Kappa Biryani: ఈ బిర్యానీ చాలా స్పెషల్, రైస్ అవసరం లేదు, జీవితంలో ఒక్కసారైన రుచి చూడాల్సిందే
బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒకటి కప్పా బిర్యాని.
కప్పా బిర్యానీ అనగానే కప్పలతో చేస్తారేమో అని చీదరించుకుంటున్నారా? కప్పా అంటే కర్రపెండలం అని అర్థం. కేరళ వారి సాంప్రదాయక వంటకం ఇది. ఇప్పటికీ దీన్ని వారి వేడుకల్లో వండి వడ్డిస్తుంటారు. ఈ బిర్యానీ ప్రత్యేకతేంటో తెలుసా? దీన్ని వండేందుకు బియ్యం అవసరం లేదు. తింటుంటే అన్నం మెతుకు తగలదు. కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. ఈ బిర్యానీ తినడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు శరీరంలో చేరుతాయి.
బిర్యానీ అంటేనే మాంసం, అన్నం కలిసిన మిశ్రమ పదార్థం. బిర్యానీ రైస్ ఘుమఘుమలు వీధి చివరకు వచ్చేస్తాయి. అలాంటిది అన్నం లేకుండా బిర్యానీ ఎలా? అనుకుంటున్నారా... అదే కదా కప్పా బిర్యానీ స్పెషాలిటీ. కేరళ వారు దీన్ని ‘ఎల్లుమ్ కప్పయుమ్’ అని కూడా పిలుస్తారు. ఆ రాష్ట్రంలో బీచ్ దగ్గర, రద్దీగా ఉండే రోడ్డులకిరుపక్కన దీన్ని అమ్ముతూనే ఉంటారు. ఈ బిర్యానీని ‘తట్టుక దాస్’ అని కూడా పిలుస్తారు. ఇది కేరళలో సామాన్యుల ఆహారం. వంటకం రుచి మాత్రం నోరూరించేస్తుంది.
ఎలా వండుతారు?
కప్పా బిర్యానీలో కర్రపెండలం, చికెన్, మటన్ ను ఉపయోగిస్తారు. కొంతమంది బీఫ్‌ను కూడా కలిపి వండుకుంటారు. కర్రపెండలాన్ని మెత్తగా ఉడికించి మసాలా దట్టించిన మాంసం ముక్కలతో కలిపి వండుతారు. స్పైసీగా ఈ వంటకం అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలోనే దొరుకుతుంది. దీన్ని చాలా తక్కువ పదార్థాలతోనే తయారుచేసేయచ్చు. పెద్దగా కష్టపడక్కర్లేదు, సింపుల్ గా వండేయచ్చు. అందుకే ఇది కేరళలలో పాపులర్ అయిపోయింది.
ఆరోగ్యం కూడా..
ఈ బిర్యానీ తినడం శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కర్రపెండలంలో చాలా సుగుణాలు ఉన్నాయి. అవి శరీరానికి మేలు చేస్తాయి. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి. శరీరం మొత్తం రక్తం, ఆక్సిజన్ సక్రమంగా సరఫరా అయ్యేలా చేస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక మాంసంలో ఉండే సుగుణాలు అందరికీ తెలిసిందే. ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.
మధుమేహులు...
కాకపోతే మధుమేహం ఉన్నవారు మాత్రం కప్పా బిర్యానీని పక్కన పెట్టాల్సిందే. కర్రపెండలం గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగేస్తాయి. అందుకే తిన్నా కూడా చాలా తక్కువ మొత్తంలో తినాలి. లేకుంటే డయాబెటిస్ ముదిరిపోతుంది.
దీని తయారీకి కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, వెనిగర్, ఉప్పు, కొబ్బరి నూనె, కరివేపాకులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గరం మసాలా, మిరియాల పొడి వాడతారు. ఈ బిరియానీ మనకు కర్రీలా అనిపిస్తుంది. కానీ కేరళ వారికి మాత్రం అది బిర్యానీనే. కేరళ వెళ్తే కచ్చితంగా ఈ బిర్యానీని టేస్టు చేయండి. వండే విధానం తెలుసుకుని రండి. మీకు ఈ వంటకం కచ్చితంగా నచ్చి తీరుతుంది.
Also read: ఉదయం నిద్ర నుంచి లేచాక కూడా అలసటగా అనిపిస్తోందా? అయితే ఇవే కారణాలు
Also read: చిన్నికృష్ణయ్యకు తియ్యటి నైవేద్యాలు, వీటిని పావుగంటలో చేసేయచ్చు