Baby Health: పిల్లలకు చెప్పులేయొద్దు, కాసేపు పాదాలను నేలను తాకనివ్వండి - ఎందుకంటే..
బుడి బుడి అడుగులు వేసే బుజ్జాయిలు పచ్చని పచ్చిక మీద నడిస్తే అనేక లాభాలు ఉన్నాయట. అదెలా అనుకుంటున్నారా? అయితే, తెలుసుకోండి.
మాతృత్వం ప్రతీ మహిళ కల. తొలిసారిగా తల్లి అవుతుంటే ఆ మహిళ సంతోషం మాటల్లో వర్ణించలేరు. ఇక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కన్న బిడ్డ బుడి బుడి అడుగులు వేస్తుంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. మంచాలు, కుర్చీలు పట్టుకుని వాళ్ళు అడుగులు వేస్తుంటే చెప్పలేనంత ఆనందం పొందుతారు. కానీ ఇప్పుడు కొంతమంది తల్లి దండ్రులు పిల్లల కాళ్ళకి ఎక్కడ మట్టి అంటుతుందో, ఎర్రగా అయిపోతాయోనని సాక్స్ వేసేస్తున్నారు. చెప్పులు వేసి నడిపిస్తున్నారు. కానీ పాదాలకి మట్టి తగడలం వల్ల ఆరోగ్యానికి మంచిదని, గడ్డి మీద నడిపించడం ఇంకా మంచిదని నిపుణులు చెప్తున్నారు.
ప్రముఖ టీవీ నటి డెబినా బెనర్జీ తన పెద్ద కూతురు లియానాని గడ్డిలో నడిపిస్తున్న ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. నేల మీద లేదా గడ్డి మీద చెప్పులు లేకుండా పిల్లల్ని నడిపించడం ఆరోగ్యానికి మంచిదని రాసుకొచ్చారు. పగటి పూట కాసేపు అలా ప్రాక్టీస్ చేయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆమె అంటున్నారు. ఆమె చెప్పింది నిజంగా వాస్తవమే అని చెప్పాలి. నిపుణులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇది పెద్దలకి మరింత ప్రయోజనాలు చేకూరుస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ 2012లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది.
చెప్పులు లేకుండా ఇంటి బయట నడవడం, పని చేయడం వంటివి చేసే ఆరోగ్యానికి చాలా మంచిదని సదరు అధ్యయనంలో పేర్కొంది. పాదాలు మట్టి, భూమిని తాకడం వల్ల దాని ఎలక్ట్రాన్ లు శరీరానికి కనెక్ట్ అవుతాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్తున్నారు. ఇలా నడవడం వల్ల మంచి నిద్ర, శరీరంలోని నొప్పులు తగ్గిపోతాయని అంటున్నారు. నిజానికి పిల్లలు కూడా గడ్డి లేదా మట్టి మీద చెప్పులు లేకుండా నడవటం వల్ల పెద్దల కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెప్పుకొచ్చారు.
చెప్పులు లేకుండా నడవడం వల్ల ప్రయోజనాలు
ఇప్పుడు అందరూ చెప్పులు లేకుండా నడవటం అంటే కష్టంగా భావిస్తున్నారు. దీని వల్ల మదర్ ఎర్త్ సహజ అయస్కాంత క్షేత్రంతో తమ సంబంధాన్ని కోల్పోతున్నారు. అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. భూమి మీద సహజ శక్తిని శరీరానికి కనెక్ట్ చేయడం ద్వారా ప్రతికూల ప్రభావాలు వస్తాయని వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు. ఎదుగుతున్న ప్రతి బిడ్డకి ప్రకృతితో సమయం గడపడం అనేది వారి ఎదుగుదలకి సహకరిస్తుంది.
పిల్లలు నేలపై నడవం వల్ల లాభాలు
⦿ గడ్డి మీద పసి పిల్లలు నడవడం వల్ల కండరాలు స్నాయువులు బలోపేతం అవుతాయి. శరీరంలో స్థిరత్వం పెరుగుతుంది. అరికాళ్లు భూమిని తాకడం వల్ల శరీరం సిర్కాడియన్ రిథమ్‌కు సహాయపడుతుంది. దీని వల్ల శిశువులు బాగా నిద్రపోవడానికి, ఆహారం జీర్ణం కావడానికి సహకరిస్తుంది.
⦿ గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వారి స్పర్శ గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇది వారి వెస్టిబ్యులర్, ప్రొప్రియోసెప్టివ్ సిస్టమ్‌లను నిర్మించడంలో సహాయం చేస్తుంది. పచ్చటి గడ్డిపై నడవటం వల్ల పరిసరాల గురించి అవగాహన వస్తుంది. నరాలని ప్రేరేపించడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నోరు దుర్వాసన వస్తోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో చెక్ చెప్పేయండి