Ulavalu: ఉలవలు మెనూలో చేర్చుకోవాల్సిందే, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది
ఉలవలను ఆహార పదార్థం చూడడం ఎప్పుడో మానేశాం. నిజానికి వీటి వల్ల కలిగే ఆరోగ్య లాభాలు వేటి వల్ల కలగవు.
ఉలవలు అనగానే గుర్రాల ఆహారంగానే గుర్తొస్తుంది. నిజానికి అవి గుర్రాల కోసం కాదు, మన ఆరోగ్యానికే ఎంతో మేలు చేస్తాయి. ఉలవలను తినడం ఎప్పుడో మానేశారు ప్రజలు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉలవచారును మాత్రం అప్పుడప్పుడు వండుకుంటున్నారు. ఉలవలతో చేసే వంటకాలను కనీసం రెండు వారాలకోసారైనా తినాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా మధుమేహం వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అలాగే మధుమేహం ఉన్నవారు వీటిని తిన్నా చాలా మంచిది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి ఉలవలు డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అని చెప్పుకోవాలి.
ఇవిగో ప్రయోజనాలు
అధిక బరువు అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య.బరువు తగ్గాలనుకునేవారు ఉలవలను పరగడుపున తినడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కొవ్వును కరిగించే సామర్థ్యం వీటికుంది. కప్పు ఉడకబెట్టిన ఉలవలు తినడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. కొందరికి చెమట అధికంగా పడుతుంది. అలాంటి వారు ఉలవలను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అధికంగా చెమట పట్టడం తగ్గుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం కూడా తగ్గుతుంది.
ఆ శక్తిని పెంచుతుంది
స్త్రీలలో అనేక నెలసరి సమస్యలకు చెక్ పెట్టడంలో ఇది ముందుంటాయి. పొట్టనొప్పి, అధిక రక్తస్రావం వంటివి తగ్గుతాయి. అలాగే పురుషులు ఉలవల వంటకాలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వారానికోసారైనా తినడం వల్ల లైంగిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పిల్లలకు కూడా ఉలవచారు వంటివి చేసి పెట్టడం వల్ల వారిలో రక్త హీనత సమస్య దరి చేరదు. నీరసం, శక్తి హీనంగా కనిపించడం వంటివి తగ్గి ఉత్సాహం, ఉల్లాసంగా కనిపిస్తారు. ఉలవచారును రోజూ తినడం వల్ల నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, పక్షవాతం వంటివి తగ్గుతాయి. అలాగే జీర్ణ సమస్యలు కూడా తగ్గుమఖం పడతాయి. వెక్కిళ్లు, కంటి సమస్యలు ఉన్నవారికి ఉలవల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. పోషకాహారం లోపం తలెత్తదు. చాలా మంది పిల్లలకి నులి పురుగుల సమస్య ఉంటుంది. ఉలవలు తినడం వల్ల నులి పురుగులు ఏర్పడడం తగ్గుతుంది.
పోషకాల పుట్ట
ఉలవల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫాస్పరస్, ఐరన్, ప్రొటీన్లు, కాల్షియం వంటివి లభిస్తాయి. వందగ్రాముల ఉలవలు తినడం వల్ల 321 కేలరీల శక్తి లభిస్తుంది. 22 గ్రాముల ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు 57 గ్రాములు, కాల్షియం 287 మిల్లీ గ్రాములు, ఫాస్పరస్ 311 మిల్లీ గ్రాములు, పీచు పదార్థమూ కూడా లభిస్తాయి. కాబట్టి ఉలవలను మీ ఆహారమెనూలో భాగం చేసుకోవడం చాలా అవసరం.
Also read: వాకింగ్‌తోనే మూడు నెలల్లో 30 కిలోలు తగ్గొచ్చు తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే ఇది సాధ్యమే