chhattisgarh: ఛత్తీస్ ఘడ్ లో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతగుప్ప అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు తెలుస్తోంది.
సుక్మా జిల్లా చింతగుప్ప తుపాకుల మోతలతో దద్దరిల్లింది. చింతగుప్ప అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సుమారు రెండు గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కూంబింగ్ లో బలగాలు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు ఎస్పీ సునిల్ శర్మ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నెల 28న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కారణంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
గతనెల మావోలు ఆరుగురు మృతి
గత నెలలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జూన్ 16న ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు, ముగ్గురు మహిళలున్నారు. వీరు కాకుండా మరో మహిళా మావోయిస్టు కూడా మృతి చెందారు. ఆ ఘటనలో అగ్రనేతలు అరుణ, ఉదయ్, జగన్ తప్పించుకున్నట్లు తెలిసింది.
గత నెల జరిగిన ఎదురుకాల్పుల్లో డివిజనల్ కమిటీ సభ్యుడు(డీసీఎం) సందె గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, రణదేవ్ అలియాస్ అర్జున్‌తో పాటు, ఏరియా కమిటీ సభ్యురాలు సంతునాచిక, మహిళా మావోయిస్టులు పాయకే, లలిత మరణించారు. మరో మహిళ వివరాలు తెలియలేదు. తీగలమెట్ట వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో 30 మంది మావోయిస్టులు ఆశ్రయం పొందినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అక్కడికి సమీపాన కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలు అప్రమత్తమై అటువైపు వెళ్లాయి. ముందు ఒక బృందం వెళ్లాక... అటవీ ప్రాంతం నలువైపులా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులకు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువైపుల నుంచి కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటలపాటు అప్పుడు ఎదురుకాల్పులు జరిగాయి.
మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు విప్లవ శుభాకాంక్షలు తెలుపుతూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పేరు మీద లేఖ విడుదలైంది. 2020 నవంబర్ 26 నుంచి ఇప్పటి వరకు 500 మంది రైతులు కేవలం ప్రభుత్వలు చేస్తున్న హింస వల్ల మృతి చెందారని అభయ్ లేఖలో తెలిపారు. మోడీ ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరపాలన్నారు. కరోనా వైరస్ తో ప్రమాదం ఉందని.. ఈ కారణంగా రైతులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
Also Read: Ladakh Conflict: లద్దాఖ్ లో యుద్ధ మేఘాలు.. భారీగా బలగాల మోహరింపు