Bangladesh Violence: ఒక వ్యక్తికి కాదు బంగ్లాదేశ ప్రజలకు భారత్ మద్దతు ఉండాలి; ఢిల్లీ, ఢాకా స్నేహితులుగా సాగాలి: ఏబీపీతో ముహమ్మద్ యూనస్
Muhammad Yunus: బంగ్లాదేశ్ పరిణామాలపై నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ ABPతో ప్రత్యేకంగా మాట్లాడారు. బంగ్లాదేశ్ ప్రజలకు భారతదేశం మద్దతు ఇస్తే న్యూఢిల్లీ, ఢాకా మంచి స్నేహితులుగా ఉంటాయని అన్నారు.
Muhammad Yunus Exclusive interview : ఆగస్టు 5న ఢాకాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘ కాలం బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా ఆ దేశ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు దెబ్బకు రాజీనామా చేయవలసి వచ్చింది. ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గ్రహించి దేశం విడిచిపెట్టేయాల్సి వచ్చింది. ముందుగా భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందారు. మరోవైపు బంగ్లాదేశ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆర్మీ త్వరలో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.
జరుగుతున్న పరిణామాలపై బంగ్లాదేశ్ నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ స్పందించారు. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న ఆయన ABPతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఏకైక పరిష్కారం ప్రజాస్వామ్య ప్రభుత్వమే అన్నారు. ప్రజాస్వామ్యా బద్ధంగా స్వేచ్ఛగా నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. హసీనా సుదీర్ఘ పాలనలో ఇది జరగలేదని ఆయన అన్నారు. .
బంగ్లాదేశ్ పట్ల భారత్ వ్యవహరించిన తీరును ముహమ్మద్ యూనస్ తప్పుపట్టారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ విద్యార్థుల నిరసనను "అంతర్గత విషయం" అని చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. న్యూఢిల్లీ ఒక వ్యక్తికి మద్దతు ఇస్తోందని ప్రజాస్వామిక హక్కులను దూరం చేసిందని ఆరోపించారు.
ఇది బంగ్లాదేశ్ అంతర్గత విషయమని, దాని గురించి ఏం చేయలేమని భారత్ చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. తర్వాత బాధపడ్డాను. మీరు వచ్చి మా దేశ ఎన్నికల్లో పాల్గొనండని అని పిలుస్తున్నాను. ప్రజలు వీధుల్లో ఆందోళన చేస్తున్న టైంలో కాల్చి చంపినప్పుడు మీరు స్పందించాల్సిన అవసరం లేదా. బంగ్లాదేశ్‌లోని అమాయక యువకులను ప్రభుత్వం కాల్చివేస్తోంది. దయచేసి మాకు సహాయం చేయండని ప్రపంచాన్నే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అంతర్గత విషయమని భారత్ చెబుతోంది మిగతా ప్రపంచ దేశాలైనా స్పందించాలని గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు యూనస్ అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొని 300 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన హసీనా చర్యలకు వ్యతిరేకంగా న్యూఢిల్లీ మౌనంగా ఉండటం కోపం కలిగించిందని ఆయన అన్నారు.
“మీ పొరుగువారి ఇల్లు కాలిపోతుంటే అది వారి అంతర్గత వ్యవహారమని ఊరుకోలేరు. ఇది మమ్మల్ని బాధపెడితే, అది మిమ్మల్ని బాధపెడుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసను మీ సరిహద్దులను తాకుతుంది. అప్పుడు కూడా సైలెంట్‌గా ఉండలేరు. అని యూనస్ అన్నారు.
"భారతదేశం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే మద్దతివ్వాలని కోరుకుంటుంది," అని ఆయన అన్నారు, జనవరి 2024లో జరిగిన బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలలో మాజీ ప్రధానమంత్రి ఐదోసారి అధికారంలోకి రావడంలో ఢిల్లీ పాత్ర ఉంది.
"బంగ్లాదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించామని భారతదేశం చాలా స్పష్టంగా చెప్పింది. ఇది దాచే విషయం కాదు. ఆమెను అభినందించడానికి భారతదేశం ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది ”అని అతను నొక్కి చెప్పారు.
హసీనా పోటీ చేసే ప్రతి ఎన్నికల్లో తారుమారు చేసే పద్ధతులకు భారతదేశం "దురదృష్టవశాత్తు" మద్దతు ఇస్తోందని చెప్పారు. "అందుకే మా హక్కులన్నింటినీ హరించే వ్యక్తికి మీరు మద్దతు ఇస్తున్నారని ప్రజలు భారతదేశంపై కోపంగా ఉన్నారు."
ఏది ఏమైనప్పటికీ పొరుగువారు, చారిత్రకంగా, సాంస్కృతికంగా దగ్గర ఉంటే ఢాకా, న్యూఢిల్లీ "బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్" అని చెప్పారు.
