OldCity: వేల ఏళ్ల క్రితం నదిలో మునిగిన ఊరు, ఇప్పుడు బయటపడింది
చరిత్రలో ఎన్నో ఊళ్లు నదిలో మునిగి కనుమరుగయ్యాయి.అలాంటిదే ఇది కూడా.
వందల,వేల ఏళ్లుగా ఎన్నో గ్రామాలు, ప్రాంతాలు కనుమరుగవుతున్నాయి. అందులో చాలా మటుకు సముద్రాలు, నదుల్లో మునిగిపోయినవే అధికం. ద్వారక కూడా అలా ఎప్పుడో మునికి సముద్రం నుంచి బయటపడిందనే చెప్పుకుంటారు. అలాగే దాదాపు 3,400 ఏళ్ల క్రితం మునిగిపోయిన నగరం ఇప్పుడు బయటపడింది. ఆ గ్రామంలో ఇప్పుడు పురాతత్వ శాస్త్రవేత్తలు జోరుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నగరాన్ని ఇరాక్‌లోని టైగ్రిస్ నది వద్ద కనుగొన్నారు. ఆ నదిలో వేల ఏళ్ల క్రితం మునిగిన ఈ నగరాన్ని కరువు వల్ల నీరెండిపోవడంతో బయటపడింది.
ఎప్పటిదంటే...
ఈ నగరం వయసును నిర్ణయించిన పురాతత్వ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ నగరంలో ప్రజలతో 1475 BC నుంచి 1275 BC మధ్య కాలంలో కళకళలాడేదని అంచనా వేస్తున్నారు. అప్పట్లో దీన్ని మిట్టాని సామ్రాజ్యంలో భాగంగా నిర్మించినట్టు చెబుతున్నారు. జర్మన్, కుర్దిష్ పురాతత్వ శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతంలో దాదాపు 100 పురాతన మట్టి పలకలను కనుగొన్నారు.లోతుగా ఇంకా పరిశోధనలు చేయగా ఒక రాజభవనం, అనేక భవనాలు, టవర్లు, పెద్దపెద్ద నిర్మాణాలు బయటపడ్డాయి. ఇవన్నీ మట్టి ఇటుకలతో కట్టినట్టు గుర్తించారు.
ఎలా మునిగింది...
ఈ నగరం ఎలా మునిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు చరిత్రకారులు. క్రీ.పూ. 1350 ప్రాంతంలో సంభవించిన పెద్ద భూకంపం వల్ల ఇది నాశనమైందని. నీటిలో కలిసిపోయిందని అంచనా వేస్తున్నారు. ఇది మిట్టాని సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన నగరమని చరిత్రకారుల భావన. భారీ భవనాలలో ఎన్నో వస్తువులు నిల్వ చేసి ఉండేవని, అందులో ఎంతో విలువైనవి కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్ద పెద్ద గోడలు, కట్టడాలు చూస్తుంటే అది చాలా పెద్ద నగరంగా భావిస్తున్నారు. భూకంపం వల్ల ఎంతో మంది ప్రజలు చనిపోయి ఉండొచ్చని, మరికొందరు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్నో వేల ఏళ్ల నాటి నగరం బయటపడిందని తెలియగానే ప్రజలు దాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారెవరినీ దగ్గరకు రానివ్వడం లేదు. గతంలో కూడా ఇలా కొన్ని నగరాలు నది, సముద్రాల నుంచి బయటపడిన దాఖలాలు ఉన్నాయి. కరువు వల్ల నీటి శాతం తగ్గి ఒక్కో ప్రాంతం బయటపడుతోంది.