Summer Diseases: వేసవిలో వచ్చే ఆరోగ్యసమస్యలు ఇవే, ముందు జాగ్రత్త తప్పదు
సీజన్ మారిందంటే చాలు కొన్ని రకాల వ్యాధులు పొంచి ఉంటాయి.
మార్చి నుంచే వేసవి తాపం మొదలైపోయింది. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోవడం ఖాయం. ఎండాకాలంలో పెద్దగా వ్యాధులేవీ రావు అనుకుంటారు చాలా మంది. కానీ కేవలం వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. అందరికీ రావాలని లేదు కానీ, అధిక శాతం మంది ఈ ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వేసవిలో వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుంటే, వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం. ఆ ఆరోగ్య సమస్యల జాబితా ఇదిగో...
ఫుడ్ పాయిజనింగ్
వేసవిలో ఎక్కువ శాతం మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతుంటారు. దానికి కారణం వాతావరణంలో వేడి పెరగడం వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. నిల్వ ఉండదు. ఆ విషయం తెలియని చాలా మంది నిల్వ ఉన్న ఆహారాన్ని తిని ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతుంటారు. అందుకే వేసవిలో నిల్వ ఆహారాన్ని తినేముందు ఓసారి పాడైందో లేదో చెక్ చేసుకుని తినండి. కాస్త వాసన వచ్చినా దాన్ని తినకపోవడమే మంచిది.
డయేరియా
ఎండవేడి చాలా మంది తట్టుకోలేరు. అలాంటివారు డయేరియా, అతిసారం బారిన పడుతుంటారు. పాడైన ఆహారం తినడం వల్ల, మద్యపానం వల్ల కూడా డయేరియా వస్తుంది. దీని బారిన పడకుండా ఉండాలంటే వేసవి అంతా నీళ్లు అధికంగా తాగాలి. ఎర్రటి ఎండలో బయట తిరగడం మానేయాలి.
చికెన్ పాక్స్
తెలుగిళ్లల్లో దీన్ని అమ్మోరు అని పిలుచుకుంటారు. పిల్లలపై అధికంగా దాడి చేస్తుంది. వేసవిలో వ్యాధుల్లో ఇది ఒకటి. చిన్న దద్దుర్లులా వచ్చి మంట పెడతాయి. ఇది అంటువ్యాధి కూడా. జ్వరం కూడా అధికంగా వస్తుంది.
మీజిల్స్
దీన్నే తట్టు వ్యాధి అంటారు. ఇది వేసవిలోనే రెచ్చిపోతుంది. ఎందుకంటే ఈ వ్యాధికి కారణమైన పారామిక్సోవైరస్ వేసవిలోనే సంతానాన్ని పెంచుకుంటుంది. అందుకే వేసవిలో తట్టు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధిలో దద్దుర్లు వస్తాయి. జ్వరం, గొంతునొప్పి, కళ్లు ఎర్రబడడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
వడదెబ్బ
ఇది ఎవరికైనా రావచ్చు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే సమస్య.
శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఇది వస్తుంది. అందుకే వేసవి ఎర్రటి ఎండల్లో బయట తిరగకూడదు. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే పొట్ట నిండా కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మ రసం వంటివి తాగేసి వెళ్లాలి. లేకుంటే సులువుగా వడదెబ్బ బారిన పడతారు.
గవద బిళ్లలు
ఈ ఆరోగ్య సమస్య పిల్లల్లో అధికంగా కనిపిస్తుంది. లాలాజల గ్రంధులు వాచిపోవడం, జ్వరం, ఆకలి లేకపోవడం, బలహీనంగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది అంటు వ్యాధి కూడా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు పక్కవారికి సోకుతుంది.
వేసవిలో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. ఇందుకోసం నిత్యం నీళ్లు తాగడం, నిమ్మరసంలో కాస్త ఉప్పు, పంచదార కలిపి తాగడం, కొబ్బరి నీళ్లు తాగడం చేయాలి. శరీరానికి అధికంగా చెమటపడితే పొటాషియం, సోడియం, ఫాస్పరస్, క్లోరైడ్ వంటి అత్యవసర లవణాలు బయటికి పోతాయి. దీనివల్లే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. కాబట్టి దాని బారిన పడకుండా ఉండాలంటే వేసవిలో ద్రవాహారాన్ని అధికంగా తీసుకోవాలి. పుచ్చకాయ రోజూ కనీసం నాలుగైదు ముక్కలు తినాలి.
Also read: ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోందో చెప్పండి, మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో తెలిసిపోతుంది