Junk Food:టీనేజర్లలో తగ్గిన జంక్ ఫుడ్ అలవాటు, కరోనా మహమ్మారి చేసిన ఏకైక సాయం ఇదేనేమో
కరోనా వచ్చాక జీవితమే మారిపోయింది. ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది.
సామాజిక ఆంక్షలు, ఉద్యోగం ఆఫీసు నుంచి ఇంటికి మారడం, పాఠశాలల మూసివేత... కరోనా వల్ల జీవితంలో వచ్చిన పెను మార్పులు ఇవి. ఇంటి నుంచే రెండున్నరేళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. ఇక స్కూళ్లు కూడా దాదాపు ఏడాదిన్నర పాటూ మూసేశారు. పక్కింటిక్కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది కరోనా కారణంగా. ఎంతో మందికి ఎన్నో ఆరోగ్యసమస్యలు తెచ్చిపెట్టింది. లక్షల మంది ప్రాణాలు తీసింది. కరోనా వైరస్ ఆవిర్భవించాక జరిగిందంతా వినాశనమే. అయితే ఓ విషయంలో మాత్రం అది మేలు చేసింది. అదేంటంటే జంక్ ఫుడ్ బాగా అలవాటైన టీనేజర్లలో మార్పు తెచ్చిందట. కరోనా వచ్చాక జంక్ ఫుడ్ తినే టీనేజర్ల సంఖ్య తగ్గినట్టు ఒక అధ్యయనం తేల్చింది. కరోనా ఈ రెండున్నరేళ్లలో చేసిన సాయం ఇదొక్కటేనేమో.
అంతకుముందు...
చిప్స్, సోడా కలిపిన పానీయాలు, క్యాండీలే... ఇలా అనేక రకాల జంక్ ఫుడ్ విపరీతంగా తినేవారు. ముఖ్యంగా టీనేజర్లే వీటిపై ఆధారపడే వారు.లంచ్, డిన్నర్ వంటి ముఖ్య భోజన సమయాల్లో కూడా ఈ జంక్ ఫుడ్ మీదే ఆధారపడేవారు.అయిలే కోవిడ్ 19 మహమ్మారి వచ్చాక మాత్రం ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినయోగం తగ్గినట్టు రికార్డయ్యింది. వారు కరోనా ఆంక్షల వల్ల ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండడంతో ఇంటి ఆహారానికి అలవాటు పడ్డారని, దీంతో జంక్ ఫుడ్ తినడం తగ్గించినట్టు గుర్తించారు.
ఇప్పుడు కరోనా మహమ్మారి తగ్గి పరిస్థితులు సాధారణంగా మారాయి. అయినా ఇంకా జంక్ ఫుడ్ వినియోగంలో క్షీణత కొనసాగుతున్నట్టు కనుగొన్నారు. ఆంక్షలు సడలించినప్పటికీ టీనేజర్లు జంక్ ఫుడ్ ఎక్కువగా తినేందుకు ఇష్టపడకపోవడం ఆహ్వానించదగ్గర పరిణామం అని అభిప్రాయపడుతున్నారు అధ్యయనం పరిశోధకురాలు మరియా బల్హరా. ఈమె ఫ్లోరిడాలో ప్రధాన పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు.
ఎనర్జీ డ్రింక్స్, బంగాళాదుంప చిప్స్, షుగర్ వేసిన సోడాలు, స్వీట్లు వంటివి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కిందకి వస్తాయి. ప్రపంచంలో పెరుగుతున్న ఊబకాయానికి ఇవే ప్రధాన కారణాలు. టీనేజర్లు వీటిని అధికంగా తినడం వల్ల వారు పెద్దయ్యే సరికి అధిక బరువు బారిన పడుతున్నారు.
ఈ అధ్యయనంలో భాగంగా దాదాపు 452 మందిపై పరిశోధన చేశారు. వారి వయసు 13 నుంచి 19 ఏళ్లలోపు ఉంది. కరోనా పరిమితులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీరి జంక్ ఫుడ్ వినియోగం 6 శాతం పడిపోయింది.ఇది ఇలాగే కొనసాగితే భావి పౌరులు ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధ్యయనకర్తలు.
Also read: ఈ గింజలను ఏమంటారో తెలుసా? వీటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి
Also read: బ్లడ్ క్యాన్సర్ బాధితులకు శుభవార్త, అత్యాధునిక చికిత్స ఇక మనదేశంలోనే