High BP: హైబీపీ బాధితులు కాఫీ తాగొచ్చా? రోజుకు ఎన్ని కప్పులు తాగితే సేఫ్?
మితంగా కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి మాత్రం అది మరణంతో సమానం.
మీ బీపీ 160/100 mm Hg లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందా? రోజు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగుతున్నారా? అలా చేస్తుంటే మీ ఆయుష్షు మీరే తగ్గించుకుంటున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగితే గుండె సంబంధిత వ్యాధులు వల్ల మరణించే ప్రమాదం రెట్టింపు అవుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే ఒక కప్పు గ్రీన్ టీ లేదా ఒక కప్పు కాఫీ తాగితే మాత్రం అటువంటి ప్రమాదం ఉండదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ తెలిపింది. ఇది కేవలం అధిక రక్తపోటు ఉండి కాఫీ తాగేవారికి మాత్రమే ఈ ఫలితాలు వర్తిస్తాయి.
రెండు పానీయాలలో కెఫీన్ ఉన్నప్పటికీ రోజుకి ఒక కప్పు కాఫీ, గ్రీన్ టీ తాగే వారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం లేదని పరిశోధకులు కనుగొన్నారు. 19 సంవత్సరాల సుదీర్ఘ అధ్యయనంలో ఇది తేలింది. ఇందులో 40 నుంచి 79 సంవత్సరాల వయస్సు ఉన్న 570 మంది పురుషులు, 12 వేల మంది మహిళలు పాల్గొన్నారు. కెఫీన్ గుండె ఆరోగ్యంపై ఎటువంటి ప్రయోజనాలు, హానికర దుష్ప్రభావాలు చూపిస్తుందనే దాని మీద కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక కప్పు కాఫీ ద్వారా 80 నుంచి 90ఏంజి కెఫీన్ పొందుతారు. ఇది బీపీ, హృదయ స్పందన రేటుని పెంచుతుంది. రక్తనాళాలు పరిమితం చేస్తుంది. అందుకే అధిక రక్తపోటు ఉన్న వారిలో ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా చూపిస్తుంది.
అలాగే మితిమీరిన కాఫీ తాగడం అనేది అధిక ఒత్తిడిని తీసుకొస్తుంది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గ్రీన్ టీ దీనికి పూర్తి విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంది. ఇందులో తక్కువ కెఫీన్ ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటుని తగ్గిస్తుంది. కాఫీ దుష్ప్రభావాలతో పాటు గ్రీన్ టీ ప్రభావాలని పరిశోధకులు పరిశీలించారు. ప్రతిరోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగడం తీవ్రమైన రక్తపోటు ఉన్న వారిలో గుండె సంబంధిత సమస్యల వల్ల వచ్చే మరణ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. అయితే కాఫీ మితంగా తీసుకుంటే మాత్రం అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మరికొన్ని అధ్యయనాలు నిరూపించాయి.
కాఫీతో ప్రయోజనాలూ ఉన్నాయ్
గుండెని ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు ఒక కప్పు కాఫీ తాగడం మంచిదే. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ నిరోధించవచ్చని మునుపటి అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాఫీని క్రమం తప్పకుండా తాగడం వల్ల కొన్ని దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుందని ఇతర అధ్యయనాలు వెల్లడించాయి. రోజుకి రెండు కప్పుల కాఫీతో సరిపెట్టుకుంటే సరిపోతుంది. దీని వల్ల శక్తి పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. డిప్రెషన్ దరిచేరదు, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాలేయాన్ని కాపాడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఉదయాన్నే కాఫీ కాదు, అరటి పండుతో రోజును స్టార్ట్ చేయాలట, ఎందుకో తెలుసా?