IRR Case : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జిషీట్
CID Charge Sheet On CBN: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ ఛార్జిషీట్ నమోదు చేసింది. అలైన్ మెంట్ మార్చి భారీగా లబ్ది పొందారని సీఐడీ ఆరోపించింది
AP CID News: అమరావతి(Amaravathi) రింగ్ రోడ్డు కేసులో విజయవాడ ఏసీబీ(ACB_ కోర్టులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయి ఏ-1గా చంద్రబాబు(CBN), ఏ–2గా నాటి పురపాలక మంత్రి పొంగూరి నారాయణ(Narayana)లను చేర్చింది. ఈకేసులో ఏ-14గా నారాలోకేశ్(Lokesh) తోపాటు పాటు లింగమనేని రమేశ్ పేర్లను ఛార్జిషీట్‌లో పేర్కొంది.
చంద్రబాబుపై ఛార్జిషీట్
అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు(CBN)పై ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. చంద్రబాబుతోపాటు నాటి మంత్రి నారాయణను ప్రధాన ముద్దాయిలుగా చేర్చింది. దీంతో ఈ కేసులో న్యాయ విచారణ ప్రక్రియ వేగవంతం కానుంది. ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్చడం వల్ల చంద్రబాబు(CBN) సన్నిహితుల భూముల విలువ భారీగా పెరిగేలా చేశారన్నది సీఐడీ ప్రధాన ఆరోపణ. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్‌డీయే(CRDA) అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్‌మెంట్ రూపొందించారు. పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. కానీ తమకు ప్రయోజనకరంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో చంద్రబాబు, నారాయణ మార్పులు చేశారని సీఐడీ(CID) ఆరోపించింది. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలో వారి భూములకు దగ్గరగా నిర్మించేలా ఖరారు చేశారని సీఐడి ఛార్జిషీట్‌లో తెలిపింది.
ఆస్తులు కొనుగోలు
ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం గోప్యంగా ఉంచి చంద్రబాబు, నారాయణ ….ఆ రోడ్డుకు ఇరువైపులా భారీగా భూములు కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపించింది. ఆ తర్వాత అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR)ను అమరావతి మాస్టర్ ప్లాన్ లో చేర్చారని తెలిపింది. ఈ భూ కుంభకోణం ద్వారా లింగమనేని రమేశ్ కు భారీగా లబ్ధి చేకూరందని....ప్రతిఫలంగా హెరిటేజ్(Heritage) ఫుడ్స్‌కు భూములు పొందారని పేర్కొంది. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక భూమిక పోషించారని ఆరోపించింది. మారిన అలైన్ మెంట్ లోభాగంగా నిర్మించనున్న రింగ్ రోడ్డు పరిధిలోనే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందారని ఆరోపించింది. అయితే ఈ భూములు 2014 జూన్ – సెప్టెంబర్ మధ్య హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. అంతే కాకుండా లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. కానీ అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారని సీఐడీ ఆరోపించింది. ఈ ఇన్నర్ రోడ్డుకు ఆనుకునే లింగమనేని రమేశ్(Lingamaneni Ramesh) కు చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉన్నాయని సీఐడీ ఆరోపించింది. అదేవిధంగా నాటి పురపాలక మంత్రి నారాయణ... తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారని ఆరోపించింది.
వంతెన మార్చారు
సీఆర్‌డీఏ(CRDA) అధికారులు మొదట రూపొందించిన అలైన్‌మెంట్ ప్రకారం గుంటూరు జిల్లాలోని నూతక్కి –కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించాలి. అక్కడి నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అలా నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూ సేకరణ కింద తొలగించాల్సి వస్తుందని...ఆయన ఆదేశాలతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారని సీఐడీ ఆరోపించింది. మారిన అలైన్ మెంట్ ప్రకారం నారాయణ విద్యాసంస్థలకు చేరువులోనే ఇన్నర్ రింగ్ రోడ్డు రానుంది. తద్వారా ఆయనకు భారీగా లబ్ది చేకూరందని తెలిపింది. అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పుల వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది