(Source: ECI/ABP News/ABP Majha)
kothimeera recipe: స్పైసీగా కొత్తిమీర పచ్చడి, వేడి వేడి అన్నంతో తింటే అదిరిపోతుంది
కొత్తిమీర బిర్యానీలకు, కూరలకు అదనపు రుచిని ఇచ్చేందుకే కాదు పచ్చడిగా కూడా టేస్టీగా ఉంటుంది.
అన్నంతో పాటూ బీరకాయ, సొరకాయ, టమాటా చట్నీలే తిని బోరు కొట్టిందా? ఒకసారి ఈ కొత్తిమీర చట్నీ కూడా తిని చూడండి. రుచి చాలా బావుంటుంది. అందులోనూ కాస్త పచ్చిమిర్చి ఎక్కువేసి స్పైసీగా చేసుకుంటే నోరూరిపోవడం ఖాయం. చేయడం కూడా చాలా సులువు. పదినిమిషాల్లో రెడీ అయిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
కొత్తమీర తరుగు - ఒక కప్పు (రెండ కట్టలు)
పచ్చిమిర్చి - అయిదు
కరివేపాకు - గుప్పెడు
ఎండు మిర్చి - రెండు
జీలకర్ర - అర టీస్పూను
చింతపండు - చిన్న ఉండ
శెనగపప్పు - ఒక టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
ఆవాలు - ఒక స్పూను
మినపప్పు - ఒక టీ స్పూను
తయారీ ఇలా
1. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఎండు మిర్చి, శెనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు అదే కళాయిలో కొత్తి మీర, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
3. మిక్సీలో జార్లో ఎండు మిర్చి, శెనగపప్పు, మినపప్పు, కొత్తిమీర, పచ్చి మిర్చి వేసి చిన్న చింతపండు, ఉప్పు కూడా గ్రైండ్ చేయాలి. కాస్త నీళ్లు పోసుకుంటే చట్నీలా మెత్తగా గ్రైండ్ అవుతుంది.
4. మిక్సీ జార్లోంచి ఓ గిన్నెలో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి చట్నీలో కలపాలి.
6. అంతే టేస్టీ కొత్తిమీర చట్నీ రెడీ అయినట్టే.
దీన్ని ఇడ్లీ, వడ, దోశెలతో తిన్నా బావుంటుంది. లేదా అన్నంతో కలిపి తిన్నా కూడా రుచి అదిరిపోతుంది.
కొత్తీమీర తింటే ఏమవుతుందంటే...
1. బీపీ ఉన్నవారికి రోజూ కొత్తిమీర తినడం వల్ల చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అలా రాకుండా ఉండాలంటే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే కొత్తిమీరను అధికంగా తినాలి.
2. గుండెకు కొత్తిమీరలోని గుణాలు ఎంతో మేలు చేస్తాయి. హైబీపీని కంట్రోల్ ఉంచడం వల్ల గుండెకు హాని కలగదు. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో సోడియం నిల్వలు లేకుండా బయటికి పంపేస్తుంది.
3. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. పొట్టలో మంట, నొప్పి లాంటివి రాకుండా ఇవి రక్షిస్తాయి.
4. క్యాన్సర్ కణాలను పెరగకుండా కొత్తిమీర అడ్డుకుంటుంది. కాబట్టి కొత్తిమీరను ఏదో రకంగా రోజూ తినేలా చూసుకోవాలి.
5. కొత్తిమీరలో వైరస్‌లు, బ్యాక్టిరియాలతో పోరాడే శక్తి ఉంటుంది. ఇందులో డోడెసెనాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా అని పిలిచే బ్యాక్టిరియాను ఇది చంపేస్తుంది.
6. చర్మ సౌందర్యానికి కొత్తిమీరలోని సుగాణాలు ఎంతో సహకరిస్తాయి. దద్దుర్లు, మచ్చలు, గాయాల్లాంటివి త్వరగా మానపోయేలా చేస్తాయి.
Also read: ఆడవాళ్లలో రుతుక్రమానికి సంబంధించి ఇవన్నీ అపోహలే, నిజాలేంటో తెలుసుకోండి
Also read: టీనేజర్లలో తగ్గిన జంక్ ఫుడ్ అలవాటు, కరోనా మహమ్మారి చేసిన ఏకైక సాయం ఇదేనేమో