Salt: ఉప్పు తగ్గించండి, కానీ పూర్తిగా తినడం మానేయకండి - మానేస్తే ఈ సమస్యలు తప్పవు
ఉప్పు అధికంగా తినడం వల్లే కాదు, పూర్తిగా మానేసినా కూడా సమస్యే.
ఉప్పు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే ఉప్పును తక్కువగా తీసుకోమని చెబుతారు, అయితే కొంతమంది ఉప్పుతో ఉపయోగం ఏముంది? అని పూర్తిగా మానేస్తారు కూడా. అలా మానేయడం ఇంకా ప్రమాదకరం. చప్పని కూరలు తినడం ఎంత కష్టంగా ఉన్నా... ఉప్పుతో వచ్చే ప్రమాదాలను అంచనా వేసి పూర్తిగా మానేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఉప్పుని అధికంగా తింటే ఎంత ప్రమాదమో, పూర్తిగా తినడం మానేసినా అంతే ప్రమాదం. కాబట్టి ఉప్పును మితంగా, ఖచ్చితంగా తినాల్సిందే. ఉప్పును తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. ఇది మన శరీరంలో కండరాల కదలికలకు, నాడుల్లో సమాచారం అందించడానికి, హృదయ స్పందనలకు, జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. ఉప్పులో 39% సోడియం ఉంటే, 61% క్లోరిన్ ఉంటుంది. మన శరీర బరువులో 0.5% ఉప్పు ఉంటుంది.
ఉప్పును తిన్నాక అది శరీరంలో చేరి సోడియం, క్లోరైడ్ అయాన్లుగా విడిపోతాయి. సోడియం కణాలు శరీరంలోని ద్రవాలను బయటికి పోకుండా లోపలే ఉంచుతాయి. దీంతో నాడులు, కండరాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఉప్పును తినడం మానేస్తారో శరీరంలో సోడియం శాతం పడిపోతుంది. అప్పుడు కణాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ద్రవాలు బయటికి పోయి, శరీర సమతుల్యం తప్పుతుంది. దీనివల్ల కణాలలో నీరు నిండిపోతుంది. కణాలలో వాపు వస్తుంది. దీనివల్ల శరీరం ఉబ్బినట్టు అవుతుంది. కణాలు పగిలి ద్రవాలు బయటకు పోతాయి. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం. కనుక ఉప్పును కచ్చితంగా తినాలి. ఉప్పు తినడం మానేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే.
మన శరీరానికి ఉప్పు తగినంత అందాల్సిందే. ఉప్పు అధికంగా చేరినా ప్రమాదమే, తక్కువగా చేరినా ప్రమాదమే. ఉప్పు తగ్గితే కింద పడిపోవడం, తల తిరగడం వంటివి వస్తాయి. కొన్నిసార్లు షాక్, కోమా వంటివి కూడా కలుగుతాయి. పూర్తిగా ఉప్పు శరీరంలో నశిస్తే మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఉప్పును తినాలని చెబుతున్నారు వైద్యులు. కాకపోతే ఎక్కువగా తినకుండా మితంగా ఉప్పును తీసుకోవాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మన శరీరానికి రోజుకు ఎంత ఉప్పు అవసరమో ఏనాడో చెప్పింది. ప్రతి వ్యక్తికి రోజుకు రెండు గ్రాములు సోడియం అవసరం పడుతుంది. రెండు గ్రాముల సోడియం కావాలంటే ఐదు గ్రాములు తినాలి. అంటే ఒక టీ స్పూన్ వరకు ఉప్పును తినవచ్చు. అంతకుమించి తినేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఒక స్పూను తగ్గకుండా తినండి. అంటే నేరుగా తినమని కాదు వంటల్లో చల్లుకొని తినవచ్చు.
Also read: మెదడులో కణితులు త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం సులభమే, లక్షణాలు ఇవిగో
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.