Government On Ration Cards: మీ పేరు మీద ట్రాక్టర్ ఉందా? అయితే నిజంగా మీకు ఇది షాకింగ్ న్యూసే!
రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్రం గ్రౌండ్ ప్రిపేర్ చేసింది. దీనికి సంబంధించిన నిబంధనలను రెడీ చేసి రాష్ట్రాలకు పంపించింది.
రేషన్ కార్డుల ఏరివేతకు రంగం సిద్దం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
రేషన్ కార్డుల కోతకు కేంద్రం సిద్దమైంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను పక్కగా అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చెప్పిన నిబంధనల మేరకు ఎవరు అర్హులో వాళ్ల వద్దే కార్డులు ఉండాలని... అర్హులు కాని వారు తమ కార్డులను సరెండర్ చేయాలని స్పష్టం చేసింది కేంద్రం.
గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం లక్షా 50వేల లోపు ఉన్న వాళ్లు, పట్టణాల్లో రెండు లక్షల లోపు, నగరాల్లో మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్లు మాత్రమే రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. గ్రామాల్లో వ్యక్తిగత ఆదాయం పదివేల రూపాయల లోపు, పట్టణాల్లో నెలకు పదిహేన వేల రూపాయల్లోపు ఆదాయం వచ్చిన వాళ్లు మాత్రమే రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు.
మాగాణి భూమి మూడున్నర ఎకరాలకు, బీడు భూమి ఏడున్నర ఎకరాలకు మించి ఉండని వారంతా రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హత ఉన్న వాళ్లగానే కేంద్రం గుర్తిస్తోంది.
కారు, ట్రాక్టర్ కలిగి ఉన్న వాళ్లు రేషన్ కార్డు తీసుకోవడానికి అనర్హులు. ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్‌కం ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా రేషన్ కార్డు పొందేందుకు అనర్హులు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు.
అనర్హుల జాబితాలో ఉన్న వారి వద్ద రేషన్ కార్డు ఉంటే మాత్రం తాహసిల్దార్ కార్యాలయంలో తిరిగి ఇచ్చేయాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలకమైన సూచనలు చేసినట్టు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్న వారు భారీగానే ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాల్లో కోతలు విధిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పుడు కార్డుల్లో కూడా కోతలు పెడితే ఆ విమర్శలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ రేషన్ కార్డుల ద్వారా వచ్చే సరకులను పక్కదారి పట్టించి అమ్ముతున్న కొందరు లబ్ధిదారులు.. వాటి నుంచి వచ్చే ఇతర పథకాల లబ్ధి పొందుతున్నారు. దాన్ని కట్ చేయడానికే ఈ నిబంధనలను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.