Pink Eye: పెరిగిపోతున్న కండ్లకలక ఇన్ఫెక్షన్ - ఈ జాగ్రత్తలు తీసుకోండి
వర్షాకాలంతో పాటు కండ్లకలక కూడా తోడుగా వస్తుంది.
మన దేశంలో కండ్లకలక కేసులు అధికంగా పెరుగుతున్నాయి. పూణేలో ఒక్కరోజులోనే 2,300 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో గత ఏడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఎడతెగని వర్షాలు, తేమతో కూడిన వాతావరణం, కలుషిత నీరు... ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ వ్యాప్తి చెందేందుకు అనువైన పరిస్థితులను కల్పించాయి. వీటి వల్లే కంటి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. కంటి కలకను... ఐ ఫ్లూ లేదా పింక్ ఐ అని పిలుస్తారు. ఈ సమస్య వస్తే కళ్ళు ఎరుపుగా మారిపోతాయి. దురద కూడా పెడతాయి. తెల్లని పదార్థాన్ని స్రవిస్తాయి. కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. కంటి రెప్పలు ఉబ్బిపోయే అవకాశం ఉంది. ఇది ఒక కంటికి వచ్చి రెండో కంటికి కూడా సోకవచ్చు.
కళ్ళు వాచినట్టు అవుతాయి. అధిక తేమ వల్ల కూడా కండ్లకలక వచ్చే అవకాశం ఉంది. ఇది రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడుక్కుంటూ ఉండాలి. కళ్ళను తరచూ తాకకూడదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతి రుమాళ్లను ఇతరులతో పంచుకోకూడదు. కండ్ల కలక అనేది ఒక కంటి ఇన్ఫెక్షన్. ఇది కళ్ళ వాపుకు కారణం అవుతుంది. వర్షాకాలంలో అనేక కారణాల వల్ల కండ్లకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. వర్షాకాలంలో పారిశుద్ధ్యం సరిగా ఉండదు. దీనివల్ల నీటి వనరులు కలుషితం అవుతాయి. ఆ కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా ఉండొచ్చు. ఆ నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కంటిలోకి హానికరమైన సూక్ష్మజీవులు చేరి కండ్లల కలక వంటి ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. అలాగే వానాకాలంలో గాలిలో ఫంగస్, ఇతర అలర్జీ కారకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళను తాకినప్పుడు కండ్ల కలక వస్తుంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. ఆ తేమలో వైరస్‌లు, బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి. ఈ పెరిగిన తేమ కంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
కండ్లకలక బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే సబ్బుతో చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవాలి. మీ చేతులతో కళ్ళను పదేపదే తాకకూడదు. కళ్ళను రుద్దడం వంటివి చేయకూడదు. దుమ్ము, ధూళి కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. వానాకాలంలో బయటికి వెళ్తున్నట్లయితే కంటికి గ్లాసెస్ పెట్టుకోవడం ముఖ్యం. నివాస స్థలం కూడా శుభ్రంగా దుమ్ము దూళీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. పరుపులు, కార్పెట్లు అనేవి తరుచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
Also read: ఇలాంటి కారణం వల్ల కూడా కవలలు జన్మిస్తారా? సెలీనా జైట్లీ విషయంలో ఇదే జరిగింది
Also read: పాలు రోజూ పొంగిపోతున్నాయా? ఈ ట్రిక్స్ పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.