Vijay Rupani: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా.. అదే కారణమా?
2016 నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. అంతకుముందు సీఎంగా ఉన్న ఆనందీబెన్ పటేల్ రాజీనామా అనంతరం ఈయనను సీఎం పదవి వరించింది.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో శాసన సభకు ఎన్నికలు ఉన్నవేళ ఇప్పుడు సీఎం రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా విజయ్ రూపానీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు విజయ్ రూపానీ రాజీనామా లేఖను పంపారు. అయితే బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతోనే ఆయన సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
2016 నుంచి విజయ్ రూపానీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. అంతకుముందు సీఎంగా ఉన్న ఆనందీబెన్ పటేల్ రాజీనామా అనంతరం ఈయనను సీఎం పదవి వరించింది. రాజీనామా సందర్భంగా తనకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి విజయ్ ధన్యవాదాలు తెలిపారు.
Gujarat Chief Minister Vijay Rupani resigns pic.twitter.com/J8hl8GCHui
— ANI (@ANI) September 11, 2021
గవర్నర్‌కు తన రాజీనామా లేఖను ఇచ్చి అనంతరం రూపానీ విలేకరులతో మాట్లాడారు. తనకు సీఎంగా అవకాశం కల్పించినందుగా బీజేపీ అధిష్ఠానానికి రుణపడి ఉంటానని తెలిపారు. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ సంచలన పరిణామంపై విలేకరులు మరిన్ని ప్రశ్నలు అడగ్గా.. సీఎంలను మారుస్తూ ఉండడం బీజేపీలో సహజంగా జరిగే ప్రక్రియ అని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నాయకత్వంలో పని చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని, మున్ముందు కూడా అదే కొనసాగిస్తానని అన్నారు. గత ఐదేళ్ల నుంచి గుజరాత్ ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసం కనబరుస్తూనే ఉన్నారని అన్నారు.
తదుపరి సీఎంపై ఆసక్తి
అయితే, ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న వేళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్ పటేల్‌కు సీఎం పదవి వస్తుందా? లేదా బీజేపీ అధిష్ఠానం మరొకరిని ఎంపిక చేస్తుందా? అన్నదానిపై స్పష్టత లేదు.
వరుసగా రాజీనామాలు చేస్తున్న బీజేపీ సీఎంలు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా సీఎంలు రాజీనామా చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఇలా రాజీనామాలు చేసిన
సీఎంలలో విజయ్ రూపానీ మూడో వ్యక్తి. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న బీఎస్ యడియూరప్ప, ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్న తిరాత్ సింగ్ రావత్ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.