Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?
అందాన్ని పెంచే టూల్స్‌లో ఫేస్ రోలర్ ఒకటి. ఇదెందుకు వాడతారో, ఉపయోగాలేంటో తెలుసా?
సెలెబ్రిటీలు ఈ మధ్య బాగా వాడుతున్న బ్యూటీ పరికరం ఫేస్ రోలర్. రెండు వైపులా రెండు నున్నని రాళ్లు కూర్చి ఉంటాయి. క్వార్ట్జ్ రాళ్లను ఇందుకు వాడతారు. ఇవి చాలా సున్నితంగా, తాకితే మృదువుగా ఉంటాయి. దీన్ని ముఖంపై మసాజ్ చేసేందుకు వాడతారు. స్కిన్ కేర్ మార్కెట్లో వివిధ రాళ్లతో చేసిన ఫేస్ రోలర్లు అమ్మకానికి దొరుకుతున్నాయి. దీన్ని రెండు వైపులా వాడుకోవచ్చు.చర్మంపై దీంతో మసాజ్ చేస్తే అందం రెట్టింపు అవుతుంది.
ముఖంపై దీంతో రోలింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఇలా రక్త ప్రవాహం మెరుగవ్వడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ముఖం ఉబ్బడం వంటివి కూడా తగ్గిస్తుంది. రోలర్‌తో ముఖాన్ని మసాజ్ చేసినప్పడు ఇది ముఖంలోని శోషరసాల ప్రవాహాన్ని పెంచుతుంది. తద్వారా వాపు లక్షణాలను తగ్గిస్తుంది. చర్మానికి ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది.
ఇంకా ఎన్నో ఉపయోగాలు
1. ముఖంపై వాపును (పఫ్ నెస్) తగ్గిస్తుంది.
2. చర్మం సాంత్వన కలిగిస్తుంది.
3. రిలాక్సేషన్ అందిస్తుంది.
4. ఒత్తిడిని తగ్గిస్తుంది.
5. రక్త ప్రసరణను పెంచుతుంది.
అయితే వీటిని తరచూ వాడడం వల్లే ఈ ఫలితాలు కలుగుతాయి. శాశ్వత ప్రభావం కలగదు. ముఖాన్ని సన్నగా చేయడం, లావుగా చేయడం వంటివి ఈ రోలర్లు చేయలేవు. కేవలం ముఖాన్ని మెరిపిస్తాయి. కాకపోతే ముఖవాపును తగ్గిస్తాయి కాబట్టి సన్నగా అయినట్టు అనిపిస్తుంది అంతే కానీ నిజానికి ముఖం అదే సైజులో ఉంటుంది.
రోలర్ ఉపయోగించే ముందు మంచి ఫలితాల కోసం శుభ్రమైన ముఖానికి మాయిశ్చరైజర్ లాంటిది రాసుకుంటే మంచిది. దీనివల్ల రోలర్ చర్మంలోపలికి మాయిశ్చరైజర్ చొచ్చుకుపోయేలా చేస్తుంది. అంతేకాదు ముఖంపై రోలర్ సులభంగా కదలగలుగుతుంది. ఎంతో మంది బాలీవుడ్ సెలెబ్రిటీలు ఇప్పుడు దీన్ని వాడుతున్నారు.
మంచి ఫలితాల కోసం మరీ చర్మంపై గట్టిగా కాకుండా, అలా అని మరీ సున్నితంగా కాకుండా మర్ధనా చేయాలి. సుతిమెత్తగా చేయడం వల్ల ఉపయోగం ఉండదు, గట్టిగా మసాజ్ చేయడం మొటిమలు వంటి గాయాలు పెద్దవవుతాయి.
Also read: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు
Also read: మధుమేహులకు మేలు చేసే అరటిపువ్వు, వారే కాదు ఎవరు తిన్నా ఆరోగ్యమే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.