ఐక్యరాజ్య సమితిలో పాక్‌కి మరోసారి భారత్ గట్టి కౌంటర్, ఆ వ్యాఖ్యలపై ఫైర్
UN Council: ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌కి భారత్ మరోసారి గట్టి బదులిచ్చింది.
India at UN Council: ఐక్యరాజ్య సమితిలో మరోసారి పాకిస్థాన్‌కి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. 55వ Human Rights Councilలో టర్కీతో పాటు పాకిస్థాన్ జమ్ముకశ్మీర్ గురించి ప్రస్తావించింది. దీనిపై భారత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని భారత్ కొట్టి పారేసింది. మానవ హక్కుల మండలి సెక్రటరీ అనుపమా సింగ్ గట్టి బదులిచ్చారు. ఇవి అత్యంత దారుణమైన వ్యాఖ్యలు అంటూ మండి పడ్డారు. "ముందు మీ దేశంలోని మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఆలోచించుకోండి" అంటూ చురకలు అంటించారు. జమ్ముకశ్మీర్ అనేది భారత్ అంతర్గత విషయం అని...అనవసరపు వ్యాఖ్యలు చేయొద్దని మందలించింది. పాకిస్థాన్ పూర్తిగా మునిగిపోయిన దేశం అని విమర్శించారు.
"ఇప్పటికే పూర్తిగా మునిగిపోయిన దేశం చేస్తున్న వ్యాఖ్యల్ని మేం పట్టించుకోవాలని అనుకోవడం లేదు. ఉగ్రవాదంతో ఆ దేశం రక్తపాతం సృష్టిస్తోంది. సొంత దేశ ప్రజల్నే పట్టించుకోవడం లేదు. స్థిరమైన ప్రభుత్వమూ లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయింది"
- అనుపమా సింగ్, మానవ హక్కుల మండలి సెక్రటరీ
India exercises Right of Reply against Pakistan at #HRC55 pic.twitter.com/rdTMVWYmFT
— India at UN, Geneva (@IndiaUNGeneva) February 28, 2024
ఈ క్రమంలోనే భారత్ మూడు అంశాలను కీలకంగా ప్రస్తావించింది. జమ్ముకశ్మీర్ లద్దాఖ్..భారత్‌లోనే అంతర్భాగమని, రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. ఆ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి భారత్ కట్టుబడి ఉందని తేల్చి చెప్పింది. ఉగ్రవాదం విషయంలో ఎంతో దారుణమైన రికార్డున్న పాకిస్థాన్ భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించింది. 2023 ఆగస్టులో 19 చర్చ్‌లతో పాటు 89 క్రిస్టియన్ హౌజ్‌లను ధ్వంసం చేసిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా గుర్తించిన వాళ్లకు ఆశ్రయమివ్వడమే కాకుండా వాళ్లకు అన్ని విధాలుగా సాయం అందించడాన్నీ తప్పుబట్టింది. పాకిస్థాన్ వ్యాఖ్యల్ని సమర్థించినందుకు టర్కీపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది.