Early Signs of Liver Problems : ఇంట్లోనే మీ కాలేయం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవచ్చా? ఈ 4 సింపుల్ టెస్టులు చేసి చెక్ చేసుకోండి
Fatty Liver Warning Signs : కాలేయం సమస్యలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. అయితే లివర్ పూర్తిగా డ్యామేజ్ కాకముందే ఇంట్లో కొన్ని సింపుల్ టెస్ట్లు చేసి.. కాలేయ ఆరోగ్యంపై అంచనా వేయవచ్చు.

- కాలేయం శరీరానికి కీలకం, దెబ్బతిన్నా లక్షణాలు ఆలస్యం.
- కొవ్వు ఆహారం, వ్యాయామ లోపం కాలేయ సమస్యల కారణాలు.
- అలసట, కామెర్లు, పొట్ట నొప్పి వంటి లక్షణాలు గమనించాలి.
- మద్యపానం, చెడు ఆహారం మానుకుని, వెంటనే వైద్యుని కలవాలి.
Warning Signs of an Unhealthy Liver : కాలేయం మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటమే కాకుండా.. శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపించి.. శక్తిని నిల్వ చేస్తుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లను తయారు చేయడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులను చేస్తుంది. అయితే లివర్ దెబ్బతిన్నా.. ప్రారంభ దశలో లక్షణాలు పెద్దగా కనిపించవు. దాదాపు 70 నుంచి 80 శాతం వరకు కాలేయం దెబ్బతిన్న తర్వాతే సమస్యలు బయటపడుతుంటాయి.
ప్రస్తుతం ఫ్యాటీ లివర్ అనేది చిన్న వయసు వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అధిక కొవ్వు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం, ఊబకాయం, మధుమేహం వంటి కారణాలు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే కొన్ని సాధారణ సంకేతాలను ఇంట్లోనే గమనించడం ద్వారా కాలేయ ఆరోగ్యంపై ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
కుడి పక్కటెముక కింద..
మీ కుడి వైపున ఉన్న కింది పక్కటెముక కింద రెండు లేదా మూడు వేళ్లతో మెల్లగా నొక్కుతూ డీప్ బ్రీత్ తీసుకోండి. ఈ సమయంలో అక్కడ తీవ్రమైన నొప్పి, బరువుగా అనిపించడం లేదా అసౌకర్యం ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సందర్భాల్లో ఇది కాలేయంలో వాపు లేదా ఇతర సమస్యలకు సంకేతం కావచ్చు. అయితే కేవలం ఈ పరీక్షతోనే కాలేయ సమస్యను నిర్ధారించలేము.
వాల్ సిట్ టెస్ట్
గోడకు వీపు ఆనించి.. కుర్చీలో కూర్చున్నట్లుగా మోకాళ్లను 90 డిగ్రీల కోణంలో వంచి కూర్చోవాలి. ఈ భంగిమను వాల్ సిట్ అంటారు. మీరు ఈ స్థితిలో 15 నుంచి 20 సెకన్ల పాటు సులభంగా ఉండగలిగితే మీ శరీర బలం బాగుందని అర్థం. అయితే కొన్ని సెకన్లలోనే కాళ్లు వణకడం లేదా నిలబడిపోవాల్సి వస్తే అది కండరాల బలహీనత లేదా ఫిట్‌నెస్ లోపానికి సంకేతం కావచ్చు. ఇది కాలేయ ఆరోగ్యాన్ని నిర్ధారించే పరీక్ష కాదు.. కానీ మొత్తం శారీరక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
కళ్లు, నాలుక
అద్దం ముందు నిలబడి కళ్లలోని తెల్లటి భాగాన్ని గమనించండి. కళ్లు పసుపు రంగులోకి మారడం లేదా చర్మం పసుపు రంగులో కనిపించడం కామెర్లకు (జాండిస్) సంకేతం కావచ్చు. అలాగే నాలుకపై తెల్లటి పూత కనిపించడం అనేక కారణాల వల్ల రావచ్చు. కళ్లలో పసుపు రంగు, అలసట, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కలిసి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పొట్టను లోపలికి లాగండి..
మీ పొట్టను పూర్తిగా లోపలికి లాగి 20 సెకన్ల పాటు అలాగే ఉంచడానికి ప్రయత్నించండి. ఇది పొత్తికడుపు కండరాల బలాన్ని పరీక్షించే వ్యాయామం. చేయలేకపోవడం అంటే కాలేయం బలహీనపడిందని చెప్పలేం. అయితే ఊబకాయం, బలహీనమైన కోర్ కండరాలు లేదా శారీరక ఫిట్‌నెస్ తక్కువగా ఉండటం వంటి కారణాలు ఉండొచ్చు.
కాలేయం దెబ్బతింటే కనిపించే లక్షణాలు ఇవే
లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు శరీరం కొన్ని లక్షణాలు చూపిస్తుంది. తరచూ అలసటతో ఉండడం, నీరసం, ఆకలి తగ్గడం, వికారం లేదా వాంతులు, పొట్ట కుడివైపు నొప్పి, చర్మం, కళ్లలో పసుపు రంగులోకి మారడం, మూత్రం ముదురు రంగులో రావడం, కాళ్లు లేదా పొట్టలో వాపు, కారణం లేకుండా బరువు తగ్గడం వంటివి కాలేయ సమస్యల్ని సూచిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్..
లివర్ హెల్తీగా ఉండాలంటే మందు తాగడం మానేయాలి. కనీసం తగ్గించాలి. నూనె, జంక్ ఫుడ్, అధిక చక్కెర ఉన్న ఆహారాలను కంట్రోల్ చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయాలి. శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. తగినంత నీరు శరీరానికి అందించాలి. మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే వైద్యుల సహాయంతో అదుపులో ఉంచుకోవాలి. వైద్యుల సలహా లేకుండా మందులు లేదా హెర్బల్ సప్లిమెంట్లు ఎక్కువగా వాడకూడదు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
ఇంట్లో మీరు ఈ టెస్ట్లు చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. కానీ ఇబ్బంది ఉంటే ముందుగానే అలెర్ట్ అవ్వచ్చు. డౌట్ ఉంటే కచ్చితంగా లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేయించుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని పూర్తిగా అంచనా వేయవచ్చు.
కాలేయ ఆరోగ్యం, కాలేయ సమస్యల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే దీనిని క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















