Sajjala Ramakrishna Reddy: అంగన్‌వాడీల సమ్మెలో రాజకీయ కుట్ర, ఆ ఉచ్చులో పడొద్దు - సజ్జల
YSRCP News: తాడేపల్లిలో సోమవారం రాత్రి (జనవరి 8) సజ్జల రామక్రిష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనలపై అనేక స్థాయిల్లో తాము చర్చించామని అన్నారు.
Sajjala Ramakrishna Reddy Comments: ఏపీలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మె వెనుక పక్కాగా రాజకీయ కోణం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో వారి ఆడియోలను తాము విన్నామని చెప్పారు. కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. రాజకీయ అజెండాకి ఎవరూ బలి కావద్దని అన్నారు. ప్రభుత్వం తరపున చేయాల్సినవి అన్నీ చేస్తున్నామని వెల్లడించారు. గర్భిణీలు, పసి పిల్లలను ఇబ్బందులు పెట్టొద్దని.. పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూస్తుందని వివరించారు. అంగన్ వాడీ కార్యకర్తలు రాజకీయ అజెండాలకు బలికావొద్దని అన్నారు. ఈ విషయం గురించి తాడేపల్లిలో సోమవారం రాత్రి (జనవరి 8) సజ్జల రామక్రిష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనలపై అనేక స్థాయిల్లో తాము చర్చించామని అన్నారు.
మున్సిపల్ కార్మికులు కూడా రాజకీయ కుట్రలకు బలికావొద్దని సజ్జల అన్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్ వాడీ వర్కర్లను రెచ్చగొడుతూ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. వారి వలలో చిక్కుకోకుండా అంగన్ వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు జాగ్రత్త వహించాలని అన్నారు. ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని.. పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా అని ఆలోచించాలని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్‌వాడీలకు అన్యాయం చేశారని సజ్జల అన్నారు. సమ్మె విరమించాల్సిందిగా అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులను తాము కోరుతున్నామని.. సమ్మె కొనసాగిస్తే కనుక నోటీసులు ఇస్తామని అన్నారు. ఆ తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.