Phir Aayi Hasseen Dillruba Movie Review - ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా రివ్యూ: Netflixలో తాప్సీ డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ - భార్య, భర్త మధ్య మరొకరు వస్తే?
Phir Aayi Hasseen Dillruba Review In Telugu: తాప్సీ 'హసీన్ దిల్‌రూబా'కు సీక్వెల్ 'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా' నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందో చూడండి.
జయ్ ప్రద్ దేశాయ్
తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్ తదితరులు
Taapsee Pannu, Vikrant Massey's Phir Aayi Hasseen Dillruba Review: విక్రాంత్ మాస్సే '12th ఫెయిల్'తో తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే, ఆయన హిందీలో చాలా సినిమాలు చేశారు. వాటిలో తాప్సీతో నటించిన 'హసీన్ దిల్‌రూబా' ఒకటి. అది 2021లో వీక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఆ సినిమా సీక్వెల్ 'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా' విడుదలైంది. ఇదీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ సినిమా. ఇందులో విక్కీ కౌశల్ తమ్ముడు సన్నీ కౌశల్ మరొక హీరో. జిమ్మీ షెర్గిల్ కీలక పాత్ర చేశారు. కణికా థిల్లాన్ కథ అందించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Phir Aayi Hasseen Dillruba Story): 'హసీన్ దిల్‌రూబా' కథ గుర్తు ఉందా? రిషి సక్సేనా (విక్రాంత్ మాస్సే), రాణి కశ్యప్ (తాప్సీ పన్ను)కు పెళ్లి అవుతుంది. అయితే సంసార జీవితం సరిగా సాగదు. అప్పుడు రిషి కజిన్ నీల్ త్రిపాఠి (హర్షవర్ధన్ రాణే)కి దగ్గర అవుతుంది రాణి. అతడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అనూహ్యంగా నీల్ మాయం అవుతాడు. మళ్లీ వచ్చి రాణికి బ్లాక్ మెయిల్ చేయడంతో అతడిని చంపేసి పోలీసుల నుంచి ఎస్కేప్ అవుతారు రిషి, రాణి.
'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా' కథకు వస్తే... పుట్టినిల్లు, మెట్టినింటి వారికి దూరంగా ఆగ్రాలో ఉంటోంది రాణి. మేకప్ ఆర్టిస్టుగా బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగిగా చేస్తుంది. రాణి అద్దెకు ఉంటున్న ఇంటిలో మహిళకు వైద్యం చేయడానికి కాంపౌండర్ అభిమన్యు (సన్నీ కౌశల్) వస్తుంటాడు. రాణిని ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. రిషి ఆగ్రాలో ఉంటున్నా నేరుగా కలవకుండా ఫోనులో మాట్లాడుతూ ఉంటుంది. రెండు నెలల్లో ఆగ్రా వదిలి థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. సరిగ్గా ఆ టైంలో పవర్ ఫుల్ ఆఫీసర్ మోంటూ (జిమ్మీ షెర్గిల్) ఆగ్రా స్టేషనుకు వస్తాడు. ఆయన నీల్ మరణానికి కారణమైన రిషి, రాణిలను కటకటాల్లోకి నెట్టాలని చూస్తాడు. అతడి నుంచి తప్పించుకోవడానికి అభిమన్యును పెళ్లి చేసుకుంటుంది రాణి.
