కొంతమంది పిల్లల్లో నత్తి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి?
కొంతమంది పిల్లలు అక్షరాలు సరిగా పలకరు. వారికి నత్తి వచ్చిందని అంటారు.
నత్తి... చిన్న సమస్యలా కనిపిస్తుంది, కానీ ఆ సమస్యతో బాధపడే వారికే దానిలోని లోతు తెలుస్తుంది. ఎదుటివారు హేళన చేసినప్పుడు మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నత్తి ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. నత్తి సమస్య ఉన్న పిల్లల్లో కొందరికి ఒక అక్షరం పలకకపోవచ్చు, లేదా కొన్ని అక్షరాలు సరిగా రావు. సాధారణంగా నత్తి ఎక్కువగా అబ్బాయిల్లోనే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా రెండు నుంచి ఐదు ఏళ్ల వయసులో అధికంగా ఈ నత్తి వస్తుంది. వీరిలో ఏడేళ్ల వయసు వచ్చేసరికి దానంతట అదే పోతుంది. కానీ ఒక శాతం మందిలో మాత్రం పెద్దయ్యాక కూడా నత్తి వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారికి జీవితాంతం ఆ సమస్య ఉంటుంది. అయితే చాలామందికి ఒక సందేహం ఉంది. కొంతమందిలోనే ఎందుకు నత్తి వస్తూ ఉంటుంది అని, దానికి వివరణను ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
నత్తి ఉన్న పిల్లలు అమాయకులుగా కొంతమంది భావిస్తారు. నిజానికి నత్తికి, తెలివితేటలకు ఎలాంటి సంబంధం లేదు. సాధారణ పిల్లల కన్నా కూడా నత్తి ఉన్న పిల్లలు మరింత తెలివిగా వ్యవహరిస్తారు. అయితే మాట్లాడడానికి అవసరమైన కండరాల మధ్య సమన్వయ లోపం తక్కువగా ఉన్నా, సమన్వయం సరిగా కుదరకపోయినా... కొన్ని అక్షరాలు సరిగా పలకలేరు. అదే నత్తి. దీంతో వారు మాట్లాడుతున్నప్పుడు కాస్త గాబరా పడుతూ ఉంటారు. నత్తి జన్యుపరంగా కూడా వస్తూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో వారసత్వంగా నత్తి రావడం సహజం. నత్తి ఉన్నవారు జీవితంలో ఎదగలేరు అనుకోవడం మాత్రం పూర్తిగా పొరపాటే. వారిలో తెలివితేటలు పుష్కలంగా ఉండే అవకాశం ఎక్కువ.
పిల్లల్లో నత్తి అధికంగా ఉన్నప్పుడు వారికి స్పీచ్ థెరపీ ఇప్పిస్తే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. నిజానికి నత్తికి ఇంతవరకు ఔషధం లేదు. రావడం కూడా కష్టమే. ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులు అధికంగా మాట్లాడుతూ, వారి చేత అక్షరాలను పదేపదే పలికిస్తూ ఉంటే నత్తి సమస్య తగ్గే అవకాశం ఉంది. వేగంగా మాట్లాడుతున్న పిల్లల్లో నత్తి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి పిల్లలు నెమ్మదిగా మాట్లాడేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి. నత్తి ఎక్కువగా ఉన్న పిల్లలకు సంగీతం నేర్పించడం, పాటలు పాడించడం వంటివి చేస్తే ఆ సమస్య కొంత తగ్గుముఖం పడుతుంది. ఐదేళ్ల లోపే నత్తిని గుర్తిస్తే స్పీచ్ థెరపీని ఇప్పించండి. భవిష్యత్తులో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
Also read: కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న, రెండింట్లో ఏది బెటర్?
Also read: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.