Backpain: వెన్నునొప్పి వేధిస్తుందా? ఈ ఆహారాలతో చెక్ చెప్పేయండి
ఇంటి పని దగ్గర నుంచి ఆఫీసు పని చేసే వారి వరకు అందరినీ వేధిస్తున్న సమస్య వెన్నునొప్పి.
ఈరోజుల్లో సాధారణ సమస్యల్లో వెన్ను నొప్పి ఒకటిగా మారిపోయింది. గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్ టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటూ ఉండటం వల్ల నడుము నొప్పి వేధిస్తుంది. తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. అది మాత్రమే కాదు శరీరంలో పోషకాల లోపం, కీళ్ల నొప్పుల వల్ల కూడా జరుగుతుంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే నిత్యం వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. నొప్పిని తగ్గించడమే కాదు కండరాలకు బలాన్ని ఇస్తుంది.
ఆహార పదార్థాల ద్వారా కూడా వెన్ను నొప్పి సమస్యని అధిగమించవచ్చు. శోధ నిరోధక లక్షణాలు, పోషకాలు నిండిన ఆహారం నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. శక్తివంతమైన పండ్లు, ఆకు కూరలు, లీన్ ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి వెన్నెముక, కండరాలని బలంగా మారుస్తాయి. అందుకే వీటిని మీ డైట్లో భాగం చేసుకుంటే నొప్పి లేని జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు
తరచుగా వెన్ను నొప్పితో బాధపడుతుంటే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలని తప్పనిసరిగా చేర్చుకోవాలి. చేపలు, బాదం, వాల్ నట, అవిసె గింజలు, చియా గింజలు వంటి వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఆలివ్ నూనె, ఆవాల నూనె ఉపయోగించినా కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న మసాలాలు చాలా ఉన్నాయి. అల్లం, దాల్చిన చెక్క, ఎర్ర మిరపకాయలు ఆహారంలో పరిమిత పరిమాణంలో వినియోగించుకోవచ్చు. ఇవి మంటని తగ్గించడంలో సహాయపడతాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. కీళ్ల నొప్పులకి సమర్థవంతమైన నివారణ ఇది. అల్లం, వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది.
ప్రోటీన్ ఫుడ్
శరీరంలో సరైన ప్రోటీన్ లేకపోవడం వల్ల కూడా నొప్పులు ఎదురవుతాయి. వాటిని అధిగమించేందుకు ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలు ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ పాలు, గుడ్లు, పప్పులు వంటివి చేర్చుకుంటే మంచిది. ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది.
ఆకుపచ్చ కూరగాయలు
వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి క్రమం తప్పకుండా ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు చేర్చుకోవాలి. బ్రకోలి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర వంటి ఆకుకూరలు చేర్చుకోవచ్చు. వీటిలో విటమిన్ ఏ, సి, కె పుష్కలంగా ఉన్నాయి. వాపు, నొప్పులని తగ్గిస్తాయి. ఇందులోని సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఉంది. కీళ్ల నొప్పులు, వాపుకు కారణమయ్యే స్ ఎంజైమ్ లు నిరోధిస్తుంది. క్యారెట్, బీట్ రూట్, గుమ్మడి కాయ వంటి రూట్ వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. మోకాలు, వెన్ను నొప్పిని తగ్గిస్తాయి.
తాజా పండ్లు
యాపిల్స్, పైనాపిల్, బెర్రీలు, చెర్రీస్, ద్రాక్ష, సిట్రస్ పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. నొప్పులని తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.