Sleeping: బెడ్ మీద కన్నా నేలపై పడుకుంటే ఆ సమస్యలు దూరమైపోతాయి
మంచం మీద కన్నా నేరుగా నేలపై పడుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి.
పూర్వం కాలంలో అంతా నేలమీదనే నిద్రపోయేవారు. ఇప్పుడు ఆధునిక సౌకర్యాలు ఎక్కువై మంచాలు, మెత్తటి పరుపులు వాడకం ఎక్కువైంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద వయసు వారు నేలమీద పడుకోవడానికే ఇష్టపడతారు. అంతేకాదు వారికి మెడ నొప్పి, వెన్ను నొప్పి అనేవి త్వరగా రావు. కావాలంటే గ్రామాల్లో నేల మీద పడుకునే అలవాటు ఉన్న వారిని అడిగి చూడండి... వారు ఆరోగ్యపరమైన సమస్యలు చాలా తక్కువగా చెబుతారు. నేల మీద పడుకోవడం లాభాలు ఇన్నీ అన్నీ కావు. నేలపై అంటే నేరుగా ఫ్లోర్ పై అనుకోవద్దు, చాప వేసుకుని పడుకోవాలి.
వేడిని తగ్గిస్తుంది
చాలా మంది వేడి చేసింది అని చెబుతుంటారు. చాలా మందికి మంచం మీద పడుకోవడం వేడి చేస్తుంది. ఎందుకంటే నిద్రపోయినప్పుడు శరీరం నుంచి బయటికి వచ్చే వేడి మంచాన్ని చేరుతుంది. అది పరుపును వేడిగా మారుస్తుంది. దీని వల్ల చెమటలు పట్టి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. అదే నేలపై పడుకుంటే మీ నుంచి వచ్చిన వేడి వల్ల నేల అంత వేడిగా మారిపోదు.
నొప్పులు రావు
మంచం మీద నిద్రపోయేవారిలో మెడ పట్టేయడాలు, భుజం నొప్పి కలుగుతుంది. నిద్ర లేవగానే మీకు ఈ రెండింటి గురించి తెలుస్తుంది. ఎందుకంటే మీ శరీరం భంగిమ సరిగా లేనందువల్ల ఇలా జరుగుతుంది. అదే నేలపై పడుకోవడం వల్ల ఇలాంటి సమస్యా రాదు. శరీరం, నేల మధ్య ఉన్న చాప మీరు పడుకున్న భంగిమను మెరుగుపరుస్తుంది. ఎలాంటి నొప్పి రాకుండా చూస్తుంది.
నడుము నొప్పికి చెక్
అనేక మందిని తరచూ వేధించే సమస్య ఇది. ముఖ్యంగా మహిళలను అధికంగా ఇబ్బంది పెడుతుంది. మంచం మీద పడుకోవడం వల్ల సమస్యా పెరుగుతుంది కానీ తగ్గదు. నేలపై పడుకోవడం వెన్నెముక ఆరోగ్యానికి చాలా మంచిది. వెన్నెముకపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. నడుమునొప్పి కలుగదు.
నిద్రలేమి
చాలా మంది నిద్రలేమి వల్ల బాధపడుతున్నారు. మీరు పడుకునే భంగిమ కూడా నిద్రలేమికి కారణం అవుతుంది. మంచం మీద కన్నా నేలపై పడుకునే భంగిమ వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నేలపై పడుకోవడాన్ని ఒక చికిత్సగానే భావించవచ్చు.
ఒత్తిడి తగ్గి...
నేలపై నిద్రపోవడం వల్ల శరీరానికి చాలా మంచిది. కండరాలు బిగుతుగా పట్టకుండా సడలిస్తుంది. దీనివల్ల కండరాల నొప్పులు వంటివి కలగవు. శరీరం చురుగ్గా కూడా ఉంటుంది.
రక్తప్రసరణకు మేలు
నిద్రించే విధానం సరిగా లేకుంటే ఆ ప్రభావం రక్త ప్రవాహంపై పడుతుంది. సరైన నిద్రా భంగిమను బట్టి రక్త ప్రసరణ ఆధారపడి ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా సక్రమంగా జరగాలంటే వారానికి రెండు సార్లయినా నేలపై చాప పరుచుకుని పడుకుంటే మేలు.
Also read: డైనోసార్లను చూడాలని ఉందా? అయితే ఈ డైనోసార్ ఫెస్టివల్‌కు వెళ్లండి
Also read: కనిపించని కిల్లర్ యాంగ్జయిటీ, ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాల్సిందే