Plane Crash Pilot Protocol: విమానం కూలే సమయంలో పైలెట్లు పాటించాల్సిన సూత్రం ANC, వారు చేయాల్సిన పనులు ఇవే
పైలట్లు తమ చివరి శ్వాస వరకు విమాన ప్రమాదాన్ని తగ్గించేలా ప్రయత్నిస్తారు. ఆకాశం నుండి దిగి భూమి మీద విమానం ల్యాండ్ అయ్యే వరకు తమ నియంత్రణ కోల్పోకుండా ప్రయత్నిస్తారు.

విమాన ప్రమాదం జరగబోతోందని తెలిసిన వెంటనే పైలట్లు ఏమి చేస్తారో తెలుసా? ఇలాంటి విపత్కర సమయాల్లో ఏమి చేయాలో వారికి ముందుగానే శిక్షణ ఇస్తారు. విమానం కూలిపోతుందని అర్థం అవగానే పైలట్లు ముఖ్యమైన మూడు సూత్రాలను అనుసరించాల్సి ఉంటుంది: అవి ఏవియేట్, నావిగేట్, కమ్యూనికేట్. ఈ మూడు సూత్రాల ద్వారా విమానం కూలకుండా సాధ్యమైనంత వరకు మానవ ప్రయత్నం చేస్తారు. అది సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రమాదాలు ఎదుర్కోక తప్పదు. కానీ చివరి శ్వాస వరకు పైలట్ ఈ మూడు సూత్రాలను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది; వారి శిక్షణలో ఇదే నేర్పిస్తారు. అయితే ఈ మూడు సూత్రాలు ఏంటో తెలుసుకుందాం.
ఏవియేట్ (Aviate)
విమానం కూలిపోతున్న సమయంలో పైలట్ చేయాల్సిన మొదటి పని ఏవియేట్. అంటే విమానంపై తమ నియంత్రణ కోల్పోకుండా చూసుకోవడం. విమానంలో ఎలాంటి ప్రమాదకర సమస్య తలెత్తినా, విమానం స్థిరంగా ప్రయాణించేలా, విమానం తమ నియంత్రణలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పైలట్లు విమానం పనితీరును, వేగాన్ని, ఎత్తు వంటి వాటిని తాము నిర్ణయించుకున్న రీతిలో అదుపులో పెట్టుకుంటారు. దీనివల్ల విమానం అదుపుతప్పి కూలిపోకుండా ఉంటుంది. ప్రతీ పైలట్, విమానం విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు చేసే మొదటి పని ఏవియేట్ చేయడమే.
నావిగేట్ (Navigate)
విమానాన్ని పైలట్ తమ నియంత్రణలో ఉంచుకున్న తర్వాత, ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఎక్కడ సురక్షితంగా దించవచ్చన్నది నావిగేట్ చేయాలి. విమాన మార్గాన్ని, విమానం ల్యాండింగ్ చేసే సురక్షిత ప్రదేశాన్ని ఎంచుకోవడం కీలకం. ఇలాంటి కీలక సమయాల్లో పైలట్లు తమ దగ్గరలో ఎక్కడ విమానాశ్రయం ఉందన్నది నావిగేట్ చేస్తారు. అలా లేని పరిస్థితులో నీటి మధ్యలో గానీ, మైదాన ప్రాంతంలో గానీ సురక్షితంగా దిగే వీలుంటే అటువైపు విమానాన్ని మళ్లించి ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తారు.
కమ్యూనికేట్ (Communicate)
విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా, ఇతర ఏ ప్రమాద ఘంటికలు మోగినా వెంటనే వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు (ATC) లేదా సమీపంలో ఉన్న ఇతర విమానాలకు తమ ప్రమాదకర పరిస్థితులను వివరిస్తారు. ATC నుండి ఇచ్చే సూచనలను పాటించి ఆ ప్రమాదం నుండి బయటపడటమో లేక ప్రమాద తీవ్రతను తగ్గించే చర్యలను పాటించడమో పైలట్లు చేస్తారు. కమ్యూనికేట్ చేయడం వల్ల, అంటే ప్రమాద సమాచారాన్ని వెంటనే పంచుకోవడం వల్ల గ్రౌండ్ స్టాఫ్ నుండి వారికి అవసరమైన సూచనలు, సలహాలు, సహాయం లభించే వీలు ఉంటుంది.
