(Source: Poll of Polls)
World Brain Tumor Day 2023: మెదడులో కణితులు త్వరగా గుర్తిస్తే చికిత్స చేయడం సులభమే, లక్షణాలు ఇవిగో
బ్రెయిన్ ట్యూమర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాల్సిన అవసరం ఉంది.
బ్రెయిన్ ట్యూమర్ ప్రాణాంతక పరిస్థితి, అయితే కణితులను ప్రాథమిక దశలో ఉండగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. మెదడు కణితులు లేదా బ్రెయిన్ ట్యూమర్ అనేవి మెదడు, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో అభివృద్ధి చెందే అసాధారణ పెరుగుదలలు. వీటిలో కొన్ని సాధారణమైనవి ఉంటాయి. మరికొన్ని ప్రాణాంతకమైనవి ఉంటాయి. ప్రాణాంతకమైనవి క్యాన్సర్లుగా మారే అవకాశం ఎక్కువ. అందుకే బ్రెయిన్ ట్యూమర్ల విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది జూన్ 8న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే నిర్వహిస్తారు.
దేశంలో ప్రతి ఏడాది దాదాపు 40 వేల కొత్త బ్రెయిన్ ట్యూమర్ కేసులు నిర్ధారణ అవుతున్నట్టు అంచనా. వీటిలో చాలా వరకు ప్రాణాంతకంగా మారాకే బయటపడుతున్నాయి. ప్రాథమిక దశలో కనిపించే లక్షణాలపై అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది పరిస్థితి ముదిరాక వైద్యులను ఆశ్రయిస్తున్నారు. అందుకే వైద్యులు కూడా వీటిని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. అవి పెరిగే స్థానం, పరిమాణం, రకాన్ని బట్టి లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. కణితలు చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఎలాంటి లక్షణాలు చూపించవు. బ్రెయిన్ ఇమేజింగ్ చేసినప్పుడు మాత్రమే అవి బయటపడే అవకాశం ఉంది. కొన్ని లక్షణాల ద్వారా దీన్ని గుర్తించవచ్చు.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు... ముఖ్యంగా ఎలా ఉంటాయంటే రాత్రిపూట నిద్రపోయాక తలనొప్పి రావడం లేదా తీవ్ర ఆలోచనలు కలగడం, ఏదైనా మాట్లాడడంలో ఇబ్బంది కలగడం, విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలగడం, మూర్చలు రావడం వంటివి జరుగుతాయి. అలాగే వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. శరీరంలో ఒక వైపు లేదా ఒక భాగం బలహీనంగా మారడం, పక్షవాతం బారిన పడడం జరుగుతాయి. మైకం కమ్మినట్టు అనిపిస్తుంది. కంటిచూపు సమస్యలు వస్తాయి. వినికిడి సమస్యలు వస్తాయి. ముఖం తిమ్మిరి పట్టినట్టు అవుతుంది. వికారం, వాంతులు వంటివి కలుగుతాయి. గందరగోళంగా అనిపిస్తుంది. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రాథమికంగా కణితులు పెరుగుతున్నాయని చెప్పే సంకేతాలు.
మెదడులో పెరిగే కణితుల్లో అన్నీ కూడా క్యాన్సర్లు కావు. వాటిలో మూడింట ఒక వంతు మాత్రమే క్యాన్సర్ గా మారే అవకాశం ఉంది. అవి క్యాన్సర్ అయినా, కాకపోయినా మెదడులో కణితులు ఉండడం మాత్రం ప్రమాదకరం. అవి తమ చుట్టుపక్కల ఉన్న నరాలు, రక్తనాళాలు, కణజాలాలపై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల అవి చిట్లిపోయే అవకాశం ఉంది. మెదడు పనితీరు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మెదడులో కణితులు ఉంటే చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం.
వీటిని మెదడులో పెరగకుండా నివారించలేము. చికిత్స ద్వారా వాటి పెరుగుదలను అడ్డుకోగలమని చెబుతున్నారు వైద్యులు. తలకు గాయాలు తగలడం వల్ల కూడా మెదడులో కణితులు వచ్చే అవకాశం ఉంది. కణితుల పరిమాణం, పరిస్థితిని అంచనా వేసి అప్పుడు దానికి తగ్గ చికిత్సను ఎంపిక చేస్తారు వైద్యులు.
Also read: ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినడం తగ్గించాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.