Pithapuram Crime News: పిఠాపురంలో హైవే దోపిడీ ముఠా అరెస్ట్: బంగారం, నగదుతో పరారైన దొంగలు.. చివరికి ఏమైందంటే?
Andhra Pradesh News | పిఠాపురంలో దారికాచి దోపిడీకు పాల్పడుతున్న ఓ ముఠా పోలీసులకు చిక్కింది.. ఓ వ్యక్తిని అడ్డగించి రూ.18 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలతోపాటు నగదును దోచుకున్నారు.

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి.. రోడ్డు పక్కన చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు లోడు లారీని ఎత్తుకు పోయిన దొంగలు లోడు మొత్తం కొట్టేసి ఆపై ఖాళీ లారీని వదిలి వెళ్లారు. ఇది మరువక ముందే 214 జాతీయ రహదారిపై గొల్లప్రోలు వద్ద దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కింది.. వీరిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్దనుంచి రూ.18.5 లక్షలు విలువ చేసే 51 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండి, రూ.60 వేలు నగదును స్వాదీనం చేసుకున్నారు పోలీసులు..
హైవేపై దారి కాచి దోపిడి..
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గొల్లప్రోలు మండలం చెందుర్తి హైవేపే ఓ వ్యక్తిని బెదిరించి తన వద్దనున్న బంగారాన్ని, వెండిని, నగదును దోపిడీ చేశారని పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు అందింది.. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి.. జూలై నెల 28న రాజమండ్రి కి చెందిన నగలు రవాణా దారుడు సమీర్ ప్రజాపత్ రాజమండ్రి నుండి పిఠాపురం పరిసర ప్రాంతాలలో నగల దుకాణాలకు నగలు రవాణా చేసేందుకు వచ్చాడు.. పని ముగించుకుని తిరిగి వెళుతున్న క్రమంలో గొల్లప్రోలు మండలం చందుర్తి హైవే వద్ద ఇద్దరు మోటార్ సైకిల్ పై వచ్చి బైకుకు అడ్డుపడి ప్లాన్ ప్రకారం అతడితో గొడవపడ్డారు. అదే సమయంలో మరో ముగ్గురు అక్కడకు చేరుకుని ప్రజాపత్ వద్ద ఉన్నటువంటి 51 గ్రాముల బంగారం, 12.5 కేజీల వెండి, 60 వేల రూపాయల నగదును దోచుకుని పారిపోయారు.. ఈసంఘటనతో ఒకసారి గా షాక్ తిన్న ప్రజాపత్ కొద్దిసేపటికి తెరుకుని గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెద్దాపురం నుంచి వచ్చి ప్లాన్ ప్రకారం..
పిఠాపురంలో బంగారు షాపులకు బంగారం, వెండి సప్లై చేసే ప్రజాపత్ ఆరోజు వస్తున్నాడని ముందే పసిగట్టిన ముఠా ముందుకు ప్లాన్డ్ ప్రకారం జాతీయ రహదారి 214లోని గొల్లప్రోలు మండలం చెందుర్తి వద్ద కాపు కాశారు.. బాధితుడు ప్రజాపధ్ వస్తున్న క్రమంలో దారికాచి మోటారు సైకిల్‌కు అడ్డుపడి ఆపై గొడవపడి బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లిన ముఠా పిఠాపురం పోలీసుల నుంచి తప్పించుకోలేక పోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దోపిడీకి పాల్పడింది పెద్దాపురానికి చెందిన రౌతు గోవిందు, గనిరెడ్డి సాయి, కోన సాయిబాబు, బొమ్మను విజయ్ ఆనంద్, కుక్కల శివ, మణికంఠలను అరెస్ట్ చేశారు.
చివరకు దొరికిపోయారు ఇలా..
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి హైవే పై నగలు రవాణా చేసే వ్యక్తిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డ కేసు నమోదు చేసి,రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు చాకచక్యంగా తక్కువ సమయంలోనే నిందితులను గుర్తించారు. నిందితులంతా పెద్దాపురానికి చెందిన వారే కాగా వీరంతా ఏకమే ప్లాన్ ప్రకారం ప్రజాపత్ నగలు రవాణా విషయాన్ని తెలుసుకుని వెంబడించి, మోటార్ సైకిల్ ను అడ్డుకుని, కావాలని గొడవ పెట్టుకుని, బ్లేడుతో చంపుతానని బెదిరించి దారిదోపిడీకి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని పిఠాపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల వద్ద నుండి దోపిడీకి గురైన బంగారం, వెండి వస్తువులతోపాటు 60000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ మొత్తం రూ.18.5 లక్షలు ఉంటుందన్నారు.
నిందితుల వద్ద నుండి ఐదు సెల్ ఫోన్లు రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు విచారణలో బాగా పనిచేసిన పిఠాపురం, గొల్లప్రోలు క్రైమ్ పోలీసులను సిఐ అభినందించారు. పిఠాపురం గొల్లప్రోలు, పిఠాపురం రూరల్ ఎస్సైలు మణికుమార్, రామకృష్ణ, జానీబాషా లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.





















