Court Verdict: మహిళను చేయి పట్టుకుని లాగడం నేరం కాదు- హైకోర్టు సంచలన తీర్పు
Madura bench of Madras High Court | ఎలాంటి దురుద్దేశం లేకుండా మహిళ చేయి పట్టుకుని లాగడం నేరం కాదని మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Pulling Womans Hand Not Offence | చెన్నై: దివ్యాంగురాలిని చేయి పట్టుకుని లాగిన కేసులో మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు వెలువరించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, నిందితుడ్ని నిర్దోషిగా ప్రకటించడం సంచలనంగా మారింది. మానసిక వికలాంగురాలితో అసభ్యంగా ప్రవర్తించినట్టు 2018లో దిగువ కోర్టు శిక్ష విధించిన వ్యక్తిని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ నిర్దోషిగా ప్రకటించింది. ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా ఒక మహిళ చేతిని పట్టుకుని పురుషుడు లాగడం అనేది నేరం కాదని మధురై ధర్మాసనం పేర్కొంది.
మూడేళ్ల జైలుశిక్ష విధించిన దిగువ కోర్టు
మురుగేశన్ అనే వ్యక్తికి దిగువ కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. భారతీయ శిక్షాస్మృతిలోని 354వ సెక్షన్ కింద అతడు హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఆర్.ఎన్. మంజులా ఈ పిటిషన్ విచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్ ఆరోపణ ప్రకారం, 2015 మే 4న, హిందూ మారవార్ కమ్యూనిటీకి చెందిన మురుగేశన్ నేడుంకులం కాల్వ సమీపంలో పశువులు మేపుతున్న దివ్యాంగురాలిని చేయి పట్టుకుని లాగాడు. ఈ విషయంపై యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మురుగేశన్ పై ఎస్‌సి/ఎస్‌టి ఎట్రాసిటీ చట్టం కింద సైతం కేసులు నమోదుచేశారు. ప్రత్యేక కోర్టు మురుగేశన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
మధురై కోర్టులో అప్పీల్ చేసుకున్న నిందితుడు
మధురై బెంచ్‌లో బాధితుడు అప్పీల్ చేశాడు. విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనం సాక్షుల వాంగ్మూలాలలో వైరుధ్యం ఉందని, బాధితురాలు తన మానసిక పరిస్థితి కారణంగా సాక్ష్యం ఇవ్వలేకపోయిందని గమనించింది. ఇందుకు ప్రధాన సాక్షి లేరని, మరికొన్నిసార్లు నిందితుడు వెళ్లిపోయాక వేరే వ్యక్తి అక్కడికి చేరుకుని ఉండొచ్చునని కోర్టు పేర్కొంది.
నిందితుడికి భారీ ఊరట ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం
జస్టిస్ మంజులా, భారతీయ శిక్షాస్మృతి 354వ సెక్షన్ కింద నేరం రుజువు కావాలంటే, మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారని నమ్మదగిన సాక్ష్యాలతో నిరూపించాలని పేర్కొన్నారు. మహిళ చేతిని లాగడం అనేది అమర్యాదగా ప్రవర్తించడం అవుతుందని, ఎలాంటి దురుద్దేశం లేకుండా దివ్యాంగురాలి చేతిని పట్టుకుని లాగడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. ఆమెను ఇబ్బంది పెట్టాలని, లేక ఆమెపై అఘాయిత్యం చేయడం లాంటి దురుద్దేశం ఉందన్న ఆధారాలు లేవని మురుగేశన్ కు దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేశారు. ఇదివరకే దిగువ కోర్టు చెప్పినట్లు ఏమైనా జరిమానా చెల్లించి ఉంటే, నిందితుడికి తిరిగి ఇవ్వాలని సూచించారు.






















