Rosary pea: ఈ గింజలను ఏమంటారో తెలుసా? వీటి వల్ల చాలా ఉపయోగాలున్నాయి
ఈ గింజలను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ గుర్తు రావడం లేదా?
కింద నలుపు, పైన ఎరుపు లేదా కింద నలుపు పైన తెలుపు ఇలా ఉంటాయి ఈ గింజలు. కింద నలుపు అనగానే మీకు వీటి పేరు గుర్తొచ్చేసి ఉండాలి. తెలుగు ప్రజల మాటల్లో తరచూ దీని పేరు దొర్లుతూ ఉంటుంది. పక్క వారి తప్పులను ఎత్తి చూసే వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు అధికంగా ఈ గింజల పేరు వాడతారు. అదేనండి ‘గురివింద గింజలు’. ఇవి నలుపు, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తాయి. పైన ఎన్ని రంగులున్న కింద వైపు మాత్రం నలుపే ఉండడం దీని ప్రత్యేకత.ఆ రంగు వల్లే ‘గురివింద గింజ తన కింద ఉన్న నలుపు ఎరుగదని’ అనే వాక్యం వాడుకలోకి వచ్చింది.
ఒకప్పుడు వీటిని బంగారం కొలిచేందుకు ఉపయోగించేవారు. అలాగే లక్ష్మిదేవి స్వరూపంగానూ భావించేవారు. ఇప్పుడు ఆ నమ్మకాలేవీ ప్రచారంలో లేవు. గురివింద మొక్కలు కూడా కనిపించడం చాలా తక్కువైపోయింది. అందుకే వీటిని ఈ తరం వారు గుర్తించడం కష్టమే. గురివిందను చెడుకు ప్రతిరూపంగా భావించడం అలవాటైంది కానీ దానిలో ఎన్నో మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద నిపుణులు దీన్ని కొన్ని మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు.
గురివిందతో ఏం చేస్తారు?
ఆయుర్వేదం గత వందల ఏళ్లుగా ఈ గింజలను వాడడం కొనసాగిస్తున్నారు. పేరుకొరుకుడు సమస్యకు, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు,తెల్ల మచ్చలు పోయేందుకు వీటితో తయారు చేసిన మందులను వాడతారు. గింజలపై ఉన్న పొట్టును తీసి లోపలి పదార్థాన్ని పొడిలా చేసి నువ్వుల నూనె కలుపుతారు. ఆ నూనెను తలకు రాయడం వల్ల పేరుకొరుకుడు సమస్య తగ్గుతుంది. జుట్ట రాలడం కూడా తగ్గుతుంది. కొత్త వెంట్రుకలు కూడా మొలుస్తాయి. నువ్వుల నూనెలో ఆకుల పేస్టును కలిపి డబ్బాలో వేసి దాచుకోవచ్చు. అప్పుడప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు ధూపం వేసేటప్పుడు ఈ గింజల పొడిని వేస్తే దోమల సమస్య పోతుంది.
కొందరికి శరీరంలో తెల్లని మచ్చలు వస్తాయి. అలాంటివారు గురివింద ఆకుల రసాన్ని తీసి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆకులను మెత్తని పేస్టులా చేసి రసాన్ని పిండి చెవిలో రెండు చుక్కలు వేసుకుంటే చెవి నొప్పి తగ్గుతుంది. బంతి ఆకుల్లాగే వీటి ఆకుల రసం కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
Also read: బ్లడ్ క్యాన్సర్ బాధితులకు శుభవార్త, అత్యాధునిక చికిత్స ఇక మనదేశంలోనే