ఈ మూడింటితో పైలట్లు చేసే మరికొన్ని అత్యవసర పనులు ఇవే:
-
చెక్ లిస్ట్ పాటించడం: విమానం ఏదైనా విపత్కర పరిస్థితి ఎదుర్కొంటే ఏం చేయాలి అని ఎమర్జెన్సీ చెక్ లిస్ట్ ప్రతీ విమానంలో ఉంటుంది. పైలట్లు ఆ చెక్ లిస్ట్‌లో ఉన్న పనులను చేయాల్సి ఉంటుంది. ఇంజన్ ఫెయిల్యూర్, మంటలు రేగడం, ల్యాండింగ్ సమస్యలు - ఇలా చెక్ లిస్ట్‌లో ఏం చేయాలన్న అంశాలను పొందుపరుస్తారు. ఇవి చూసి పైలట్లు ప్రతీ దశను జాగ్రత్తగా నిర్వర్తిస్తారు. ఇది ప్రమాద తీవ్రతను తగ్గించడానికి లేదా సమస్యను పూర్తిగా సరిదిద్దడానికి ఉపయోగపడుతుంది.
-
ఇంధనాన్ని పారబోయడం: భారీ సైజు విమానాల్లో ల్యాండింగ్ సమయంలో సమస్యలు వస్తే ఇంధనాన్ని పారబోస్తారు. విమానం బరువు తగ్గించకపోతే ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తి ప్రమాదాలు జరుగుతాయి. ఆ సమయంలో గాల్లోనే, నివాస ప్రాంతాలకు దూరంగా, దాదాపు ఐదు వేల అడుగుల ఎత్తులో ఇంధనాన్ని వదిలేలా కాక్‌పిట్ నుండే పైలట్లు ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి గాల్లో ఇంధనం పారబోస్తారు. అది గాల్లోనే ఆవిరి అయిపోతుంది. దీని ద్వారా విమానం బరువు తగ్గి ల్యాండింగ్ సమయంలో ఎదురయ్యే ప్రమాదాన్ని నివారిస్తారు. చిన్న విమానాలకు ఈ అవసరం ఉండదు.
-
ప్రయాణికులను అప్రమత్తం చేయడం: ప్రమాదం జరుగుతుందని అర్థం అయ్యాక పైలట్లు విమాన ప్రయాణికులను అప్రమత్తం చేస్తారు. క్యాబిన్ సిబ్బంది ద్వారా ప్రయాణికులకు పరిస్థితిని వివరిస్తారు. సీటు బెల్టులు గట్టిగా పెట్టుకోవడం, తలలు వంచి కూర్చోవడం, పదునైన వస్తువులను దూరంగా ఉంచడం వంటి జాగ్రత్తలు చెబుతారు. దీనివల్ల ప్రమాద తీవ్రతను తగ్గించడం ప్రధాన ఉద్దేశం.
-
ప్రమాదానికి సిద్ధపడటం: అంటే విమానం క్రాష్ ల్యాండింగ్ చేయడం తప్పదని తెలిస్తే పైలట్లు అందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతారు. ల్యాండింగ్ ప్రాంతం నిర్ణయించుకున్నాక విమాన వేగం తగ్గిస్తారు. ఇందుకోసం ఇంజన్లను ఆపివేస్తారు. సాధ్యమైనంత నెమ్మదిగా, తమ నియంత్రణలోనే విమానం నేలపై దిగేలా ప్రయత్నిస్తారు. నేలకు గుద్దుకొని విమానం పేలకుండా సాధ్యమైనంత ప్రయత్నం చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పైలట్లు తమ చివరి శ్వాస వరకు విమాన ప్రమాదాన్ని తగ్గించేలా ప్రయత్నిస్తారు. ఆకాశం నుండి దిగి భూమి మీద విమానం ల్యాండ్ అయ్యే వరకు తమ నియంత్రణ కోల్పోకుండా ప్రయత్నిస్తారు. ఆకస్మాత్తుగా జరిగే ప్రమాదంతో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది. అదే నియంత్రిత ప్రమాదం వల్ల చాలా మంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది.






















