Earth Stopped Rotating: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త
భూమి తిరగడం నిలిచిపోతే ఏమవుతుంది? పరిస్థితి.. హాలీవుడ్ సినిమాల్లో చూపించే సీన్స్ కంటే దారుణంగా ఉంటుందా? దీనిపై ప్రముఖ ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త ఏమన్నారు?
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం చిన్నప్పుడే తెలుసుకున్నాం. మరి, భూమి ఎంత వేగంతో తిరుగుతుందో మీకు తెలుసా? గంటకు దాదాపు 1000 కిలోమీటర్లు. ఔనండి, భూమి 23 గంటల 56 నిమిషాల్లో 4 సెకన్లలో సుమారు 40,075 కిలోమీటర్లు తిరిగేస్తుంది. ఇది వినేందుకు చిత్రంగా ఉన్నా శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి నమ్మక తప్పదు. అయితే, భూమి అంత వేగంగా తిరుగుతున్నా మనకు ఆ ఫీల్ ఎందుకు రావడం లేదనే సందేహం కూడా చాలామందిలో వస్తుంది. దీనికి కూడా శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు. భూమి తిరిగే వేగం, కక్ష్య వేగం ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మనకు తిరుగున్న అనుభూతి కలగదని తెలిపారు. మరి, భూమి తిరగడం నిలిచిపోతే ఏమవుతుంది? దీనిపై చాలామంది చాలా రకాల కారణాలు చెప్పారు. అయితే, ప్రముఖ ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త(Astrophysicist) నీల్ డిగ్రాస్ టైసన్(Neil deGrasse Tyson) చెప్పింది వింటే మైండ్ బ్లాక్ అవుతుంది.
వినాశనం తప్పదా?: 2012లోనే భూమి అంతమైపోతుందని చాలా వార్తలు వచ్చాయి. సినిమాలు కూడా వచ్చేశాయి. ఆ ప్రచారం జరిగి పదేళ్లు కావస్తున్నా అలాంటి సంకేతాలేవీ కనిపించలేదు. సునామీలు, భూకంపాలు ఎప్పటిలాగానే కలవరపెడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వాటికంటే మరింత ప్రమాదకరమైనది. అది ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు, యావత్ ప్రపంచానికి ప్రమాదకరమే. ఇక అంతరిక్షంలో తిరిగే గ్రహ శకలాలతో కూడా భూమికి ముప్పు ఉంది. అది అకస్మాత్తుగా జరిగే ప్రక్రియ. మరి, భూమి తిరగడం నిలిచిపోతే? అది మరింత ప్రమాదకరం. వినాశనం కనీవిని ఎరుగని విధంగా ఉంటుంది.
అమెరికన్ మాజీ టీవీ, రేడియో హోస్ట్ 2013లో స్టార్‌టాక్ రేడియోలో ప్రసారమైన కార్యక్రమంలో దీని గురించి నీల్ డిగ్రాస్ టైసన్‌ను ప్రశ్నించారు. ఇందుకు టైసన్ చెప్పిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు. ‘‘అక్షాంశం ఆధారంగా.. భూమి తిరుగుతున్నప్పుడు మనం తూర్పు దిశగా గంటకు 800 మైళ్లు (సుమారు 1,287 కిమీ) వేగంతో భూమితో కదులుతున్నాం. భూమి తిరగడం ఆగిపోతే 800 మైళ్ల వేగంతో పడిపోతాం. ఈ చర్య భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరినీ చంపుతుంది. ప్రజలు కిటికీల నుంచి ఎగురుతూ ఉంటారు. అది భూమిపై అందరికీ ‘బ్యాడ్ డే’ అవుతుంది’’ అని తెలిపారు.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?
ఆయన చెప్పనది విశ్లేషిస్తే.. వేగంగా వెళ్తున్న బస్సుకు ఒక్కసారే బ్రేక్ వేస్తే ఏ విధంగా ప్రయాణికులంతా ముందుకొచ్చి పడతారో.. 800 మైళ్లకు పైగా వేగంతో తిరిగే భూమి ఆగిపోతే.. అదే వేగంతో మనం ఎగిరిపడతాం. అంటే, ప్రస్తుతం మన భూమిపై ‘సీట్ బెల్ట్’ లేకుండా ప్రయాణిస్తున్నట్లు లెక్క. అయితే, ఎక్కువ ప్రమాదం భూమి ఉపరితలంపై ఎక్కువ ప్రభావం పడుతుంది. అక్కడ భూమి తిరిగే వేగం గంటకు 1,600 కిమీల వేగం ఉంటుంది. అలాగే భూమధ్యరేఖ ప్రాంతాలపై కూడా వేగం ఎక్కువ ఉంటుంది. మనుషుల నుంచి వస్తువుల వరకు ప్రతి ఒక్కటీ తూర్పు వైపుకు విసేరేసినట్లుగా ఉంటుంది. మహా సముద్రాలు సైతం కదిలి భారీ సునామీలు ఏర్పడతాయి. గుడ్ న్యూస్ ఏమిటంటే.. ‘‘భూమి తిరగడం నిలిచిపోవాలంటే బోలెడంత శక్తి అవసరం అవుతుంది. భూమిపై తిరిగే అన్ని వస్తువులకు సమానమైన చలనానికి సమానమైన శక్తి తీసుకుంటుంది. కానీ, భూమిపై ఉన్న ఎలాంటి మెకానిజమ్ ఆ శక్తిని ఇవ్వలేవు’’ అని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలోని జిమ్ జింబెల్‌మాన్ అనే జియాలజిస్ట్ తెలిపారు. కాబట్టి, ప్రస్తుతానికైతే మనకి భూమిపై తిరిగేందుకు ‘సీట్ బెల్ట్’ అవసరం లేదు.
Also Read: గుండె నొప్పిని మీ కాళ్లు ముందే హెచ్చరిస్తాయి, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!