Heart Attack: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి, గుండె పోటు వచ్చే అవకాశం ఉందని అర్థం
మనిషిపై దాడి చేసే ప్రమాదకర ఆరోగ్యపరిస్థితుల్లు గుండెపోటు ముందుంటుంది.
పూర్వం యాభై ఏళ్లు దాటిన వారికే గుండెపోటు రావడం సహజంగా భావించారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. చిన్న వయసులో కూడా గుండె పోటు దాడి చేస్తుంది. అందుకే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాల ద్వారా మనకు సంకేతాలు అందుతాయి. కానీ చాలా మంది వాటిని గుర్తించలేరు. ఎంతో మందికి ఆ లక్షణాలపై అవగాహన కూడా లేదు. దాని వల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
లక్షణాలు ఎలా ఉంటాయంటే..
హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. గుండె పోటు రావడానికి కొన్ని రోజుల ముందు ఎడమ చేతిలో నొప్పిగా ఉంటుంది. ఎడమ భుజం నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ముందుగా భుజంలో మొదలై చేయి వరకు నొప్పి పాకుతుంది. ఎడమ దవడలో కూడా అసౌకర్యంగా అనిపించడంతో పాటూ, నొప్పి మొదలవుతుంది. శ్వాస తీసుకోవడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఆయాసం తరచూ వస్తుంది. చిన్న పని కూడా చేయలేరు. శరీరం చల్లగా మారిపోతుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. వికారంగా అనిపించడం, తలతిరగడం వంటివి కలుగుతాయి. గుండెల మీద ఏదో బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ గుండెపోటు సంకేతాలే. వీటిలో ఏ ఒక్కటి మీకు అనిపించినా వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్లండి. వారు ఈసీజీ పరీక్షల ద్వారా గుండె ఆరోగ్యాన్ని చెక్ చేస్తారు. ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. దీని వల్ల ప్రాణాన్ని కాపాడుకోవచ్చు.
కారణాలెన్నో...
ఆధునిక కాలంలో గుండెపోటు పెరిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. పని ఒత్తిడి యువతరంపై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. చిన్న వయసులో గుండె పోటు రావడానికి కారణం పని ఒత్తిడే. ఒత్తిడి గుండెపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. రక్త సరఫరాపై ఒత్తిడిని కలిగిస్తుంది.చాలా మంది పనిలో పడి భోజనం కూడా సరైన సమయానికి తినడం లేదు. అలాగే సమతులాహారాన్ని అందించే భోజనానికి బదులు ఫాస్ట్ ఫుడ్ లు తిని పొట్ట నింపుకుంటున్నారు. నిద్రలేమి కూడా గుండెపై ఒత్తిడి పెరగడానికి కారణం. అతి వ్యాయామాలు కూడా చేటు చేస్తున్నాయి. కొందరిలో హార్ట్ ఎటాక్ హఠాత్తుగా ఎలాంటి లక్షణాలు చూపించకుండా కూడా వస్తుంది. అలాంటి సమయంలో ఏం చేయలేం కానీ, ఎక్కువ శాతం ఏదో ఒక లక్షణం కనిపిస్తుంది. గుండె ప్రాంతంలో అసౌకర్యంగా అనిపించినా కూడా తక్కువగా తీసుకోవద్దు. చాలా మంది కాసేపు నిద్రపోలే అంతా నార్మల్ అవుతుంది అనుకుంటారు... కానీ ఆ గోల్డెన్ అవర్ చేజారిపోతే చాలా కష్టం. గుండె పోటు విషయంలో అవగాహన పెంచుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.
Also read: వేల ఏళ్ల క్రితం నదిలో మునిగిన ఊరు, ఇప్పుడు బయటపడింది
Also read: కార్డియాక్ అరెస్టు, హార్ట్ ఎటాక్ ఒక్కటి కాదా? రెండింటికీ ఏంటి తేడా?