“మాకు మీ మద్దతు కావాలి. మాకు భారతీయులందరి మద్దతు కావాలి. భారతదేశం, బంగ్లాదేశ్ కలిసి మనం మంచి స్నేహితులుగా ఉండవచ్చు . మేము ఒకరికొకరు చాలా దగ్గరగా ఉన్నాము, కలిసి పని చేయగలం. శత్రువుల్లా మారే బదులు మనం మంచి స్నేహితులుగా ఉండవచ్చు. మనం అలా ఎందుకు మారాలి. అలా మారడానికి కారణమంటూ లేదు,అని అతను హైలైట్ చేశారు.
“మీరు బంగ్లాదేశ్ ప్రజలతో సఖ్యతగా వ్యవహరించాలి, బంగ్లాదేశ్ ప్రధానితో కాదు. దయచేసి మీ విధానాన్ని మార్చుకోండి." అని సూచించారు.
“భారతదేశం మా బెస్ట్ ఫ్రెండ్. మనకెందుకు ఇబ్బంది? భారతదేశంతో పంచుకోవడానికి చాలా విషయాలు ఉన్నాము. భారతదేశం నుంచి కూడా మేం అదే స్థాయి ప్రయోజనం పొందుతాము. భారతదేశం మనకు శత్రువుగా ఉండకూడదనుకుంటున్నాం. అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి మీ విధానాన్ని మార్చుకోండి. ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ఒక వ్యక్తినే ఎందుకు ముందుకు నెట్టాలి? ఇది ఒక దేశం, ఒక వ్యక్తి కాదు కదా అని యూనస్ పునరుద్ఘాటించారు.
యూనస్ ప్రకారం, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన 1975 డిసెంబర్ 16న స్ఫూర్తితోనే హసీనాను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించే రోజును సంబరాలు చేసుకోవాలి.
“ఈ రోజు మేం రెండో విమోచన దినాన్ని జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. మేము ఇష్టపడని విషయాన్ని వదిలించుకున్నాము. లక్షల మంది ప్రజలు వీధుల్లో సంతోషంగా తిరుగుతున్నారు. అన్నింటికీ విద్యార్థులే నాయకత్వం వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానంలో మార్పు రావాలని విద్యార్థులు కోరుకున్నప్పుడు నిరసన చాలా సున్నితంగానే మొదలైంది. ఇది ఒక సాధారణ డిమాండ్ గా సాగింది. కానీ వారి పట్ల దాడి చేయడం, కొట్టడం, కాల్చడంతో పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించిన విధానంతోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ”యూనస్ వివరించారు.
బంగ్లాదేశ్ ఈ సంక్షోభ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడమే ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు.
“ప్రజాస్వామ్య ప్రక్రియ తిరిగి రావాలి. ప్రతి ఒక్క పౌరుడికి తమ భావాలను వ్యక్తీకరించడానికి, వారి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు తమ భావాలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛ ఉండాలి. ప్రజాస్వామ్యంలోకి వెళ్లడమే పరిష్కారం. తుపాకుల ద్వారా రాజకీయ సమస్యలకు పరిష్కారం లభ్యం కాదు. ప్రజలపై తప్పుడు ఆరోపణలు చేసి జైళ్లలో పెట్టలేరు. దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ తిరిగి రావాలి. ఈ రోజు ప్రజాస్వామ్య తలుపు తెరుచుకుంది. దానికి విద్యార్థులే దారి చూపారు” అని “పేదలకు బ్యాంకర్” గా ప్రసిద్ధి చెందిన యూనస్ అన్నారు.
ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాత్-ఇ-ఇస్లామీ లేదా జమాత్‌తో సహా అన్ని పార్టీలు, నాయకులు దేశంలోని తదుపరి ఎన్నికల్లో పాల్గొనే హక్కు పొందాలని కూడా ఆయన అన్నారు.
“ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించనంత కాలం ప్రతి ఒక్కరినీ ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి అనుమతివ్వాలి. కాబట్టి అది జమాత్ అయినా, బీఎన్‌పీ అయినా, వారు దేశ పౌరులు, వారు ఎన్నికల్లో పాల్గొనాలి, చట్టబద్ధమైన మార్గంలో పాల్గొనే అవకాశం పొందాలి కానీ వారికి అవకాశం రాలేదు. ప్రభుత్వం అబద్ధాల కర్మాగారంగా మారింది.అని ఆయన నొక్కిచెప్పారు.
2007లో ‘నగరిక్ శక్తి’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన యూనస్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
“నేను రాజకీయాలకు వీలైనంత దూరంలో ఉండేందుకు ప్రయత్నిస్తాను. నేను రాజకీయ నాయకుడిని కాను, రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు. నేను రాజకీయ నాయకుడిని కాదు, అలాంటి పనికి నేను సరిపోను. నేను ప్రజల కోసం పనులు చేస్తాను. అది ఎలా చేయాలో నాకు తెలుసు. నేను దానినే ఇష్టపడతాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా పని ముందుకెళ్తుంది. రాజకీయం పూర్తిగా కొత్త స్థలం నేను దానిలో పాల్గొనడానికి ఇష్టపడను, అని చెప్పారు.