Zika in Telangana: తెలంగాణాలో జికా వైరస్, తేల్చిన ఆరోగ్య సంస్థ, ఇదెలా సోకుతుంది? లక్షణాలేంటి?
జికా వైరస్ మహమ్మారి మనదేశంలో చేపకింద నీరులా పాకిపోతోంది.
జికా వైరస్ గర్భిణిల పాలిట శాపం అనే చెప్పాలి. ఈ వైరస్ వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేది వారే. పుట్టే బిడ్డలు చిన్న తలతో పుట్టే అవకాశాలు ఎక్కువ. అందుకే జికా వైరస్ తో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి భారత ఆరోగ్య సంస్థలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం జికా వైరస్ తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చినట్టు డెక్కన్ క్రానికల్‌లో ప్రచురించారు. మొన్నటి వరకు కేరళ, ఢిల్లీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోకి ఈ వైరస్ ప్రవేశించిందని భావించారు అధికారులు. ఇప్పుడు తాజాగా చేసిన సర్వేలో జికా తెలంగాణాతో పాటూ మరికొన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టినట్టు నిర్ధారణ అయనట్టు చెబుతున్నారు.
తెలంగాణాలో 64 కేసులు?
ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ అనే జర్నల్ లో ప్రచురించిన కథనంలో ‘మా అధ్యయనం వల్ల భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు జికా వైరస్ వ్యాప్తి చెందిందని, ఇంకా వ్యాప్తి చెందుతుందని తేలింది. అందుకే ఈ విషయంలో నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాం’ అని అధికారులు పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా 1,475 నమూనాలను పరీక్షించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన 64 నమూనాలలో జికా వైరస్ పాజిటిక్ కేసులు బయటపడ్డాయి. దీన్ని బట్టి దేశంలో జికా వైరస్ నిశ్శబ్దంగా వ్యాపిస్తున్నట్టు తేలింది.
ఏంటీ వైరస్?
జికా వైరస్ ఆఫ్రికా నుంచి ప్రపంచదేశాలకు పాకింది. తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని కోతిలో గుర్తించారు. మొదట్లో దీన్ని మనుషులకు సోకదని, సోకినా అంత ప్రమాదకరం కాదని అనుకున్నారు. కానీ 1960లో తొలిసారి నైజీరియాలోని ఓ వ్యక్తికి సోకింది. అప్పట్నించి చాప కింద నీరులా విస్తరిస్తూ ఇప్పుడు 39 దేశాలకు వ్యాప్తి చెందింది. జికా వైరస్ ను చూసి ప్రపంచం భయపడింది 2014లో. బ్రెజిల్‌లో పిల్లలు చిన్న తలతో పుట్టడం ఎక్కువైంది. నాలుగు వేల మంది చిన్నారులు ఇలా చిన్న తలతో జన్మించారు. దానికి మైక్రోసెఫలీ అనే పేరు పెట్టారు. మొదట్లో డెంగ్యూ వల్ల ఇలా జరుగుతుందని అనుకున్నారు. కానీ చివరికి జికా వైరస్ కారణంగా ఇలా జరుగుతున్నట్టు తేలింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది.
ఎలా వ్యాపిస్తుంది?
ఈడిస్ దోమల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అలాగే లైంగిక సంబంధాల వల్ల కూడా సోకుతుందని చెబుతున్నా, దానికి సంబంధించి ఆధారాలేవీ లేవు. ముఖ్యంగా అయితే దోమల వల్లే కాబట్టి ఇంట్లో, ఇంటి చుట్టు పక్కల దోమలు లేకుండా చూసుకోవాలి. చల్లదనం ఉన్నచోటే దోమలు అధికంగా తిరుగుతాయి. కాబట్టి నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలి.
వైరస్ లక్షణాలు
ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం కనిపిస్తుంది. తలనొప్పిగా అనిపిస్తుంది. కళ్లు ఎర్రగా మారడం, చర్మం పై దద్దుర్లు, కండరాల నొప్పులు, గొంతునొప్పి, లింఫ్ గ్రంథులు వాపు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
చికిత్స...
దీనికంటూ ప్రత్యేకమైన చికిత్స లేదు. అన్ని వైరస్ జబ్బులకు ఇచ్చినట్టే మందులు ఇస్తారు. ముఖ్యంగా డీ హైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. ద్రవ పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. ఒక్కసారి జికా వైరస్ రక్తంలో చేరితే దాదాపు వారం పాటూ ఉంటుంది. ఆ సమయంలో మిమ్మల్ని దోమ కుడితే, ఆ దోమ జికా వాహకంగా మారిపోతుంది. అది వేరే వారిని కుట్టగానే వారికీ వచ్చేస్తుంది.
Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? అందుకే ఇది తింటే అన్ని రోగాలు