Diabetes: భోజనం చేశాక కాసేపు నడిస్తే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం, చెబుతున్న పరిశోధకులు
నడక మంచిదే, అదే మధుమేహులకైతే మరీ మంచిది.
నడకను మించిన ఉత్తమ వ్యాయామం లేదు. ఎవరైనా సరే రోజుకు అరగంట నడిచినా చాలు వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు వాకింగ్ చేయడం వల్ల మరింతగా ప్రయోజనాలు ఉన్నాయి. వారు భోజనం చేశాక 60 నుంచి 90 నిమిషాల పాటూ నడవడం వల్ల చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయి. ఎందుకంటే ఆహారం తిన్నాకే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వాకింగ్ చేయడం వల్ల అలా పెరగకుండా అడ్డుకోవచ్చు.
ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం ఒక అధ్యయనంలో కూర్చోవడం, నడవడం వంటివి ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలు, గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. భోజనం తరువాత తేలికగా నడవడం వల్ల కేవలం అయిదునిమిషాల వ్యవధిలోనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడాన్ని అధ్యయనంలో గుర్తించారు. అంటే నడక చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.
మనకే ముఖ్యం
ఈ పరిశోధన ముఖ్యంగా భారతీయులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఫోర్టిస్-సి-డిఓసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్, మెటబాలిక్ డిసీజెస్ అండ్ ఎండోక్రినాలజీ చైర్మన్ అనూప్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే మనం అన్నాన్ని అధికంగా తింటాము.బియ్యంలో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువ. వీటిని నియంత్రించడం కష్టం. అయితే నడక మాత్రం సులువుగా నియంత్రించేస్తుంది. అయితే గుండె జబ్బులు ఉన్న వారు మాత్రం భోజనం చేశాక నడవడం వంటి పనులు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే గుండెకు రక్తాన్ని చేరకుండా అడ్డుకునే అవకాశం ఉంది.
టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిపై 2016లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర సమయాల్లో నడక కన్నా తిన్న తరువాత నడక వల్ల చాలా మేలు జరుగుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జనరల్ మెడిసిన్‌లో ప్రచురించిన మరో అధ్యయనం ప్రకారం భోజనం చేసిన తర్వాత నడవడం బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
కాబట్టి మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశాక కనీసం పావుగంటైనా నడవడం చాలా ఉత్తమమైన పద్ధతి. మధుమేహం అదుపులో ఉండడం ఖాయం.
Also read: టెస్టోస్టెరాన్ హార్మోనుకు మెంతులు ఎంత ఉపయోగమో తెలుసా? అందుకే మగవారు వాటిని మెనూలో చేర్చుకోవాల్సిందే
Also read: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.