Anxiety: ఇలాంటి కలలు వస్తున్నాయంటే అర్థం మీకు అలాంటి మానసిక సమస్య ఉన్నట్టే
మానసిక సమస్యల్లో యాంగ్జయిటీ ఒకటి. ఇది ఎక్కువమందిలో కనిపిస్తోంది.
విపరీతమైన ఒత్తిడి, బాధ, భావోద్వేగాలు దీర్ఘకాలం పాటూ కొనసాగితే యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీస్తాయి. ఈ మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. వాటి వల్ల గుండె, బీపీ, కిడ్నీ సమస్యలు, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి లక్షణాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ప్రాథమిక దశలోనే జాగ్రత్తలు పాటించాలి. యూనివర్సిటీ ఆప్ డ్యూసెల్టార్ఫ్ కు చెందిన వైద్యులు చెప్పిన ప్రకారం యాంగ్జయిటీతో బాధపడుతున్న వ్యక్తులకు భిన్నమైన కలలు వస్తుంటాయి. వాటిని బట్టి కూడా మానసిక స్థితిని అంచనా వేయచ్చు.
ఎలాంటి కలలు?
యాంగ్జయిటీ బారిన పడిన వారిలో భావోద్వేగాల తీవ్రత అధికంగా ఉంటుంది. మాజీ ప్రేమికులను తలచుకుని ఊహల్లో తేలుతుంటారు. కలల్లో కూడా వారు వస్తుంటారు. చాలా వేగంగా ప్రతి ఊహించుకుంటారు. అలాగే కలలో భయంతో స్తంభించిపోయినట్టు కనిపించినా, ఏవైనా ప్రమాదాలు జరిగినట్టు వచ్చినా, విమానం కూలిపోవడం, ఏదైనా వెనుక తరుముతున్నట్టు, దాన్నుంచి తప్పించుకోవడానికి పరుగెడుగుతన్నట్టు కలలు వచ్చినా, తమపై దాడి జరుగుతున్నట్టు కనిపించినా కూడా వారిలో యాంగ్జయిటీ లక్షణాలు ఉన్నాయేమో అని చెక్ చేయించుకోవాలి.
యాంగ్జయిటీ లక్షణాలు
ఊపిరి సరిగా అందకపోవడం, గుండె కొట్టుకున వేగం పెరగడం, వికారంగా అనిపించడం, ఆందోళన పెరగడం, నోరు పొడిబారిపోవడం, ఆందోళన, చిరాకు, సూదులతో గుచ్చుతున్నట్టు నొప్పి రావడం వంటివి యాంగ్జయిటీ లక్షణాలు. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటే చాలా భయంకరంగా ఉంటాయి. నిద్రపోవడం కష్టమవుతుంది. రోజువారీ పనులు చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. కొంతమంది పొట్టలో ఇబ్బంది మొదలై నొప్పి పెడుతుంది. కనీసం భోజనం కూడా తినలేరు. శరీరం మొత్తం నీరసంగా మారిపోతుంది. వీరిలో తీవ్ర భావోద్వేగాలు కలుగుతాయి.
అన్ని లక్షణాలు ఒకేసారి కనిపించాలని లేదు. కొందరిలో రెండు మూడు లక్షణాలే తీవ్రంగా కనిపిస్తాయి. మరికొందరిలో అన్ని లక్షణాలు కనిపిస్తాయి. అది ఆ వ్యక్తి మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. వీటికి మందులు వాడాల్సి రావచ్చు. ఆరు వారాలకు తగ్గకుండా మందులు వాడాలి. ఒక్కోసారి నెలల తరబడి కూడా వాడాల్సి రావచ్చు. నిద్ర పట్టని వారికి నిద్రని తెచ్చే ట్యాబ్లెట్లు కూడా సూచిస్తారు.
Also read: ప్రాణాన్ని నిలబెట్టే ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, వీటితో మరిన్ని ఉపయోగాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.