ISRO Insat 3DS: నేడు ఇస్రో జీఎస్ ఎల్‌వీ-ఎఫ్ 14 ప్రయోగం, ఎవరికి మేలు, విశేషాలు ఏంటి?
ISRO News: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రోజు సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
ISRO To Launch Meteorological Satellite: అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాల సరసన సమున్నత గర్వంతో నిలబడిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) తాజాగా ఈ ఏడాది రెండో ప్రయోగానికి సిద్ధమైంది. సముద్ర, పర్యావరణ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దేశవ్యాప్తంగా రైతులకు విలువైన సమాచారం అందించేందుకు ఉద్దేశించిన ఇన్‌శాట్-3డీఎస్(insat 3DS) ఉపగ్రహ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ద్వారా 2,275 కిలోల బరువున్న ఇన్‌శాట్-3డీఎస్‌ను నింగిలోకి పంపనుంది.
ముహూర్తం ఇదీ..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చేపట్టిన రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14(GSLV F14) ప్రయోగం.. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్(శ్రీహరికోట) నుంచి శనివారం(ఈరోజు) సాయంత్రం 5.35 గంటలకు శాస్త్రవేత్తలు చేపట్టనున్నార. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ షార్‌కు చేరుకుని, కౌంట్‌డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ.. శాస్త్రవేత్తలకు, సూచనలు చేశారు. జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక 2,275 కిలోల బరువు గల ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.
ఇవీ ప్రయోజనాలు..
ఇస్రో చేపట్టిన రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14(GSLV F14) ద్వారా నింగిలోకి చేరనున్న 3డీఎస్ ఉపగ్రహం వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన ప్రయోగం. తద్వారా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అంచనా వేస్తారు. అంతేకాదు.. విపత్తు హెచ్చరిక వ్యవస్థలను(తుఫానులు, భూకంపాలు, పిడుగులు, సునామీలు) మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే కక్ష్యలో ఉన్న ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో కలిసి ఈ 3డీఎస్ పనిచేయనుంది.
అత్యంత శక్తి మంతం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్ శాట్ 3 DS ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టం - ఇనా శాట్ సిరీస్ లో ఎంతో శక్తిమంతమైనదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సాట్ సిరీస్ లో భారత్ ఇప్పటిదాకా 23 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలు అంతరిక్షం నుంచి సేవలు అందిస్తున్నారు. ఇక, ఇప్పుడు మరింత ఖచ్చితమైన సమాచారం.. సమయానుకూల సమాచారం కోసం.. వాటికి కొనసాగింపుగా ఇస్రో శాస్త్రవేత్తలు. ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని రూపొందించారు. 2 వేల 275 కిలోల బరువు ఉన్న ఈ ఒక్క ఉపగ్రహాన్ని ఈరోజు సాయంత్రం 5గంటల 30 నిమిషాలకు ప్రయోగించనున్నారు. దీనివల్ల.. భారత్ మరింత అప్రమత్తంగా రైతులకు వాతావరణ సమాచారాన్ని అందించే వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. INSAT-3DS ఉపగ్రహం మూడవ తరం వాతావరణ ఉపగ్రహానికి తదుపరి మిషన్ గా ఇస్రో వెల్లడించింది. దీనిని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. ఇస్రో తన 16వ మిషన్‌లో జియో సింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఓ)లో ఉపగ్రహాన్ని మోహరించడం జిఎస్‌ఎల్‌వి లక్ష్యమని పేర్కొంది. ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియలో ఉపగ్రహం భూస్థిర కక్ష్యలో ఉండేలా చూడనున్నారు. ఈ ఉపగ్రహంలో అధునాతన వాతావరణ పరిస్థితిని అంచనా వేయగల సాంకేతికతను అమర్చారు.
ఉపగ్రహంలో ఏమేమున్నాయి?
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) ఉపగ్రహంలో భారత వాతావరణ విభాగం (IMD), మధ్యస్థ-శ్రేణి వాతావరణ సూచన కోసం జాతీయ కేంద్రం (NCMRWF) , ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరోలజీ (IITM), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT), ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS), ఇతర ఏజెన్సీలు, సంస్థలకు చెందిన సాంకేతికతను నిక్షిప్తం చేశారు.ఇవి.. వాతావరణ అంచనాను మరింత మెరుగ్గా అందించనున్నాయి.
ఉపగ్రహం స్వరూపం..
+ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) 51.7 మీటర్ల పొడవు
+ 420 టన్నుల బరువు
+ మొదటి దశ(GS1) ఒక సాలిడ్ ప్రొపెల్లెంట్ (S139) మోటారును కలిగి ఉంటుంది.
+ 139 టన్నుల ప్రొపెల్లెంట్‌ను మోసుకెళ్తుంది.
+ నాలుగు ఎర్త్-స్టోరేబుల్ ప్రొపెల్లెంట్ స్టేజ్‌లు (L40) స్ట్రాప్-ఆన్‌లు ఉంటాయి.
+ ఇవి ఒక్కొక్కటి 40 టన్నుల ద్రవ ప్రొపెల్లెంట్‌ను కలిగి ఉంటాయి.
500 కోట్ల ప్రయోగం!
జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F14(GSLV F14) ఉపగ్రహ ప్రయోగానికి రూ.500 కోట్లకు పైగానే ఖర్చయినట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ నిధులు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ(MoES) సమకూర్చింది. GSLV-F14/INSAT-3DS మిషన్ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) SHAR నుంచి చేపట్టనున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్సాట్-3డీ, ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహాలతో పాటు ఈ ఉపగ్రహం వాతావరణ సేవలను మెరుగుపరచనుంది.
ఇవీ.. లాభాలు!
+ వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం.
+ విపత్తు హెచ్చరికలు నిముషాల వ్యవధిలోనే అందుబాటులోకి రావడం.
+ భూమి, సముద్ర ఉపరితలాలను నిరంతరాయంగా పరిశీలించడం.
+ వాతావరణంలోని వివిధ పరిస్థితుల ప్రొఫైల్‌లను అత్యంత వేగంగా అందించడం.
+ డేటా కలెక్షన్ ప్లాట్‌ఫారమ్ (DCP)