Pressure Cooker : ప్రెషర్ కుక్కర్ ఎన్నేళ్లు వాడితే ప్రమాదం.. మార్చకపోతే పిల్లలు, పెద్దలకు వచ్చే ఆరోగ్య సమస్యలివే
Pressure Cooker Safety Tips : పాత ప్రెషర్ కుక్కర్ ఎక్కువగా వాడుతున్నారా? ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. దీనిని ఎన్ని సంవత్సరాలు వాడొచ్చనేదానిపై సూచనలిస్తున్నారు.

Pressure Cooker Dangers : ప్రెషర్ కుక్కర్ దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిలో ఎక్కువమంది పప్పు వండుకుంటారు. మరికొందరు అన్నం, ఇతర కూరగాయలు కూడా ఎక్కువగా వండుకుంటారు. అయితే మీకు తెలుసా? ప్రెషర్ కుక్కర్ ఎక్కువకాలం ఉపయోగిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా కొందరు వాడిన కుక్కర్‌నే పదే పదే వాడుతూ ఉంటారు. అలా వినియోగించడం వల్ల కుక్కర్లో ప్రెషర్ వల్ల విడుదలయ్యే అల్యూమినియం నెమ్మదిగా శరీరంలోని రక్తం, ఎముకలు, మెదడులో పేరుకుపోతుందట. ప్రారంభంలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చని.. కాలక్రమేణా అది అలసట, జ్ఞాపకశక్తి, మూడ్‌స్వింగ్స్ వంటి లక్షణాలు చూపిస్తుందని చెప్తున్నారు. మరి ఎన్నాళ్లకు కుక్కర్‌ను మార్చాలి. ప్రెషర్ కుక్కర్ వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు మార్చాలి?
ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు మార్చాలనే అంశంపై ఆర్థోపెడిక్ వైద్యులు.. డాక్టర్ మనన్ వోరా కొన్ని సూచనలిచ్చారు. మీ ప్రెషర్ కుక్కర్ 10 సంవత్సరాల కంటే పాతదైతే, వెంటనే మార్చాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది పిల్లలపై ప్రమాదకరమైన ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మెదడు పెరుగుదల మందగించి.. IQని తగ్గిస్తుందని తెలిపారు.
వీటిని గుర్తిస్తే మార్చేయండి..
అలాగే ప్రెషర్ కుక్కర్లో కొన్ని మార్పులు చూస్తే కూడా వాటిని మార్చేయాలంటున్నారు. కుక్కర్ లోపల గీతలు లేదా నల్ల మచ్చలు కనిపిస్తే దానిని వాడడం ఆపేయాలంటున్నారు. మూత లేదా విజిల్ వదులుగా మారినా.. కుక్కర్లో వండిన ఫుడ్ నుంచి లోహపు వాసన వచ్చినా దానిని మార్చాలని సూచిస్తున్నారు. ఈ మార్పులు వాడుతున్న కుక్కర్ మానేయాలని సూచించే స్పష్టమైన సంకేతాలని చెప్తున్నారు.
శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుందంటే..
ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అనికేత్ ములే ప్రకారం.. పాత ప్రెజర్ కుక్కర్ల లోపలి భాగాల నుంచి లెడ్, అల్యూమినియం వంటి లోహాలు ఆహారంలోకి ప్రవేశించవచ్చట. ఇలా వెళ్లినవి పెద్దలపై, పిల్లలపై కొన్ని ప్రభావాలు చూపిస్తాయని తెలిపారు. ఎలాంటి పని చేయకున్నా.. నిరంతరం అలసట, చికాకుగా ఉంటుందట. అంతేకాకుండా జ్ఞాపకశక్తి సమస్యలు, మూడ్ స్వింగ్స్, రక్తపోటులో మార్పులు, మూత్రపిండాలపై ప్రభావం ఉంటుందట. ఇవి పెద్దల్లో ఉంటే.. చిన్నపిల్లల్లో మెదడు పెరుగుదల మందగించడం, IQ తగ్గడం, ప్రవర్తన సమస్యలు ఉంటాయని చెప్తున్నారు. అతి పెద్ద సమస్య ఏమిటంటే లెడ్ శరీరం నుంచి సులభంగా బయటకు పోదు. ఎక్కువ సంవత్సరాలు ఇది కొనసాగితే రక్తం, ఎముకల్లో అది పేరుకుపోతుందని.. కాబట్టి వీలైనంత తొందరగా వాటిని వినియోగం తగ్గించాలని సూచించారు.
ప్రతి పాత కుక్కర్ ప్రమాదకరమా?
ప్రతి పాత కుక్కర్ నుంచి విడుదలయ్యే లోహ పరిమాణం ఎక్కువగా ఉండకపోవచ్చు. చాలా సందర్భాల్లో దాని స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. విషం లాంటి ప్రభావం వెంటనే కనిపించదు. కానీ ఎక్కువ కాలం పాటు కొనసాగితే.. కొద్ది కొద్దిగా శరీరంలో పేరుకుపోయి శరీరంపై హాని కలిగిస్తుందట. ముఖ్యంగా పిల్లలపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని.. కాబట్టి వీలైనంత త్వరగా ప్రెషర్ కుక్కర్ మార్చాలని సూచిస్తున్నారు.






















