Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Ghee Guidelines in Trains : రైలులో నెయ్యి తీసుకెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రైల్వే మార్గదర్శకాలను తెలుసుకోవడం ముఖ్యం. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే.. ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

Carrying Ghee During Train Travel : భారతీయ రైల్వేలు ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తున్నాయి. ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం నుంచి సామాను ప్యాక్ చేయడంతో ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్యాకింగ్ చేసేప్పుడు డ్రెస్లతో పాటు కొన్ని ఆహార పదార్థాలు, గృహోపకరణాలు ప్యాక్ చేస్తారు. కానీ మీకు తెలుసా? రైలు ప్రయాణంలో కూడా సామాను విషయంలో అనేక నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం మీరు ఏమి తీసుకెళ్లవచ్చు.. ఎంత తీసుకెళ్లవచ్చు.. వాటిని ఎలా ప్యాక్ చేయాలి? అనేవాటిపై మార్గదర్శకాలు ఉన్నాయి.
రోజూవారీ ఉపయోగించే నెయ్యిని రైలులో తీసుకెళ్లొచ్చా? సరైనదా కాదా? అనే నియమాలు తెలియకుండానే నెయ్యి ప్యాక్ చేస్తారు. తరువాత ఇబ్బందుల్లో పడతారు. అందువల్ల ప్రయాణించే ముందు నెయ్యికి సంబంధించి ఉన్న రైల్వే నిబంధనలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల మీరు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ప్రయాణిస్తారు.
రైలులో నెయ్యి తీసుకెళ్లడానికి నియమాలు ఏమిటి?
నెయ్యి వంటి వస్తువులకు సంబంధించి భారతీయ రైల్వేలు స్పష్టమైన నియమాలను ఏర్పాటు చేశాయి. ప్రయాణీకులు రైళ్లలో నెయ్యిని తీసుకెళ్లవచ్చు. కానీ ఒక పరిమితి ఉంది. రైల్వేల ప్రకారం.. ఒక ప్రయాణీకుడు గరిష్టంగా 20 కిలోగ్రాముల నెయ్యిని తీసుకెళ్లవచ్చు. రైల్వే సిబ్బంది నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఎక్కువ పరిమాణంలో నెయ్యిని అనుమతిస్తారు. నెయ్యిని టిన్ కంటైనర్ లేదా దృఢమైన కంటైనర్‌లో నిల్వ చేయాలి. గట్టిగా మూసివేయాలి.
ప్రయాణ సమయంలో తెరుచుకోకుండా లేదా లీక్ అవ్వకుండా ప్యాకేజింగ్ ఉండాలి. వదులుగా ఉండే కంటైనర్లు, నాసిరకం ప్యాకేజింగ్ లేదా లీకేజీకి గురయ్యే ప్లాస్టిక్ బాటిళ్లు సురక్షితమైనవిగా పరిగణించరు. ప్యాకేజింగ్ సరిగ్గా లేకపోతే.. రైల్వే సిబ్బంది వస్తువులను తొలగించడం లేదా జప్తు చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు.
ఈ నియమం ఎందుకంటే..
నెయ్యి ఒక సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ రైలు వంటి మూసివేసిన వాతావరణంలో ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది. నెయ్యి లీక్ అయితే.. నేల జారేలా మారుతుంది. ప్రయాణికులు పడిపోయే ప్రమాదం పెరుగుతుంది. ఇంకా నెయ్యి మండే గుణం కలిగి ఉంటుంది. లీక్ అయితే మంటలు కూడా సంభవించవచ్చు. అందుకే రైల్వేలు దాని పరిమాణం, ప్యాకేజింగ్ విషయంలో కఠినమైన నిబంధనలను ఏర్పాటు చేశాయి.
ఏ చర్యలు తీసుకుంటారంటే..
ఒక ప్రయాణీకుడు అనుమతి లేకుండా 20 కిలోల కంటే ఎక్కువ నెయ్యిని తీసుకెళ్తే.. వారిపై చర్య తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం సరికాని ప్యాకింగ్ ఉంటే జప్తు చేసి జరిమానా వేస్తారు. కాబట్టి ప్రయాణించే ముందు ఈ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని.. నెయ్యి లేదా అలాంటి ఇతర వస్తువులను ప్యాక్ చేయడం మంచిది. తద్వారా సురక్షితమైన, ఆందోళన లేని ప్రయాణం సాధ్యమవుతుంది.






















