Rebies Treatment : రేబిస్ మరణాలకు ఇక చెక్.. చికిత్సపై ఆశలు పెంచుతోన్న కొత్త అధ్యయం
Rabies Cure : రేబీస్ చికిత్సలో విజయాన్ని చూశారు ఎయిమ్స్ నిపుణులు. అసలు ఈ కొత్త చికిత్సపై చేసిన అధ్యయనం ఏంటి? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

New Study on Rebies : రేబిస్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది సోకిన జంతువు కరవడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ సమస్యకు సకాలంలో చికిత్స అందించకపోతే మరణం దాదాపు ఖాయం. దీని గురించి ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తూ.. ఇబ్బందిని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దీని చికిత్సకు మాత్రం యాంటీబాడీలు బయటనుంచి ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వైద్యులు శరీరం తనంతటా తానే స్వయంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేసే మార్గాన్ని కనుగొన్నారు. దీనివల్ల చికిత్స సులభతరం కావడమే కాకుండా.. పేద, మారుమూల ప్రాంతాల్లోని రోగుల ప్రాణాలను రక్షించే అవకాశాన్ని మరింత పెంచుతుంది.
రేబిస్‌తో చనిపోతున్నవారు ఎందరో..
రేబిస్ అనేది వైరల్ వ్యాధి. ఇది రేబిస్ సోకిన కుక్క, పిల్లి, కోతి లేదా ఇతర జంతువులు కరవడం లేదా గీయడం ద్వారా వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 59 వేల మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా, ఆఫ్రికాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. భారతదేశంలో కూడా ఈ వ్యాధి ఒక పెద్ద ఆరోగ్య సవాలుగా మారింది. అయితే చికిత్స కోసం ఇప్పటివరకు బాహ్యంగా యాంటీబాడీలు ఇంజెక్షన్ల రూపంలో ఇస్తున్నారు. ఇవి చాలా ఖరీదైనవి. పరిమితంగా లభిస్తాయి. దీంతో ఎందరికో ఈ చికిత్స దూరమవుతుంది.
విప్లవాత్మక ఆవిష్కరణ
ఎయిమ్స్ గోరఖ్‌పూర్ ఫార్మకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ హీరా భల్లా.. దేశంలోని పలువురు ప్రముఖ నిపుణులతో కలిసి ఒక ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో రోగి శరీరంలోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు. అంటే ఇకపై బయటి నుంచి యాంటీబాడీ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సాంకేతికత రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తుంది. ఇది రేబిస్ వైరస్‌కు తక్షణమే స్పందిస్తుంది. ఇన్ఫెక్షన్ వ్యాప్తిని వెంటనే నిరోధిస్తుంది.
గుర్రపు రక్తం అవసరం లేదు
ఇప్పటివరకు రేబిస్ తీవ్రమైన కేసుల్లో "రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్" (RIG) ఇచ్చేవారు. దీనిని ఎక్కువగా గుర్రపు రక్తం నుంచి తయారు చేశారు. అందుకే దీని తయారీ ఖరీదైనది. లభ్యత కూడా పరిమితంగానే ఉంటుంది. కొత్త సాంకేతికత రావడంతో.. ఈ ప్రక్రియ అవసరం తొలగిపోతుంది. ఇది చికిత్స ఖర్చును కూడా తగ్గిస్తుంది. గ్రామీణ, పేద రోగులకు అందుబాటులో ఉండగలిగే సౌలభ్యం ఉంది.
చికిత్సకు కొత్త ఆశ
ఈ సాంకేతికత విస్తృతంగా విజయవంతమైతే.. రేబిస్ చికిత్సలో ఇది ఒక చారిత్రాత్మక మలుపు అవుతుంది. రోగి ప్రాణాలను రక్షించే అవకాశాన్ని పెంచడమే కాకుండా.. సమయం, వనరులను ఆదా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అదనంగా, టీకాల పంపిణీ, నిల్వ సమస్యలు కూడా తగ్గుతాయి.






