రిషి బతికి ఉన్నాడని, ఆగ్రాలోనే ఉంటున్నాడని అభిమన్యు తెలుసుకున్నాడా? ఈ కథలో ఎవరు ఎవరిని మోసం చేయాలని అనుకున్నారు? అభిమన్యు గతం ఏమిటి? ఆయన కుటుంబ సభ్యుల మరణాలకు కారణం ఏమిటి? రిషి, రాణి, అభిమన్యును మోంటూ పట్టుకున్నాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Phir Aayi Hasseen Dillruba Review): 'హసీన్ దిల్‌రూబా'కు వీక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఆ క్యారెక్టర్లకు చాలా మంది కనెక్ట్ అయ్యారు. రాణి ఇన్నోసెన్స్, భర్త ఉన్నప్పటికీ వేరొకరికి దగ్గరయ్యే అంశాలకు కన్వీన్స్ అయ్యారు. పెళ్లైన కొత్తలో భార్య భర్తల మధ్య సన్నివేశాలు నవ్వించాయి
'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా'కు వస్తే... 'హసీన్ దిల్‌రూబా' చూసిన వీక్షకులందరికీ రిషి, రాణి తెలుసు. అందుకని, కొత్త క్యారెక్టర్ అభిమన్యును తీసుకు వచ్చి సర్‌ప్రైజ్ చేశారు రైటర్ కనికా థిల్లాన్. ప్రేమ పేరుతో రాణి దగ్గరకు అతను వస్తుంటే... అతడిని రిషి, రాణిలు ఏం చేస్తారోనని వీక్షకుల మదిలో చిన్నపాటి టెన్షన్ క్రియేట్ అవుతుంది. అయితే... ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కొత్త ట్విస్ట్ ఇస్తూ ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, కొన్ని సన్నివేశాలు తేలిపోయాయి. దాంతో థ్రిల్స్ మిస్ అయ్యాయి. అభిమన్యుకు రాణి ప్రపోజ్ చేయడం, పెళ్లి వంటివి హడావిడిగా తీశారు. సీక్వెల్ కోసం కథను చాలా తెలివిగా ముగించినట్టు అనిపించింది తప్ప ఎండింగ్ ట్విస్ట్ అంతగా ఎగ్జైట్ చేయలేదు.
Also Read: కమిటీ కుర్రోళ్ళు రివ్యూ: ఆ క్లైమాక్స్ పవన్ కోసమేనా - నిహారిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
భార్య మీద రిషికి ఎంత ప్రేమ ఉంటుందంటే... ఆమె కోసం చేతిని నరుక్కుంటాడు. తన మీద అంత ప్రేమ ఉన్న పిచ్చోడు ఉండగా... మరొక వ్యక్తి మీద ప్రేమ ఉన్నట్టు రాణి నటించడం అంటే ఆవిడ సైతం ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటుందని ఆడియన్స్ అనుకుంటారు. దినేష్ పండిట్ రాసిన నవలల్లో ఊహాతీత ట్విస్టులు ఉంటాయని భావిస్తారు. అయితే, ఆ ట్విస్టులు క్యారెక్టరైజేషన్ మ్యాడ్‌నెస్ మ్యాచ్ చేయలేదు. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకోదు. అవి 'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా'కు పెద్ద మైనస్. అయితే... విక్రాంత్, తాప్సీ, సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్ తమ నటన సన్నివేశాలను చూసేలా చేశారు. కెమెరా వర్క్, మ్యూజిక్ సైతం బావున్నాయి.
రాణి పాత్రలో తాప్సీ మరోసారి మేజిక్ చేశారు. శారీని క్యారీ చేసే స్టైల్ ఆ పాత్రకు సపరేట్ ఫ్యాన్స్ వచ్చేలా చేసింది. రిషిగా పాత్రలో విక్రాంత్ ఒదిగిపోయారు. సన్నీ కౌశల్ ఓకే. జిమ్మీ షెర్గిల్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మిగతా నటీనటులు ఓకే.
Phir Aayi Hasseen Dillruba Review Telugu: 'హసీన్ దిల్‌రూబా'తో ఎటువంటి కంపేరిజన్స్ చేయకుండా చూస్తే... 'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రూబా' రెండున్నర గంటలు ఎంగేజ్ చేస్తుంది. తాప్సీతో పాటు విక్రాంత్ నటన మరోసారి తప్పకుండా ఆకట్టుకుంటుంది. వాళ్లిద్దరితో పాటు మ్యూజిక్, కెమెరా వర్క్ బావుండటం ప్లస్ పాయింట్! అయితే, ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా చూడండి.
Also Read: బృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?