Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు
Pawan Kalyan Comments: ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను జనసేన పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వాదులంతా గోరంట్లపై జరిగిన దాడిని ఖండించాలన్నారు.
Pawan Kalyan Comments: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులు ఏంటని వైసీపీని ఉద్దేశించి ఆయన ఫైర్ అయ్యారు. చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలని అన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్గుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని అన్నారు. జీవో నెంబర్ 1 పై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించక పోవడం దారుణం అన్నారు.
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి మీడియా ద్వారా అందుతున్న సమాచారం చూస్తే.. ఈ పరిణామాలు దురదృష్టకరం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. ప్రజల గొంతు పీల్చే జీఓ నెం. 1, బుచ్చయ్య చౌదరిపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండించాలని ఎమ్మెల్యేలు డి.బి.వి.స్వామి, జి.ప్రజాస్వామ్యవాదులు కోరిన ప్రతిపక్ష పార్టీ టీడీపీ శాసనసభ్యులపై అధికారపక్షం దాడిని ఖండిస్తున్నాను. శాసన సభల్లో అర్థవంతమైన చర్చలు జరిపి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తున్నాం. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన వాటిని పరిపాలనా విధానాల్లో చర్చించాలి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ తరహా దాడులు శాసనసభ నుంచి వీధుల్లోకి వస్తాయి. ఇలాంటి పరిణామం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. అన్నింటిలో మొదటిది, శాసనసభ గౌరవాన్ని మరియు గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత అసెంబ్లీ నాయకుడు మరియు అధ్యక్షత వహించే అధికారులపై ముఖ్యమంత్రిపై ఉంది." - పవన్ కల్యాణ్, జనసేన అధినేత
సీపీఐ నారాయణ ఫైర్..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లు మనుషులా? పశువులా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉందన్నారు. ఆరు, ఏడు తరగతుల వాళ్లకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆక్షేపించారు. అయినా సరే ఓడిపోవడంతో వైసీపీ నేతలు నిరాశలో కూరుకుపోయారన్నారు. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా? అని ప్రశ్నించారు. స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉందని, ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.
"అధికారం, సీఎం పదవి శాశ్వతం కాదు. రేపు మీరు అటు వైపు ఉంటారు. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని, బాధితులను సస్పెండ్ చేయడం తగదు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు" - సీపీఐ నారాయణ
అసెంబ్లీలో ఉద్రిక్తత
ఏపీ అసెంబ్లీలో నేడు విపరీతమైన ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి ఆందోళన తెలిపారు. జీవో నెంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు.. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపైనా వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఆరోపించారు. అయితే, ఈ ఉద్రిక్తత ప్రారంభం అవుతుండగానే, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాత్రం.. తనపై చంద్రబాబు దాడి చేయించారని, అందుకే డోలా బాలవీరాంజనేయులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఆ క్రమంలో తన చేతికి గాయం కూడా అయిందని అసెంబ్లీ బయట మీడియాకు చూపించారు. దానికి సంబంధించిన విజువల్‌ను స్పీకర్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.