Karnataka: ఊరికి రోడ్డేసే వరకు పెళ్లిచేసుకోను... యువతి శపథం... దిగొచ్చిన సీఎం
రోడ్డు లేక తమ గ్రామస్థులు పడే పాట్లు చిన్నప్పట్నించి చూసిందా యువతి. చివరికి ఆమెనే చొరవ తీసుకుని రహదారులు వచ్చేలా చేసింది.
రోడ్డు లేదు, బస్సు రాదు... ఎన్నాళ్లిలా? తమ గ్రామ దుస్థితిపై ఆ యువతికి చాలా అసహనం కలిగింది. రోడ్డు రావాలంటే ఎవరో ఒకరు పోరాటం మొదలుపెట్టాలి? అధికారుల్ని కదిలించాలి? ఎవరో ఎందుకు తానే వేసింది మొదటి అడుగు. తనతో పాటూ మరింత మంది నడుస్తారనుకుంది కానీ, ఆ అవసరం లేకుండా రాష్ట్ర సీఎం స్వయానా కల్పించుకుని మరీ ఆ గ్రామానికి రోడ్డు వేయమని ఆదేశించాడు. తప్పదు మరి, ఆమె చేసిన శపథం అలాంటిది. ఇంతకీ ఎవరా అమ్మాయి?
ఆర్ డి బిందు... సాధారణ స్కూల్ టీచర్. వయసు 26 ఏళ్లు. ఉండేది కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని రామ్ పురా అనే గ్రామంలో. బిందు ఎకనామిక్స్ లో పీజీ చేసింది. రామ్ పురా గ్రామంలో నివసించేది కేవలం 300. జనాభా తక్కువ కాబట్టే గ్రామాన్ని ఎవరూ పట్టించుకోకుండా వదిలేశారేమో. కానీ బిందు వదిలేయలేదు. చిన్నప్పట్నించి సరైన రోడ్లు లేక తన తల్లిదండ్రులు గ్రామస్థులు పడే బాధలు చూసింది. ఆ ఊరిలో అయిదు తరగతి వరకే పాఠశాల ఉంది. ఆ తరువాత చదువులకోసం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు సరిగా లేక, బస్సుల్లేక చాలా మంది పిల్లలు బడి మానేశారు. బిందు మాత్రం అలా కష్టపడుతూనే చదివింది. చాలా సార్లు 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేది. ఇది జరిగి 15ఏళ్లు గడిచినా గ్రామంలో ఏ మార్పు లేదు. అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకునే వాడే లేడు.
ఇప్పుడు బిందుకి పెళ్లి చేయాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే... ఇదే రోడ్లతో తన అమ్మానాన్నతో సహా, గ్రామస్థులంతా ఇబ్బందులు పడుతూనే ఉండాలి, తానే ఏదో ఒకటి చేయాలనుకుంది బిందు. కర్ణాటక సీఎంకు మెయిల్ పెట్టింది. తమ ఊరికి రోడ్డు వచ్చేవరకు తాను పెళ్లి చేసుకునేది లేదని శపథం చేస్తున్నట్టు రాసింది. కేవలం రోడ్డు బాగోలేక గ్రామంలో ఎంతో మంది ఆడపిల్లలు చదువును మధ్యలో ఆపేశారని చెప్పింది. ‘మా పెద్దవాళ్లు చెప్పారు... స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గ్రామానికి రోడ్డు కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇంతవరకు ఫలించలేదని. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా గతుకుల రోడ్లపై నడుచుకునేవెళ్లాలి. పండిన పంటలను నగరాలకు తీసుకెళ్లి అమ్మాలన్న కూడా రైతులకు చాలా కష్టమవుతోంది. ఏ ట్రక్కు కూడా మా ఊరు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. దానికి కారణం ఈ చెత్తరోడ్లు’ అని ఘాటుగా విమర్శించింది.
ఆ మెయిల్ సారాంశం కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మే వరకు చేరింది. ఆయన ఆదేశాల మేరకు అధికారులు రామ్ పురా గ్రామానికి వచ్చారు. కొలతలు తీసుకుని రహదారులు నిర్మిస్తామని, త్వరలోనే బస్సు సర్వీసు కూడా మొదలుపెడతామని చెప్పి వెళ్లారు. బిందు మాత్రం తాను మాట మీదే నిలబడతానని, రహదారులు వచ్చాకే పెళ్లని ఇంట్లోవారికి కూడా తెగేసి చెప్పింది. ఒకమ్మాయి చొరవ ఆ ఊరికి రోడ్డు వచ్చేలా చేస్తోంది.