UPA Vs NDA: పోటాపోటీగా కూటమి కడుతున్న బీజేపీ, కాంగ్రెస్ - ఎవరి బలం ఎంత?
UPA Vs NDA: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా కూటములు కడుతుండటం ఆసక్తికరంగా మారింది.
UPA Vs NDA:
NDA దూకుడు..
దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకూ ఓ లెక్క. ఇకపై మరో లెక్క. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం మించిపోతోంది. ఎలక్షన్ స్ట్రాటెజీలను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి అన్ని పార్టీలు. కాంగ్రెస్‌కి ఇది చావోరేవో లాంటి పరిస్థితి. ఇప్పటికే రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఓటమిని చవి చూసింది. ఇప్పుడు కొంత పుంజుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలో బెంగళూరులో రెండ్రోజుల భేటీకి పిలుపునిస్తే..అటు National Democratic Alliance (NDA) కూడా అలెర్ట్ అయింది. UPA,NDA పోటాపోటీగా బలప్రదర్శనకు సిద్ధమైపోయాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జులై 18న కీలక సమావేశం జరగనుంది. ఈ కూటమిలో కొత్త పార్టీలు వచ్చి చేరే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా నేతృత్వంలో NDA సమావేశం జరగనుంది. ఇప్పటి వరకూ కూటమిలో ఉన్న వాళ్లనే కాకుండా కొత్త మిత్రులనూ ఆహ్వానించింది బీజేపీ. బిహార్‌లో కీలకమైన లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కూడా NDAలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరవనున్నారు. ఆయనతో పాటు బిహార్‌లోని హిందుస్థాని అవమ్ మోర్చాకు చెందిన జితన్ రామ్ మంజి, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన ఉపేంద్ర సింగ్ కూడా NDAలో చేరనున్నారు. ఇక అఖిలేష్ యాదవ్‌తో సన్నిహితంగా ఉన్న భారతీయ సమాజ్ పార్టీ నేత ఓం ప్రకాశ్ రాజ్‌బర్ కూడా బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.
NDAలో 24 పార్టీలు..!
ఇక తెలుగు దేశం పార్టీ (TDP) NDAలో చేరుతుందని భావించినా...ఈ సారి ఆ పార్టీ దూరం పాటిస్తోంది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన బీజేపీకి దగ్గరైంది. పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. ప్రస్తుతానికి NDA కూటమిలో 24 పార్టీలున్నాయి. వీటిలో బీజేపీ, AIADMK,శిందే వర్గానికి చెందిన శివసేన, నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, సిక్కిమ్ క్రాంతికారి మోర్ఛా, జన్‌నాయక్ జనతా పార్టీ, జనసేన తదితర పార్టీలున్నాయి. అయితే...కర్ణాటకలోని జేడీఎస్ కూడా NDAలో చేరి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు మరి కొన్ని పార్టీలు ఈ కూటమికి మద్దతు పలకనున్నాయి. మొత్తంగా బీజేపీ హైకమాండ్ 30 పార్టీలతో బలగాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతానికి ఇదే లక్ష్యంగా పెట్టుకుంది. అటు ప్రతిపక్షాల కూటమిలో 26 పార్టీలున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సారి బీజేపీని గద్దె దించడమే తమ కూటమి లక్ష్యమని తేల్చి చెప్పింది. అంతే కాదు. UPA పేరు కూడా మార్చనున్నారని తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ అనుకున్న విధంగా 30 పార్టీల మద్దతు కూడగడితే...అప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో 30 వర్సెస్ 26 యుద్దం తప్పదు. ఏదేమైనా ఎన్నికలకు పెద్ద సమయం లేదు. అందుకే ఈ వారంలోనే అంతా తేల్చి పడేయాలని అనుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ముందు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుని ఆ తరవాత ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నాయి. అంటే...దేశ రాజకీయాలు మరో వారం రోజుల్లో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనున్నాయన్నమాట.
Also Read: బెంగళూరు భేటీ దేశ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతుందా? కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ ఏంటి?