Tomato Powder: టమాటోలను పొడి చేసుకుని దాచుకోవచ్చు, ఎన్నాళ్లయినా చెక్కుచెదరదు
టొమాటో ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, అందుకే పొడి చేసుకుని దాచుకుంటే బెటర్.
టొమాటో ధరలు మళ్లీ కొండెక్కిపోయాయి. కిలో రూ.50 నుంచి 60 దాకా ఉంది. పేద ప్రజలు కొనలేని పరిస్థితి. ఒక్కోసారి మాత్రం టమాటా కిలో రూ.10 కి పడిపోతుంది. ఉల్లిపాయలు, టమోటాల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయలేం. టమోటాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు వాటిని పొడి చేసుకుని దాచుకుంటే కూరల్లో వాడుకోవచ్చు. పచ్చి టమోటాలు చేసే పనిని ఈ పొడి కూడా చక్కగా చేస్తుంది. కూరల్లో వేసుకుంటే రుచితో పాటూ అధికంగా ఇగురు వస్తుంది. కాబట్టి ఒక డబ్బా నిండా చేసి దాచుకుంటే నెలల తరబడి వాడుకోవచ్చు.
ఎలా చేయాలంటే...
టమోటాలు తక్కువ ధర ఉన్నప్పుడు ఓ మూడు కిలోలు కొని పెట్టుకోవాలి. వాటిని గుండ్రంగా చక్రాల్లా పలుచగా కోసుకోవాలి. ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి. కాస్త కూడా తడి ఉండకూడదు. ఒక గిన్నెలో వాటిని వేసి ఆడిస్తే గలగల మంటూ శబ్ధం రావాలి. అలా అయ్యాక వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. బరకగా చేసుకున్నా ఫర్వాలేదు. కూరలో వేసి ఉడికిస్తే మెత్తని ఇగురులా మారిపోతుంది. రుచి బావుంటుంది. ఎండబెట్టడం వల్ల టమోటాలకుండే సహజ రుచి పోదు.
గుజ్జుగా కావాలంటే...
గుజ్జుగా దాచుకోవాలనుకునేవారు టమోటాలను గుజ్జులా చేసి పసుపు కలపాలి. అలాగే ఉప్పు కూడా వేస్తే నాలుగైదు నెలలు పాడవకుండా ఉంటుంది. కాకపోతే దీన్ని కచ్చితంగా ఐస్ గడ్డలు కట్టే డీప్ ఫ్రిజ్ లోనే పెట్టాలి.
వీటిని తినడం చాలా ముఖ్యం
టమోటాలను రోజూ తినాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉండే లైకోపీన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ కె, కాల్షియం వంటివి ఎముకలను బలంగా మారుస్తాయి. మధుమేహం ఉన్న వారు టమోటాలను తినడం ముఖ్యం. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. టమోటోలలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు తప్పకుండా టమోటాలు తినాలి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇవి చాలా అవసరం. టమోటోలు విటమిన్ సితో నిండి ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి పెంచడంలో ఈ విటమిన్ చాలా అవసరం. విటమిన్ సి ఒత్తిడి హార్మోన్లను కూడా నియంత్రణలో ఉంచుతుంది. టమోటోలు రోజూ తింటే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా టమోటోలో ఉండే లైకోపీన్ ప్రొస్టేట్, కొలొరెక్టల్, ఉదర క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధించగలదు. క్యాన్సర్ వచ్చిన వాళ్లు టమోటోలు తింటే అది ఆ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.
Also read: డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్లు తినొచ్చా? రోజుకు ఎన్ని తింటే సేఫ్
Also read: మనిషి ఆకారంలో ఊరు, గ్రహాంతరవాసుల పనే అంటున్న గ్రామస్థులు