Relationships: నా భర్త నన్ను మోసం చేశాడు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు
మోసం చేసిన భర్తను క్షమించాలా? వద్దా? అని అడుగుతున్న ఒక భార్య ఆవేదన ఈ కథనం.
ప్రశ్న: మాది పెద్దలు చేసిన వివాహమే. కొంతకాలం నా భర్త బాగానే ఉన్నాడు. పెళ్లయిన రెండేళ్ల తరువాత అతను నన్ను మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించాను. బయట అమ్మాయిలతో షికారులు తిరుగుతున్నాడు. అవి నా కళ్ళారా చూశాను. ఎన్నోసార్లు ఆ విషయాన్ని ప్రశ్నించాను. మొదట్లో అలాంటిది ఏమీ లేదని తోసిపుచ్చాడు. తర్వాత సాక్ష్యాలతో పాటూ పట్టుకోవడంతో తప్పక ఒప్పుకున్నాడు. నాతో ఎన్నోసార్లు ఆ విషయంపై వాదనకు దిగాడు. కేవలం స్నేహం మాత్రమే చేస్తున్నానని చెప్పుకొచ్చాడు, కానీ నాకు తెలుసు వారిద్దరూ స్నేహం పరిధిని దాటి ఎప్పుడో ముందుకు వెళ్లారని. పెద్దల్లో పెట్టడానికి నేను సిద్ధమయ్యాను. అప్పటినుంచి తాను చేసింది తప్పేనని, సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. పెద్దలకు చెప్పవద్దని, పంచాయతీల్లో పెట్టవద్దు అని అంటున్నాడు. నేను అతన్ని క్షమించి తిరిగి అతనితో సంబంధాన్ని కొనసాగించాలా? లేక మోసం చేసే వ్యక్తిత్వం ఉన్న అతనితో తెగదెంపులు చేసుకొని ఆ బంధానికి స్వస్తి పలకాలా? అన్నది అర్థం కావడం లేదు. నాకు మీరే ఏదైనా సలహా ఇవ్వండి.
జవాబు: భార్యను మోసం చేస్తున్న భర్తల్లో మీ భర్త కూడా ఒకరు. ఇంట్లో రాముడిలా ఉండి వీధిలో అసలు రూపాన్ని చూపిస్తున్నారు. మీ భర్తను నమ్మడం కొంచెం కష్టమే. అన్ని విషయాలను సులువుగా క్షమించలేం. ముఖ్యంగా మోసాన్ని క్షమించడం చాలా కష్టం. ఆ మోసం కూడా వివిధ స్థాయిల్లో ఉంటుంది. భావోద్వేగాలను ప్రభావితం చేసేలా మోసం బయటపడితే దాని త్వరగా మర్చిపోలేదు మనసు. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మీ భాగస్వామి ఎల్లప్పుడూ మీ కంటికి కనిపిస్తూ, అతను చేసిన మోసాన్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా పెళ్లి అయినా రెండేళ్లలోనే ఇంత మోసాన్ని భరించడం ఇంకా కష్టం. అతనిపై నమ్మకాన్ని మీరు పూర్తిగా కోల్పోయారని అర్థమవుతుంది. అయితే మీ భర్తలో పశ్చాత్తాపం ఉందో లేదో మీరు గమనించండి. కొంతమంది చేసిన మోసం బయటపడ్డాక పశ్చాత్తాపం పొందుతారు. అలాంటి తప్పు చేయకుండా ఉంటే బాగుండేమో అనుకుంటారు. ఒక్క అవకాశం ఇస్తే తానేమిటో నిరూపించుకుంటానని, బలమైన భార్యాభర్తల బంధాన్ని కొనసాగిస్తానని అడుగుతారు. మీ భర్త ఆ కోవకు చెందిన వ్యక్తి అయితే మీరు ఆయనకు ఒక అవకాశాన్ని ఇవ్వవచ్చు. మరి కొందరు మాత్రం చేసిన మోసం బయట పడింది కనుక తప్పును ఒప్పుకుంటే ఒక పని అయిపోతుందని, గొడవ పెద్దగా జరగదని అనుకుంటారు. అలాగే ఆ తప్పును బయట పెట్టకుండా ఉండేందుకు కాళ్ళావేళ్ళా పడతారు. కానీ వారిలో మాత్రం మార్పు ఉండదు. బయట చేయాల్సిన పనులు మరింత రహస్యంగా చేస్తూనే ఉంటారు. ఈ రెండింటిలో మీ భర్త ఏ రకానికి చెందిన వాడో మీరే నిర్ణయించుకోవాలి.
మీ భర్తను వెంటనే నమ్మడం అంత సులభం కాదు కాబట్టి కొంత సమయం తీసుకోండి. అతని ప్రవర్తనను గమనించండి. కొన్ని రోజులు అతను మంచిగా ఉన్నట్టు నటించవచ్చు, కానీ ఎక్కువ కాలం నటించలేడు. కాబట్టి ఆ సమయాన్ని తీసుకుని ఇంతకుముందు మీరు ఎలా అతని ప్రవర్తనను తెలుసుకున్నారో అలాగే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అతని నిజాయితీగా ఉన్నాడని అనిపిస్తే బంధాన్ని కొనసాగించండి.
ముఖ్యంగా అతను బయట స్నేహాలను ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ బంధంలో ఏమైనా లోపం ఉందేమో తెలుసుకోండి. మీ సంబంధంలో శూన్యత ఏర్పడితే ఆ శూన్యతను పోగొట్టడానికి ప్రయత్నించండి. అతనికి మీరు బలంగా మారండి, స్నేహితురాల్లా ప్రవర్తించండి. మీరు దీని కోసం మీరు అతనితో కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. ఏ విషయంలో మీరు ఆయనకు నచ్చడం లేదో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అతనికి కావలసిన ఆప్యాయతా, ప్రేమ అందించండి. అవసరమైతే మానసిక వైద్యులను కలిసి కౌన్సిలింగ్ కూడా తీసుకోండి.
Also read: చరిత్రలో నిలిచిపోయిన విషాదం టైటానిక్, ఆ నౌకలో వండిన ఆహారాలు ఇవే