Deepa Mohanan: ఎవరీ దీపా మోహనన్.. ఎంజీ యూనివర్సిటీలో నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు?
కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఓ పీహెచ్ డీ స్కాలర్ తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? ఏం జరిగింది?
కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పీహెచ్ డీ స్కాలర్ దీపా పీ మోహనన్ తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తన పీహెచ్‌డీ కోర్సు పూర్తి చేయడంలో యూనివర్సిటీ అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనేది ఆమె ఆరోపణ. దళిత వర్గానికి చెందిన దీపా పి మోహనన్.. పదేళ్లుగా యూనివర్సిటీలో ఒక వర్గం కుల వివక్షకు గురవుతుందని ఆరోపిస్తున్నారు.
కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన దీపా పీ మోహనన్ నానోసైన్స్‌లో ఎంఫిల్ చేయడం కోసం కొట్టాయం జిల్లాలోని ఎంజీ యూనివర్సిటీలో 2011-12లో చేరారు. ఇంటర్నేషనల్ మరియు ఇంటర్ యూనివర్శిటీ సెంటర్ లేదా నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ (IIUCNN) టాప్ ఫ్యాకల్టీ నుంచి వివక్షను ఎదుర్కొంటున్నట్టు మోహనన్ చెబుతున్నారు.
గతంలో విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి లైంగిక వేధింపుల ఎదుర్కొన్నట్టు కూడా ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని యూనివర్శిటీ అధికారులకు తెలియజేసినా.. పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్‌లు చేయడానికి తనకు సౌకర్యాలు నిరాకరించారని, పీహెచ్ డీలో అడ్మిషన్ ఆలస్యం చేసేందుకు తన ఎంఫిల్ సర్టిఫికేట్ ఆలస్యం చేశారని ఆమె అన్నారు. పీహెచ్ డిలో తనకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని చెప్పారు.
మోహనన్ గతంలో కోర్టును ఆశ్రయించారు. ఆమె లేవనెత్తిన సమస్యలను విశ్వవిద్యాలయం నియమించిన ప్యానెల్ కూడా పరిశీలించింది. న్యాయస్థానం, ప్యానెల్ ఆమె ఆందోళనలపై సానుకూలంగా స్పందించి. ఆమె పీహెచ్‌డీ పూర్తి చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినా సరైన సౌకర్యాలు ఇవ్వట్లేదని ఆమె చెబుతోంది.
మోహనన్ ఆందోళనతో జిల్లా కలెక్టర్ ఆమెతో చర్చలు జరుపుతారని హామీ ఇవ్వడంతో, మంగళవారం సాయంత్రం మోహనన్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె మళ్లీ యూనివర్సిటీ ముందు తన ఆందోళనను కొనసాగించడానికి తిరిగి వచ్చింది.
(ఐఐయూసీఎన్‌ఎన్) డైరెక్టర్ పదవి నుంచి డాక్టర్ నందకుమార్ కలరికల్‌ను తొలగించాలని ఆమె డిమాండ్ చేస్తూ వస్తోంది. తనపై కులపరమైన వ్యాఖ్యలు చేసిన నందకుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అయితే మోహనన్ నిరసనతో ఐఐయూసీఎన్ఎన్ డైరెక్టర్ నంద కుమార్ పై చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఆయనను తొలగించినట్టు తెలుస్తోంది.
మాజీ రీసెర్చ్ గైడ్ నందకుమార్ కలరికల్ తనపై కులపరమైన వ్యాఖ్యలను చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నంద కుమార్ ను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ పదవి నుంచి తొలగించినట్లు యూనివర్సిటీ పేర్కొంది. అయితే ఈ విషయంపై పత్రికా ప్రకటనను విడుదల చేయలేదు. పీహెచ్ డీ స్కాలర్ నిరాహర దీక్షను తక్షణమే విరమించాలనే ఉద్దేశంతో నంద కుమార్ ను తొలగించినట్టు సమాచారం.