున 1:30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానిక పక్కనే ఉన్న వైకుంఠ ద్వారం తెరిచారు.
ముందుగా శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేసిన తర్వాత భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి టిటిడి అధికారులు అనుమతించారు. ఈ సందర్భంగా టిటిడి పాలక మండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినంను తిరుమలలో ఘనం నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులంతా చాలా సంతృప్తితో వైకుంఠ ద్వరం గుండా స్వామి వారిని దర్శించి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించడంలో టిటిడి సఫలం అయ్యిందన్నారు. అనంతరం టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం 1:40 గంటలకు ప్రారంభమైందన్నారు. మొత్తం 4వేల విఐపి టోకెన్లు జారీ చేయగా 3,850 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయినట్టు వెల్లడించారు. వేకువజామున 1:40కి ప్రారంభంమైన విఐపి బ్రేక్ దర్శనాలు ఉదయం 5:15కి ముగిసిందన్నారు.
ఎస్ఎస్డి, ఎస్ఈడి స్లాట్స్‌ను ఉదయం 6 గంటలకు ఇచ్చామని ధర్మారెడ్డి తెలిపారు. 45 నిమిషాల ముందే సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించామని వివరించారు. ప్రతి స్లాట్ కూడా గంటన్నర ముందుగా తీసుకుని వైకుంఠంలో కూర్చోబెట్టి, భక్తులకు దర్శనం చేయించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
ఒక వేళ భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే పరిస్ధితి వస్తే, గంటా, రెండు గంటల కంటే ఎక్కువ సేపు వేచి ఉండే పని ఉండదని, భక్తులందరికి ఆహార పదార్థాలు, కాఫీ, టీ,పాలు అందిస్తున్నామని ఈవో వెల్లడించారు. తిరుపతిలో ఉచిత టోకెన్ల జారీ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశామన్నారు. ఎస్ఎస్డి, ఎస్ఈడి టోకెన్లు కలిపి ప్రతి రోజు స్వామి వారి కైంకర్యాలు బట్టీ రోజుకి 70 నుంచి 75 వేల మందికి దర్శనం కల్పిస్తామన్నారు. పది రోజుల్లో ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలియజేశారు..