Phone Effect On Sperm: పురుషులకు బ్యాడ్ న్యూస్.. సెల్‌ఫోన్ అతిగా వాడేస్తే.. అది మటాషే! తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి
సెల్ ఫోన్ అతిగా వాడుతున్నారా? జాగ్రత్త.. మీ స్పెర్మ్ నాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. సంతాన సమస్యలు తప్పవు.
పురుషులకు బ్యాడ్ న్యూస్.. మీరు సెల్‌ఫోన్ అతిగా వాడితే.. భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలు తప్పవని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. సెల్ ఫోన్ లేదా మొబైల్ ఫోన్ వాడకం వల్ల స్పెర్మ్ (వీర్యం) నాణ్యత తగ్గిపోతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా పరిశోధనలో తేలిన కీలక అంశాలను ఇటీవల ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించారు.
‘మెటానాలిసిస్’ ప్రకారం.. సంతానోత్పత్తి గురించి ఆందోళన చెందుతున్న పురుషులు స్పెర్మ్ నాణ్యతను రక్షించడానికి సెల్ ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలని అధ్యయనంలో పేర్కొన్నారు. సెల్‌ఫోన్‌లు విడుదల చేసే రేడియోఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్‌లు (RF-EMWs) స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుందని తెలిపారు. వాటి వల్ల స్మెర్మ్‌లోని కణాలు చలనశీలతను కోల్పోతాయని స్పష్టం చేశారు. ఎందుకంటే.. స్పెర్మ్ లేదా శుక్రకణాలు చురుగ్గా అండం వైపు కదిలినప్పుడే గర్బధారణ సాధ్యమవుతుంది. లేకపోతే ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు.
నేషనల్ యూనివర్శిటీలో ముఖ్య పరిశోధకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ యున్ హక్ కిమ్ ఈ అధ్యయనం గురించి మాట్లాడుతూ.. ‘‘పురుషలు సెల్-ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే వారి స్పెర్మ్ నాణ్యంగా ఉంటుంది. ఇదివరకటి పరిశోధనల్లో కూడా సెల్ ఫోన్‌లు విడుదల చేసే RF-EMWలను మానవ శరీరం గ్రహిస్తుందని, అవి మెదడు, గుండె, పునరుత్పత్తి పనితీరుపై ప్రతికూల దుష్ప్రభావాలకు దారితీస్తాయని వెల్లడైంది’’ అని పేర్కొన్నారు.
సెల్ ఫోన్‌లు, స్పెర్మ్ నాణ్యత ప్రభావాలపై 2012 నుంచి అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా పరిశోధకులు పురుషులు RFకి గురికావడం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి మెటా-అనాలసిస్ (meta-analysis) పేరుతో ఆయా అధ్యయనాలను విశ్లేషించేందుకు సమీక్ష నిర్వహించారు. సెల్ ఫోన్ల నుండి వచ్చే EMWలు పురుషుల స్పెర్మ్ నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా 2012-2021 మధ్య ప్రచురించిన 435 అధ్యయనాల్లోని రికార్డులు, గణాంకాలను విశ్లేషించారు. అయితే, పురుషులు ఎంత సేపు సెల్‌ఫోన్లతో గడిపితే స్పెర్మ్ నాణ్యత దెబ్బ తింటుందనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. పైగా.. ఈ అధ్యయనాలు 2012 నుంచి జరగడం వల్ల అప్పటి ఫోన్ల రేడియేషన్‌కు, ఇప్పటి ఫోన్లకు చాలా వ్యత్యాసం ఉండవచ్చని పరిశోధకులు అంటున్నారు.
‘‘ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫోన్లు ఏ స్థాయిలో RF-EMW విడుదల చేస్తున్నాయో తెలుసుకుని, దానికి అనుగుణంగా అధ్యయనం జరపాల్సి ఉంది. అలాగే.. ఎంత సేపు సెల్‌ఫోన్ వాడితే.. స్పెర్మ్‌కు నష్టం కలుగుతుందనేది కూడా తెలుసుకోవలసి ఉంది’’ అని కిమ్ అన్నారు. ఏది ఏమైనా.. సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కేవలం స్పెర్మ్‌కు మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. కాబట్టి సెల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.