Samarlakota Crime News :కాకినాడలో దారుణం: అక్రమ సంబంధం.. తల్లి, ఇద్దరు పిల్లల హత్య.. ప్రియుడే విలన్!
కాకినాడ జిల్లాలోని సామర్లకోట ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. అక్రమ సంబంధమే తల్లి ఇద్దరు బిడ్డల ఆయువు తీసిందని పోలీసులు తేల్చారు. హత్యచేసిన ప్రియుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు పోలీసులు.

Kakinada Crime News : వివాహేతర సంబంధాలు ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా మర్డర్లు బాగా పెరిగిపోయాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వారు చివరకు నమ్మిన ప్రియుడి చేతుల్లోనే హతమవుతోన్న కేసులు వెలుగు చూస్తున్నాయి. సంచలనం రేపిన కాకినాడ జిల్లా సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసు చిక్కుముడి వీడింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధమే తల్లి, ఇద్దరు బిడ్డల ఆయువు తీసిందని పోలీసులు తేల్చారు. ప్రియుడే వెంట తెచ్చుకున్న కర్రతో మాధురి తలపై మోది హత్య చేశాడని, ఆపై పిల్లలు లేచి ఆర్తనాదాలు పెడుతుంటే వారిని అదే కర్రతో కొట్టి చంపినట్టు కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు..
సంచలనంగా మారిన కేసులో అసలేం జరిగిందంటే..
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట సీతారామకాలనీలో ములపర్తి ధనుప్రసాద్, ములపత్తి మాధురి(28) దంపతులు. వారికి పుష్ప కుమారి(8), ప్రైజీ జెస్సీ(6)తో కలిసి ఉంటున్నారు. రాజమండ్రి దగ్గర నడిగట్ల గ్రామానికి చెందిన మాధురికి సామర్లకోటకు చెందిన ధను ప్రసాద్‌తో 10 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు. ధను ప్రసాద్ ఏడీబీ రోడ్డులో ప్రైవేటు కంపెనీలో డ్రైవర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల రెండో తేదీ రాత్రి ధనుప్రసాద్ నైట్ డ్యూటీకి వెళ్లి తిరిగి ఆదివారం ఉదయం వచ్చి చూసే సరికి భార్య, కుమార్తెలు విగత జీవులుగా రక్తపుమడుగులో ఉండటం చూసి షాక్ కు గురయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు, సామర్లకోట సిఐ కృష్ణభగవాన్ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్,డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించారు. ఘటన స్థలంలో వేలిముద్రలను సేకరించారు. అనుమానాస్పద వ్యక్తులను ఆరా తీశారు. భర్తతోపాటు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎస్పీ సైతం ఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించి ప్రత్యేక బృందంతో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
వివాహేతర సంబంధంలో ప్రియుడే కాలయముడయ్యాడు..
సామర్లకోటలోని సీతారామ కాలనీలో తల్లి ఇద్దరు బిడ్డల హత్య జిల్లాలో సంచలనంగా మారింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మర్డర్ వెనుకున్న మిస్టరీను ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ జి.బింధుమాధవ్ వెల్లడించారు. మృతురాలు మాధురి, ఆమె కుమార్తెలు నిస్సి, షైనీ హత్యకు గురైనట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈహత్యలు ఇదే ప్రాంతానికి చెందిన తలే సురేష్ పాల్పడ్డాడని తెలిపారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
మృతురాలు ములపర్తి మాధురి, నిందితుడు తలే సురేష్ మధ్య వివాహేతర సంబంధం గత రెండేళ్లుగా కొనసాగుతోందని, ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు. నిందితుడు మృతురాలి ఆర్ధిక అవసరాలు నిమిత్తం దాదాపు రూ.7లక్షలు వరకూ ఖర్చు చేసినట్లు, నిందితుడి భార్య, మాధురి నుంచి వేధింపులు భరించలేక హత్య చేసినట్టు చెప్పారు.
ఈనెల 3వ తేదీ రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో మాధురి నిందితుడు సురేష్‌ను ఇంటికి పిలిచిందని, ఆ రాత్రి నిందితుడు సురేష్ భోజనం చేసి ఆమెతో శారీరకంగా కలిశాడు. తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే వెంట తెచ్చుకున్న దుడ్డుకర్రతో తలపై గట్టిగా మోది హత్య చేశాడు. ఆమె అరుపులకు నిద్ర లేచిన పిల్లల్ని కూడా అదే కర్రతో హత్య చేశాడు. ఇంటిలో ఉన్న రూ.2,50,000లు విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. కేసు త్వరగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పెద్దాపురం డిఎస్పీ శ్రీహరి రాజు, సామర్లకోట సిఐ ఎ. కృష్ణ భగవాన్, క్రైమ్ సీఐ ఆర్.అంకబాబు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.





















