Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే
ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండల్లో తిరిగితే వడదెబ్బ కొట్టడం ఖాయం.
అధిక వేడిని శరీరం తట్టుకోలేక వడదెబ్బ బారిన పడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గి, డీహైడ్రేషన్ బారిన పడడం వల్ల వడదెబ్బ కలుగుతుంది. బయట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు శరీరం తనలోని వేడిని నియంత్రించుకోలేక విఫలమవుతుంది. అలాంటి సమయంలోనే వడదెబ్బలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. వెంటనే ప్రథమ చికిత్స చేస్తే వారిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడుకోవచ్చు.
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తగిలిన వెంటనే శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఒక్కోసారి 104° ఫారెన్ హీట్ దాటుతుంది. అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా లేదా తక్కువగా తీసుకోవడ, రక్తపోటు పెరగడం లేదా తగ్గడం, చెమట పట్టకపోవడం, వికారం, వాంతులు కావడం, స్పృహ కోల్పోవడం వంటివన్నీ జరుగుతాయి. వడదెబ్బ తగిలిన వెంటనే ప్రాథమిక చికిత్సను అందిస్తే వారిని కాపాడుకోవచ్చు.
ప్రథమ చికిత్స ఇలా...
వడదెబ్బ తగిలిన రోగిని చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. అలా శరీరం అంతా తుడుస్తూ ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీలు వచ్చే వరకు అలా చల్లని నీటితో వస్త్రంతో తుడుస్తూ ఉండాలి. చల్లని పానీయాలను అందించాలి. ఎటువంటి మందులు ఇవ్వకూడదు. గాలి తగిలేచోట ఉంచాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజ్ వాటర్ లో కాస్త ఉప్పు కలిపి తాగించడం మంచిది. ఓఆర్ఎస్ అందుబాటులో ఉంటే దాన్ని తాగిస్తే ఎంతో మేలు. ఈ పనులు చేస్తూనే మరోపక్క ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేయాలి. ఎందుకంటే కొంతమందిలో వడదెబ్బ తీవ్రంగా కొడితే ప్రాణానికే ప్రమాదం కావచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎండలు పెరిగిపోతున్న ఈ కాలంలో వడదెబ్బ కొట్టకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బయట ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సమయంలో ఎక్కువసేపు ఎండకు గురవ్వకపోవడమే మంచిది. బయటికి వెళ్లే ముందు చల్లని పానీయాలు తాగి వెళ్లాలి. కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. మద్యాన్ని పూర్తిగా మానేయాలి. లేత రంగులో ఉండే వస్త్రాలు ధరించాలి. అవి వదులుగా ఉండేలా చూసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం అన్ని విధాలా మంచిది.
ఎండలు పెరుగుతున్నప్పటినుంచి రోజూ మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. వడదెబ్బను తట్టుకునే శక్తిని పానీయాలు అందిస్తాయి. చల్లని పానీయాలు, మజ్జిగ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ పడిపోకుండా ఉంటాయి. వేసవిలో ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం మంచిది. దాహాన్ని పెంచేసే మాంసాహారాన్ని, మసాలా నిండిన ఫుడ్‌కు, స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది.
Also read: భోజనం చేశాక వెంటనే చేయకూడని పనులు ఇవే, లేకుంటే ఈ సమస్యలు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.