MIND Diet: విద్యార్థులు MIND డైట్ ఫాలో అయితే మతిమరుపు సమస్యే రాదు
చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు మైండ్ డైట్ చక్కగా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి అన్నం తినిపించేసరికి మనం తిన్న అన్నం కూడా అరిగిపోతుంది. ఏది కూడా ఇష్టంగా తినరు. వాళ్ళ వెనుక తిప్పించుకుంటూ సతాయిస్తారు. సరిగా తినకపోవడం వల్ల ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారిలో ఎదుగుదల మందగిస్తుంది. పాఠశాల వయసుకి వచ్చిన తర్వాత మతిమరుపు, చదివింది గుర్తు లేకపోవడం, నీరసంతో ఇబ్బంది పడుతుంటారు. అలా జరగకుండా ఉండాలంటే వారికి పాఠశాల వయసు నుంచి మంచి ఆహారం ఇవ్వాలి. అప్పుడే పెద్ద వయసులో వచ్చే అభిజ్ఞా క్షీణతను వారు ఎదుర్కోగలుగుతారు.
పిల్లల ఆరోగ్యం కోసం ఒక కొత్త అధ్యయనం రెండు రకాల ఆహార విధానాలను పరిశీలించింది. అమెరికన్ ఆహార మార్గదర్శకాల ఆధారంగా దీన్ని రూపొందించారు. గుండె ఆరోగ్యకరమైన మెడిటరెనియన్ DASH, ఇంటర్వెన్షన్ ఫర్ న్యూరోడెజెనరేటివ్ డిలే (MIND) డైట్. ఈ డైట్ ప్రకారం పిల్లలకు ఆహారం పెట్టడం వల్ల వారి మెదడు పని తీరు చక్కగా పని చేస్తుందని ఇల్లినాయిస్ నిపుణులు వెల్లడించారు. MIND ఆహారం పిల్లల అభిజ్ఞా అభివృద్ధిని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తేలింది. పాఠశాల విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
DASH, మెడిటరేనియన్ డైట్‌ల మాదిరిగానే MIND డైట్ లో తాజా పండ్లు, కూరగాయలు,బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు వంటి చిక్కుళ్ళు ఉన్నాయి. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆకు కూరలు, బెర్రీలు వంటి నిర్దిష్ట ఆహారాలు కూడా ఇందులో చేర్చారు. మైండ్ డైట్ పెద్దవారిలో సానుకూల ప్రభావాలని చూపుతున్నాయి. కానీ పిల్లలలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దాని మీద చాలా తక్కువ అధ్యయనాలు జరిగాయి.
అధ్యయనం వివరాలు
ఈ కొత్త పరిశోధన ఇల్లినాయిస్ నిపుణుల ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో పాల్గొన్న 85 మంది 7 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. వారి ఏడు రోజుల డైట్ రికార్డుని పరిశీలించారు. HEI-2015, MIND డైట్ స్కోర్‌లను లెక్కించారు. పనుల మీద వారికున్న శ్రద్ధ, ఏకాగ్రత, ఖచ్చితత్వం ఎలా ఉంటుందనేది పరిశీలించారు. ఆటిజం వంటి నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న పిల్లల్ని ఈ అధ్యయనం నుంచి మినహాయించారు.
MIND డైట్ స్కోర్‌ల కాకుండా వారికిచ్చిన టాస్క్ మీద ఎంత వరకు వారి ఎఫర్ట్ పెట్టారనే దాన్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. MIND డైట్ తీసుకున్న పిల్లలు వారికి ఇచ్చిన టాస్క్ లో మెరుగ్గా పని చేశారు. సాధారణంగా ఈ తరహా డైట్ పెద్దవారికి సిఫార్సు చేస్తారు. వయసు పెరిగే కొద్దీ వచ్చే అభిజ్ఞా క్షీణతను తగ్గించేందుకు ఈ డైట్ ను ఫాలో అవుతారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఈ డైట్ లో ఎక్కువగా తీసుకుంటారు. ఆకుకూరలు, బెర్రీలు, బీన్స్, తృణధాన్యాలు ఇందులో భాగంగా తీసుకుంటారు. చీజ్, రెడ్ మీట్, వేయించిన ఆహారాలకు మైండ్ డైట్ లో చోటు లేదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బ్లూ వైన్ ఎప్పుడైనా తాగారా? దీనికి అసలు ఆ రంగు ఎలా వచ్చిందో తెలుసా?